
అమ్మా థియేటర్లపై హర్షం
చిన్న చిత్రాల నిర్మాతలకు శుభవార్త. అమ్మా థియేటర్ల పేరుతో రాష్ట్రంలో జయలలిత ప్రభుత్వం పలు సినీ థియేటర్లను నిర్మించనుంది. దీనిపై చిత్ర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తమిళ నిర్మాతల మండలి సంఘం అధ్యక్షుడు కెఆర్ గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కొరత పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అమ్మా థియేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించి తమిళ సినిమా పరిశ్రమను సంతోషంలో ముంచెత్తిందన్నారు.
కోరకుండానే కోరికలు తీర్చుతున్న ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలడం లేదన్నారు. ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదన్న నిర్మాత కలైపులి ఎస్.థాను పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.
దీంతో నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమిళ నిర్మాతల మండలి పలు కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. ముఖ్యంగా చిత్రాల విడుదల విషయంలో నిబద్ధతతను తీసుకురానున్నట్లు చెప్పా రు. భారీ బడ్జెట్ చిత్రాలు పండుగ దినాల సందర్భంగాను, ప్రతి నెలా మూడవ శుక్రవారంలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. చిన్న బడ్జెట్ చిత్రాలు ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చని చెప్పారు.