జపనీస్ భాషలో ఎన్టీఆర్ సినిమా
జపాన్ తెరపై త్వరలో ఎన్టీఆర్‌ను చూడొచ్చును. అంటే ఎన్టీఆర్ జపనీస్ భాషలో సినిమా చేస్తున్నారా అని అనుకోవద్దు. ఆయన నటించిన ‘బాద్‌షా’ సినిమా జపనీస్ భాషలోకి అనువాదమవుతోంది. జపాన్‌లో రజనీకాంత్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ రజనీ సినిమాలను బాగా ఆదరిస్తారు. జపాన్‌లో రజనీకి ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే - మన తెలుగు హీరోల సినిమాలు ఇంతవరకూ జపనీస్ భాషలో అనువాదమైన దాఖలాలు లేవు! ఇప్పుడిప్పుడే అక్కడ ఎన్టీఆర్ పట్ల ఓ క్రేజ్ మొదలైందట. ఎన్టీఆర్ డాన్సులు అక్కడి యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయట.
ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే అక్కడి నేషనల్ చానల్ అయిన ఫుజీ టీవీ ఎన్టీఆర్‌పై 2011లో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. పుజీ టీవీ బృందం హైదరాబాద్‌కు ప్రత్యేకంగా విచ్చేసి, ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ కూడా చేశారు. తాజాగా జపాన్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ‘బాద్‌షా’ను జపనీస్ భాషలో అనువదించడానికి హక్కులు తీసుకుంది. సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెం.1 చిత్రాలను కూడా జపనీస్ భాషలోకి డబ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే మే, జూన్‌ల్లో జపాన్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్‌కి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నారట.