
బాలయ్య కన్నా ముందే ఎన్టీఆర్..?
మహానటుడు నందమూరి తారాకరామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోగా మరో నందమూరి వారసుడు ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడట.
నటనతో పాటు రూపంలోనూ సీనియర్ ఎన్టీఆర్కు దగ్గరగా కనిపించే యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో తాత పాత్రలో కనిపించే అవకాశం ఉంది. మహానటి పేరుతో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్, మహానటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఓకె చెప్తే బాలయ్య కన్నా ముందే సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో తారక్ దర్శనమివ్వనున్నాడు.