నాని
నా కెరీర్లో గుర్తుండిపోయే జెండాపై కపిరాజు -నాని
Published Mon, Dec 30 2013 12:01 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
‘‘ఇరవై, ముప్ఫై ఏళ్ల అనుభవం ఉన్న నటులు మాత్రమే చేయగలిగే ఫీట్‌ని... అతి తక్కువ సమయంలో చేసే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా చిక్కింది. అది నిజంగా నా అదృష్టం. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జెండాపై కపిరాజు’’’ అని నాని అన్నారు. సముద్రఖని దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అమలాపాల్, రాగిణి కథానాయికలు. కె.ఎస్.శ్రీనివాసన్, శివరామన్ నిర్మాతలు. జీవి ప్రకాష్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి, నాని తండ్రి రాంబాబుకి అందించారు. ఈ సందర్భంగా నాని ఇంకా మాట్లాడుతూ- ‘‘‘ఆహా కల్యాణం’ షూటింగ్ కారణంగా ఈ సినిమాకు ఆడపాదడపా అంతరాయాలు ఏర్పడినా... సముద్రఖని భరించారు.
నా నుంచి ఉత్తమమైన నటన రాబట్టడానికి ఎంతో శ్రమించారు. నా నటన వల్ల ఈ సినిమా తెలుగులో వంద రోజులు ఆడితే... ‘జయం’రవి పెర్‌ఫార్మెన్స్‌కు తమిళంలో 175 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ‘‘నేను ప్రొడ్యూసర్ కొడుకుని. హీరో అవ్వడం నాకు పెద్ద విషయం కాదు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా నాని హీరోగా ఎదిగాడు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. సినిమానే శ్వాసిస్తాడు తను. సినిమా కోసమే పుట్టాడా అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అని ‘జయం’ రవి విశ్వాసం వెలిబుచ్చారు. చేసే పని పట్ల నానీ చూపించే నిబద్ధత చాలా గొప్పదని, భవిష్యత్తులో గొప్ప హీరో అవుతాడని సముద్రఖని కొనియాడారు.
మంచి కథ, అందుకు తగ్గట్టు శక్తిమంతమైన టైటిల్, అన్నింటికంటే ముఖ్యంగా మంచి యూనిట్ కుదిరింది. కాబట్టి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించడం తథ్యం అని నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసన్ తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కల్యాణ్, ఆర్.కె.సెల్వమణి, తనికెళ్ల భరణి, కె.ఎల్.దామోదరప్రసాద్, మల్టీ డైమన్షన్ వాసు, రజత్ పార్థసారథి, డీఎస్‌రావు, రాజ్, డీకె, పైడిపల్లి వంశీ, సంతోష్ శ్రీనివాస్, అల్లరి నరేష్, శర్వానంద్, వరుణ్‌సందేశ్, నిఖిల్, సుధీర్‌బాబు, శివబాలాజీ, టి.ప్రసన్నకుమార్, మధుమిత, రాగిణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement