‘దిల్’ రాజు, సమంత, రాఘవేంద్ర రావు, శర్వానంద్
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్‌గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు.
ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment