ఇద్దరికీ న్యాయం చేసే కథ ఇది
– కల్యాణ్‌రామ్
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన నటుడి కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులకు శుక్రవారంతో తెరపడింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అన్న కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఓ కొడుకు హీరోగా, మరో కొడుకు నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి తండ్రి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని నేను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్‌లోని స్టార్‌కి, నటుడుకి న్యాయం చేసేలా ఉంది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఇప్పటికే రాశీఖన్నాను ఖరారు చేశారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడిగా సీకే మురళీధరన్ వ్యవహరిస్తారు. నందమూరి రామకృష్ణ, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్, యలమంచిలి రవిశంకర్, కిలారు సతీష్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.