
ఉత్తరాదిన కబాలి ప్రభంజనం
బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
న్యూఢిల్లీ: బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు హిందీ వర్షెన్లో 28 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు చిత్రం బాహుబలి తర్వాత ఉత్తరాదిన అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో దక్షిణాది సినిమాగా కబాలి నిలిచింది.
పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి సినిమాను తమిళం, తెలుగు, హిందీ ఇతర భాషల్లో విడుదల చేశారు. కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టు గురువారం ఈ సినిమా నిర్మాత థాను ప్రకటించాడు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా భారత్తో పాటు విదేశాల్లోనూ రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మలేసియాలో నివసించే తమిళుల హక్కుల కోసం పోరాడే గ్యాంగ్స్టార్ పాత్రలో రజనీ నటించారు. రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే, కూతురిగా ధన్సిక నటించారు.