
నిరాశపరిచిన... నీరసపరిచిన...హాలీవుడ్ సీక్వెల్స్
2015 జూన్ 11... వరల్డ్ మొత్తం ‘జురాసిక్ వరల్డ్’ కోసం వెయిటింగ్. తీరా చూస్తే - సినిమా రిజల్ట్ జస్ట్ ఓకే! ఈ నెల 2న విడుదలైన ‘టెర్మినేటర్ జెనిసిస్’ సినిమా విషయంలోనూ ఇంతే. సేమ్ రిజల్ట్. ఈ రెండు సినిమాల స్పెషాల్టీ ఏంటంటే -
రెండూ కూడా ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సినిమా సిరీస్‌లకు సీక్వెల్సే. ‘‘22 ఏళ్ల క్రితం వచ్చిన ‘జురాసిక్ పార్క్’కు అసలు సీక్వెల్ ‘జురాసిక్ వరల్డ్’’అని ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ప్రకటించారు. ఇక, జేమ్స్ కామెరూన్ కూడా తాను తెరకెక్కించిన ‘టెర్మినేటర్’ మూడు భాగాలకు ఈ ‘టెర్మినేటర్ జెనిసిస్’ కరెక్ట్ సీక్వెల్ అని పొగడ్తలు కురిపించారు. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. ఈ సీక్వెల్స్ మునుపటి స్థాయిలో ఎందుకు విజయం సాధించలేకపోయాయి? ఓ చిన్న విశ్లేషణ...
జురాసిక్ వరల్డ్
ఈ చిత్రానికి కొలిన్ ట్రవెర్రో దర్శకుడైనా కూడా, మొత్తం ప్రచారంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్టీవెన్ స్పీల్‌బర్గ్ పేరే వినిపించింది. కామన్ ఆడియన్స్‌ని ఎవర్నడిగినా ‘ఇది స్పీల్‌బర్గ్ సినిమా’ అనే చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే ఇదే ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లేలా చేసిందని చెప్పొచ్చు. ‘‘డైనోసార్లను కొత్తగా చూపించారే తప్ప... కథను కొత్తగా తెరకెక్కించలేదని చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకుండే ఎమోషనల్ కాంటాక్ట్ మిస్ అయింది. మొదటి రెండు భాగాల్లో ఉండే విభిన్నమైన కథ, పటిష్టమైన కథనం ఇందులో కొరవడింది. పైగా ముందు భాగాల తరహాలోనే ఒకటే కథ. పిల్లలు పార్క్‌లో తప్పిపోతారు. వారి కోసం ప్రధాన పాత్రధారుల అన్వేషణ . దీంతో పాత కథే చూసిన ఫీలింగ్ కలిగిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా అద్భుతంగా ఉండి, పిల్లలను ఆకట్టుకున్నా, విమర్శకులను మాత్రం మెప్పించలేకపోయిందీ చిత్రం.
టె ర్మినేటర్ జెనిసిస్
ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ‘ఐ విల్ బి బ్యాక్’ అని ప్రచారం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 2న విడుదల అయింది. అలన్ టేలర్ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఒక యువతిని కాపాడే కథాంశంతో పాత చిత్రాల తరహాలోనే తెరకెక్కిన ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అదనపు బలం. దురదృష్టవశాత్తు బలహీనత కూడా. చాలా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో, గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ కూడా కొంత ఉంటే బాగుండేదని చూసిన వాళ్ల ఫీలింగ్. ముఖ్యంగా ఆర్నాల్డ్ గురించి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఆయన పాత్ర తీరుతెన్నులు చూసి పెదవి విరుస్తున్నారు.