అత్యాచారం మాత్రమే నేరం కాదు అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది పచ్చి నిజం. ఇలా సంఘంలో జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్న వారిలో పలువురు మహిళలు వివాహంపై వివిధ రకాల భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెళ్లే చేసుకోను అని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు.
ఇవన్ తందిరన్, విక్రమ్‌వేదా, నేర్కొండ పార్వై వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఈ శాండిల్‌వుడ్ భామ మాతృభాషలోనూ, తెలుగులోనూ నటిస్తోంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ అత్యాచారం మాత్రమే నేరమని చాలా మంది భావిస్తున్నారని, అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూస్తూ మాట్లాడడం, అనుసరించడం కూడా నేరమేనని అంది.
అయితే అత్యాచారాల వ్యహారంలో సమాజంలో త్వరలోనే మార్పు వస్తుందని భావిస్తున్నానంది. ఎందుకంటే కాలంతో పాటు మహిళలు మారుతున్నారని, అయితే మహిళలపై సమాజం దృష్టే ఇంకా మారలేదని పేర్కొంది. తన తాతయ్య, బామ్మలకు 15 మంది పిల్లలని, తన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే జన్మనిచ్చారని చెప్పింది. ఇక తాను అసలు పిల్లలనే కనరాదని నిర్ణయించుకున్నానని తెలిపింది.
కాగా తన ఈ నిర్ణయంతో తానెలాంటిదాన్నో తీర్మానం చేయకండని, తన చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించాలని శ్రద్ధాశ్రీనాథ్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో జోడి అనే చిత్రంలోనూ కన్నడంలో గోద్రా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ఇరుంబుతిరై 2, మార చిత్రాల్లో నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment