అమ్మ అడుగుజాడల్లో... | Janhvi Kapoor Resumes Work After Mother Sridevi's Death | Sakshi
Sakshi News home page

అమ్మ అడుగుజాడల్లో...

Published Sat, Mar 10 2018 12:32 AM | Last Updated on Sat, Mar 10 2018 12:32 AM

Janhvi Kapoor Resumes Work After Mother Sridevi's Death  - Sakshi

ధడక్‌ షూట్‌లో జాన్వీ కపూర్‌

‘అచ్చంగా అమ్మలానే’... జాన్వీ కపూర్‌ గురించి ‘ధడక్‌’ టీమ్‌ అంటున్న మాటలివి. చూడ్డానికి తల్లి శ్రీదేవిలానే జాన్వీ ఉంటుంది కాబట్టి అలా అన్నారా? అంటే.. ఊహూ. ఇది ‘క్రమశిక్షణ’ గురించి. తల్లి మరణించి పట్టుమని పదిరోజులు కూడా గడవకముందే ‘ధడక్‌’ లొకేషన్‌లో కాలుపెట్టారు జాన్వీ కపూర్‌. యాక్చువల్లీ జాన్వీ లాంగ్‌ బ్రేక్‌ తీసుకుంటుందని, సినిమా వాయిదా తప్పదని కొందరు భావించారు. అయితే తండ్రి బోనీకపూర్‌ నిర్మాత, తల్లి శ్రీదేవి ఆర్టిస్ట్‌ కాబట్టి జాన్వీకి సినిమా కష్టాలు తెలుసు.

అందుకే షూటింగ్‌లో పాల్గొనాలని ఫిక్సయ్యారు. ఇషాన్‌ కట్టర్, జాన్వీ కపూర్‌ జంటగా శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధడక్‌’ మరాఠీ సినిమా ‘సైరట్‌’కు రీమేక్‌. గురువారం ఈ సినిమా తాజా షెడ్యూల్‌ స్టారై్టంది. రెండు రోజుల పాటు ఇషాన్, జాన్వీలపై రొమాంటిక్‌ సీన్స్‌ తీసి, ఆ తర్వాత కోల్‌కత్తాలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తారు. ‘‘మా షూటింగ్‌కు బ్రేక్‌ పడుతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కోల్‌కతా షెడ్యూల్‌ కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు శశాంక్‌ కేతన్‌. శ్రీదేవి ఆరోగ్యంగా  లేకున్నా తన వల్ల మూవీ యూనిట్‌కు ఇబ్బంది కలగకూడదు అనుకునేవారు. జాన్వీ కూడా అంతే.

అచ్చు అమ్మ అడుగుజాడల్లోనే ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు బాలీవుడ్‌ సినీవాసులు. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి గురించి బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌ భట్‌ ఓ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకున్నారు. ‘‘గుమ్రా’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. షూట్‌ క్యాన్సిల్‌ చేద్దామని చెప్పా. ‘లేదు. లేదు..నా వల్ల షూటింగ్‌ అగిపోకూడదు’ అని శ్రీదేవి చెప్పారు. అంతేకాదు అంత జ్వరంలోనూ వాటర్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించారామె. ఆమె అంకితభావం సూపర్‌’’ అని పేర్కొన్నారు మహేశ్‌ భట్‌. సో.. జాన్వీ కూడా అచ్చంగా అమ్మలానే. తన మానసిక స్థితి ఎలా ఉన్నా సినిమాపై ఆ ప్రభావం పడకూడదనుకుంది. ‘ధడక్‌’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 20న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement