‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయాన్ని కొందరు కథానాయికలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాదు.. ఇతర వ్యాపారాలు, ప్రొడక్షన్ వైపు కూడా అడుగులేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. టాలీవుడ్‌లో తన నట గురువు తేజ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా నిర్మించి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అందులోనూ ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్‌లో నటించనున్నారట. ఇందుకోసం లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌ను తేజ సిద్ధం చేస్తున్నారని, సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని టాక్. 2007లో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు తేజ. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకుంది. గత నెలలో వచ్చిన ‘సీత’ చిత్రంతో మూడోసారి కలిసి పనిచేసిన తేజ–కాజల్ ఇప్పుడు నాలుగోసారి కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment