సాక్షి, న్యూఢిల్లీ : మన చరిత్రను కాపాడే విధంగా విద్యావిధానంలో మార్పులు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సంబరాలు, పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కలసి ప్రముఖ నటుడు జగపతిబాబును అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
అలాగే ఐఎఫ్‌ఎఫ్‌సీవో ఎండీ, సీఈవో ఉదయ్‌శంకర్‌కు కూడా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతిని భావితరాలకు అందించే వేదికలని, ఉగాది జీవితంలోని వివిధ రకాల అనుభవాలు, అనుభూతులకు ప్రతీక అన్నారు. విదేశీ సంస్కృతిలో పడి తెలుగు భాషను మర్చిపోతున్నారని, తల్లిదండ్రులు ఇంట్లోనైనా తమ పిల్లలతో తెలుగులో మాట్లాడాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.
ఉద్యోగ రత్న అవార్డులను ఉక్కుశాఖ కార్యదర్శి అరుణ శర్మ, మార్గదర్శి గ్రూప్ ఎండీ శైలజా కిరణ్ అందుకున్నారు. మరో 8 మందికి ప్రతిభ భారతి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మోహన్‌కందా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రవీణ్ ప్రకాశ్, సినీనటి రమ్యకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఎం శ్రీలేఖ, విజయలక్ష్మీ, సాకేత్, రోహిత్, మనీషా ఇరబతినిల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment