అడంగు మరు చిత్రంతో వెండి తెరకు నిర్మాతగా అత్తగారికి స్వాగతం పలుకుతున్నట్లు నటుడు జయంరవి పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం అడంగుమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ తంగవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చితాన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాతా విజయకుమార్ నిర్మించారు.
ఇంతకు ముందు బుల్లితెరకు పలు టీవీ.సీరియళ్లను నిర్మించిన ఈమె తొలిసారిగా చిత్ర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం అడంగుమరు. సుజాత విజయ్‌కుమార్ నటుడు జయం రవికి స్వయానా అత్త అన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 21వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకి రాశీఖన్నా మాట్లాడుతూ జయంరవికి జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది.
ఆయన చాలా స్వీట్ పర్సన్ అని, సహ నటుడిగా ఈ చిత్రంలో చాలా సహకరించారని చెప్పింది. నిజం చెప్పాలంటే జయంరవి నుంచి తాను చాలా నేర్చుకున్నానని అంది. నటిగా అడంగుమరు చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. తన పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చెప్పింది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు, నటుడు జయం రవికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నానని అంది. కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్‌తంగవేల్‌ను తన అత్త సుజాత జయకుమార్ తన వద్దకు పంపి కథ చెప్పమనడంతో సరేనన్నానని, అయితే కార్తీక్‌తంగవేల్ చూడగానే అరే నువ్వా అని అన్నానన్నారు.
కారణం తన తాను నటించిన ఇదయ తిరుడన్ చిత్రం ద్వారా సహాయ దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి అని చెప్పారు. తన అత్త సుజాత విజయకుమార్ విన్న తొలి కథనే ఎలా ఒకే చేశారనే అనుమానంతోనే తానూ కథను విన్నానని చెప్పారు. అయితే దర్శకుడు కార్తీక్‌తంగవేల్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. అయితే కాస్త వయిలెన్స్ ఉండడంతో దానికి తేనె పూసినట్లు మార్చి రూపొందించినట్లు తెలిపారు. అడంగుమరు చిత్రం ద్వారా తన అత్తగార్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇందులో ఈ తరానికి అవసరమైన మంచి సందేశం ఉంటుందని చెప్పారని జయంరవి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment