‘ఆయనతో నటించాలని ఉంది’ | janani Iyer wants to act with mahesh babu | Sakshi
Sakshi News home page

‘ఆయనతో చేయాలని ఉంది’

Published Thu, Dec 28 2017 7:10 PM | Last Updated on Thu, Dec 28 2017 7:15 PM

janani Iyer wants to act with mahesh babu - Sakshi

సాక్షి, సినిమా: సినిమా రంగంలో ఇవాళ ఒక్క భాషలో నటిస్తూ పోతే చాలదు. మార్కెట్‌ను పెంచుకోవాలంటే పలు భాషా చిత్రాల్లో నటించాలి. నయనతార నుంచి సమంత, అమలాపాల్, సాయిపల్లవిల వరకూ మాతృభాషల నుంచి ఇతర భాషలోకి తమ మార్కెట్‌ను విస్తరించుకుంటూ కథానాయికలుగా రాణిస్తున్నారు. అదే విధంగా నటి జననీ అయ్యర్‌ నటిగా తన పరిధిని పెంచుకోవాలని ఆశ పడుతోంది. అచ్చ తమిళ అమ్మాయి అయిన ఈ బ్యూటీ అవన్‌ ఇవన్, తెగిడి వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన పాగన్‌ వంటి కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో కాస్త వెనుక పడినా తాజాగా బెలూన్‌ చిత్రంతో తన సత్తా చాటుకుంటోంది. ఇందులో మరో నాయకిగా అంజిలి నటించిందన్నది గమనార్హం. నటుడు జై హీరోగా నటించిన ఈ లవ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి జననీ అయ్యర్‌తో చిట్‌చాట్‌..

మీరూ మోడలింగ్ రంగం నుంచి వచ్చిన నటేననుకుంటా?
అవును. చెన్నైలో పుట్టి పెరిగి చదివిన నేను 150 వరకూ వాణిజ్య ప్రకటనల్లో నటించాను. అయితే సినిమాల్లో నటించాలన్నది నాకు ఫ్యాషన్‌. అందుకే తొలుత తిరు తిరు తురు తురు చిత్రంలో మోడల్‌గానే చిన్న పాత్రలో నటించాను. ఆ తరువాత గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలోనూ విన్నైతాండి వరువాయా చిత్రంలో సహాయదర్శకురాలిగా నటించాను. హీరోయిన్‌గా నా మొదటి చిత్రం బాలా దర్శకత్వం వహించిన అవన్‌ ఇవన్‌. అలా కథానాయకిగా నా ప్రస్థావన మొదలైంది.

బాలా వంటి సంచన దర్శకుడి చిత్రంలో నటించినా మీరింకా సక్సెస్‌ కోసం పోరాడుతూనే ఉన్నారే?
సక్సెస్‌ కాలేదనడం కర్టెక్‌ కాదు. కథానాయకిగా నా తొలి చిత్రం అవన్‌ ఇవన్‌ చిత్రంతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. అదే విధంగా తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మీరన్నట్లు ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో మంచి పాత్ర అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నాను.

మలయాళంలోనూ నటిస్తున్నట్లున్నారు?
అవును అక్కడ 3 డాట్స్‌ అనే చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యాను. అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి  .ప్రస్తుతం హ్యాపీబర్త్‌డే చిత్రంలో నటిస్తున్నాను.

మరి టాలీవుడ్‌లో నటించాలన్న ఆసక్తి లేదా?
నిజం చెప్పాలంటే తెలుగు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.అన్ని చిత్రాలు చూస్తాను.తెలుగులో నటించాలన్న ఆకాంక్ష చాలానే ఉంది.అయితే అక్కడ నాకు మేనేజర్‌ లేరు.

తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు?
పవన్‌కల్యాణ్, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఇలా చాలా మంది హీరోలంటే ఇష్టం.ముఖ్యంగా మహేశ్‌బాబుకు నేను అభిమానిని. ఆయనతో నటించాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను.

బెలూన్‌ చిత్రం గురించి?
బెలూన్‌ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఇందులో 1980లో జరిగే కథాభాగంలో నేను నటించాను. ఈ పాత్ర కోసం వేష, భాషాపరంగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే అప్పటి యువతిగా మారి నటించాననే చెప్పాలి. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న లక్ష్యంగా నటించాను. బెలూన్‌ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాద చిత్రంగా విడుదల కానుంది కాబట్టి తెలుగులోనూ నాకిది మంచి ఎంట్రీ అవుతుందనే నమ్మకం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement