
మంచోడి లవర్ కాజలే!
నందమూరి కల్యాణ్‌రామ్ ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కథానాయికగా కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలైంది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా తర్వాత కల్యాణ్‌రామ్, కాజల్ జంటగా నటించలేదు. పదేళ్ల తర్వాత ‘ఎమ్మెల్యే’ అనే సిన్మాలో జంటగా నటించనున్నారనే న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. ఎమ్మెల్యే అంటే ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్’. సినిమా క్యాప్షన్ అదే. శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
అప్పుడు కల్యాణ్‌రామ్, కాజల్ జంటగా నటిస్తున్నారనే న్యూస్‌ను కన్ఫర్మ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్‌రామ్ కూతురు తారక అద్విత, చిత్రనిర్మాతల్లో ఒకరైన ఎంవీ కిరణ్‌రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్చాన్ చేశారు. కల్యాణ్‌రామ్ తనయుడు సౌర్యారామ్, మరో చిత్రనిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ క్లాప్ ఇచ్చారు. రచయిత కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. కల్యాణ్‌రామ్ న్యూ లుక్‌లో సై్టల్‌గా కనిపిస్తారు. ‘ఎమ్మెల్యే’ టైటిల్‌కి, క్యాప్షన్‌కి జస్టిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 9న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు. రవి కిషన్, అజయ్, ‘వెన్నెల’ కిశోర్, పృథ్వీ, లాస్య, మనాలీ రాథోడ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.