విందు భోజనంలో పాన్‌లాగా... సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్. మాస్‌ను ఉర్రూత లూగించడానికి ఈ ఐటమ్ సాంగ్స్‌ను మించిన సాధనం లేదు. నిన్న మొన్నటి వరకు ఐటమ్ సాంగ్స్ కోసం జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మిత, అభినయశ్రీ లాంటివాళ్లు ఉండేవారు. ఇప్పుడ లాంటి పరిస్థితి లేదు. హీరోయిన్లే ఆ ప్లేస్‌ను కూడా కబ్జా చేసేస్తున్నారు. స్పెషల్‌గా బాలీవుడ్‌లో అయితే టాప్ హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్‌తో థియేటర్లను ఊపేస్తున్నారు. బాలీవుడ్‌లో కరీనాక పూర్ నుంచి టాలీవుడ్‌లో శ్రుతీహాసన్ వరకూ టాప్ హీరోయిన్లందరూ ఈ లిస్ట్‌లో ఉన్నారు.
కేక పుట్టించిన షీలా!
అది 2010వ సంవత్సరం. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘తీస్‌మార్ ఖాన్’ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అందులో ఓ పాట మాత్రం ప్రేక్షకుల నోళ్లల్లో నానింది. హాలు నుంచి బయటకు వచ్చిన వాళ్లు కథ గురించి ఆలోచించ కుండా ఓ ఐటమ్‌సాంగ్‌ను హమ్ చేసుకుంటూ వెళ్లారు. అదే ‘మై నేమ్ ఈజ్ షీలా... షీలా కీ జవానీ...’. కత్తి లాంటి కత్రినా అందాల సోయగాలు... హుషారెత్తించే సంగీతం... వెరసి ఈ పాట ప్రేక్షకులకు మత్తెక్కించింది. అప్పటి నుంచీ కత్రినా ఓ పక్క హీరోయిన్‌గా చేస్తూనే, ప్రత్యేక గీతాల్లో కూడా నర్తిస్తున్నారు. ఆ తర్వాత హృతిక్‌రోషన్ హీరోగా నటించిన ‘అగ్నిపథ్’లో ‘చిక్‌నీ చమేలీ...’ పాట లో నర్తించారు. ఈ ఐటమ్‌సాంగూ హిట్. తర్వాత సల్మాన్‌ఖాన్ ‘బాడీగార్డ్’లో ఓ పాటలో కనిపించి మురిపించారామె.
‘ఫేవికాల్’తో తిష్ఠ వేసిన మేరీ
‘క్యా లవ్ స్టోరీ హై’లో మొదటిసారి కరీనా కపూర్ ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఆ తర్వాత షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘బిల్లూ’లో షారుక్‌తో కాలు కదిపారు. ఇక ఆమెకు పేరు తీసుకొచ్చిన పాట మాత్రం ‘దబంగ్-2’ లో ‘ఫేవికాల్ సే’. ఆ పాటలో ఆమె ఒలికించిన హొయలు కుర్రకారు ఇప్పటికీ మర్చిపోలేదు. రానున్న ‘బ్రదర్స్’లో ‘మేరా నామ్ మేరీ’ పాటతో స్వీట్ షాక్ ఇచ్చారామె.
ప్రియాంక లీల...
‘రామ్ చాహే లీలా’ అంటూ ‘రామ్‌లీలా’లో రణ్‌వీర్ సింగ్ ముందు తెగ ఒయ్యారాలు పోయారు ప్రియాంకా చోప్రా. అదిరిపోయే స్టెప్స్‌తో కెపైక్కించే అందాలతో ప్రియాంక ఆ పాటకు వన్నె తెచ్చారు. అప్పట్లో ఈ సినిమా కన్నా ముందే ఈ పాట సూపర్ హిట్టై కూర్చుంది. అంతకు ముందు సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘షూట్ ఔట్ ఎట్ వడాలా’లో ప్రత్యేక గీతంలో నర్తించారు.
ధమ్ చూపించిన దీపిక
‘దమ్ మారో దమ్’ అంటూ జీనత్ అమన్ ఆనాటి తరాన్ని ఉర్రూతలూగించారు. ఇప్పటికీ ఆ పాట సూపర్ హిట్. అదే పాటను రీమిక్స్ చేస్తే? ఆ ఆలోచన దర్శకుడు రోహన్ సిప్పీకి వచ్చింది. వెంటనే ఆయన మనసులో మెదిలిన నాయిక దీపికా పదుకొనే. ‘ఓం శాంతి ఓం’లో గుండెల్లో గుబులు రేపారామె. మొదటి సారి దమ్ మారో దమ్ సినిమా కోసం ఈ ప్రత్యేక గీతంలో నర్తించారు. చేసింది ఒక్క పాటైనా యూత్ గుండె ల్లో వేడి రాజేసారామె.
ఆల్ ఈజ్ వెల్... సోనాక్షీ
గ్లామర్ నాయికగా ‘రౌడీ రాథోడ్, హాలీడే’ లాంటి చిత్రాల్లో నటిస్తూనే ఓ పక్క ‘లుటేరా’ లాంటి అభినయానికి ఆస్కారమున్న చిత్రాల్లో కూడా చేశారు సోనాక్షీ సిన్హా. అంతకు ముందే సోనాక్షీ సిన్హా ‘ఓ మై గాడ్’ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి స్టెప్పు లేశారు. అయితే అది ఐటమ్ సాంగ్ కాదు. తాజాగా ఆమె ‘ఆల్ ఈజ్ వెల్’లో అభిషేక్‌తో ఐటమ్‌సాంగ్‌కి చిందులేశారు. ఆ పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
హార్ట్ జంక్షన్‌లో ట్రాఫిక్ జామ్!
తెలుగు సంగతికొస్తే, ఈ మధ్యే ‘‘జంక్షన్‌లో....అరె జంక్షన్‌లో...’’అంటూ మాస్ పల్స్ బీట్ పెంచేసి, హార్ట్ ఎటాక్ తెప్పించినంత పనిచేశారు శ్రుతీహాసన్. ‘ఆగడు’లోని ఈ ఐటమ్ సాంగ్ తనకు ఫస్ట్ టైమ్ అయినా చెలరేగిపోయారు శ్రుతి. ఆ తర్వాత ‘ఒక్కడు’ హిందీ రీమేక్ ‘తేవర్’లో ఆమె చేసిన ప్రత్యేక గీతం బాలీవుడ్ జనాలకు కిక్ ఇచ్చింది. విశేషం ఏమిటంటే ఈ రెండు పాటలను ఆమే స్వయంగా ఆలపించారు.
లబ్బరు బొమ్మ...లంగరేసింది
తెలుగు, హిందీ భాషల్లో బిజీ బిజీగా ఉన్న టైమ్‌లోనే మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించారు. అదే ‘అల్లుడు శీను’. బెల్లం కొండ శ్రీనివాస్‌తో ‘ నా ఇంటి పేరు సిల్క్...నా ఒంటి పేరు మిల్క్ ’అంటూ మాస్ టెంపరేచర్ రైజ్ చేశారామె. ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా సినిమాలో తమన్నా ఐటమ్‌సాంగ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇలియానాతో కూడా అఖిల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయించాలని వినాయక్ అనుకుం టున్నారట. మొత్తానికి, హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ కబ్జా చేయడం ఇప్పుడి ప్పుడే ఆగేలా లేదు.
- శశాంక్ బూరుగు
ఐటమ్... హీరోయిన్స్
Published Wed, Aug 5 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement