ఒక్క సినిమా చేసి వెనక్కి వెళ్లిపోదామనుకున్నా | Kajal Aggarwal Speech @ MLA Movie Team Special Interview | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమా చేసి వెనక్కి వెళ్లిపోదామనుకున్నా

Published Fri, Mar 23 2018 12:12 AM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

Kajal Aggarwal Speech @ MLA Movie Team Special Interview - Sakshi

కాజల్‌

‘‘కల్యాణ్‌ రామ్‌తో పదేళ్ల కిందట ‘లక్ష్మీకళ్యాణం’ సినిమా చేశా. ‘ఎంఎల్‌ఏ’ చిత్రంలో మళ్లీ తనతో నటించడం నా పాత స్నేహితుణ్ని కలిసినట్లు అనిపించింది. ఎవరి వ్యక్తిగత జీవితాలు, సినిమాలతో బిజీగా ఉన్నాం. ఈ పదేళ్లలో ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఇద్దరం కలిశామంతే. మధ్యలో ఎప్పుడూ కలవలేదు’’ అని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్, కాజల్‌ జంటగా ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్‌ఏ’. టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భం గా కాజల్‌ పంచుకున్న విశేషాలు...

► ఆసక్తికరమైన సినిమాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే.. ఓ నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనుకున్నా. కమర్షియల్‌ సినిమాలు, కొత్త తరహా సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్నా.

► ‘ఎంఎల్‌ఏ’లో నాది ఎన్నారై అమ్మాయి పాత్ర. స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. నా పాత్రలో ఓ షేడ్‌ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తుంటాననే విషయం ఇంటర్వెల్‌ వరకూ తెలియదు. దానికి కారణాలేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

► ఎంటర్‌టైనింగ్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉన్న చిత్రమిది. కొత్తదనం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా పాత్రలకు న్యాయం చేయడానికి సిన్సియర్‌గా కృషి చేస్తున్నాను. నేను చేస్తున్న సినిమాలు, పాత్రల పట్ల చాలా సంతోషంగా ఉన్నా.

► ‘లక్ష్మీ కల్యాణం’ చేసేటప్పుడు ‘ఒక సినిమా చేస్తే చాలు.. మానేసి వెనక్కి వెళ్లిపోయి ఎంబీఏ చదువుకుందామనిపించింది’. కానీ.. జీవితం వేరేలా ఉంటుంది కదా! ఈ ప్రయాణం హ్యాపీగా ఉంది. ఇంత మంచి లైఫ్‌ ఇచ్చి, వారి ఫ్యామిలీలో  నన్ను ఒకరిగా భావించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

► తెలుగు చిత్ర పరిశ్రమలోనే ‘నాకు లైఫ్‌’ అని ఐదు సినిమాలు చేసిన తర్వాత అనిపించింది. ‘మగధీర’ సినిమా చేసేటప్పుడు ‘వందశాతం ఇదే నా లైఫ్‌’ అని అర్థమైంది. ప్రస్తుతం ‘క్వీన్‌’ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో నటిస్తున్నా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నా.


‘పక్కా లోకల్‌’ తర్వాత  ఐటమ్‌ సాంగ్స్‌లో కనిపించడం లేదేంటని అడుగుతున్నారు. అది ఎప్పుడో ఒకసారి సరదాకి అలా చేస్తుంటాను అంతే. హిందీ సినిమా చేశామంటే ఏదో ఒక హిందీ సినిమా చేయటానికి వెళ్లినట్టు ఉండకూడదు. మంచి రోల్‌ ఉంటేనే చేస్తాను. నా పాత సినిమాల్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడను. అరే ఆ సీన్‌ ఇలా చేశానేంటి? దాని బదులు ఇంకోలా చేసుంటే బావుండేది కదా అని ఫీల్‌ అవుతాను.. అంతే. ఆ హీరో ఈ హీరోతో అని కాదు ఇండస్ట్రీలో అందరితో యాక్ట్‌ చేయాలని ఉంది. చేసిన వాళ్లతో మళ్లీ మళ్లీ యాక్ట్‌ చేయాలనుంది. కల్యాణ్‌ రామ్‌ ఎంత మంచి ‘ఎంఎల్‌ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అంటే నేను పదికి ఎనిమిదిన్నర మార్కులు ఇస్తాను. పక్కా ఫ్యామిలీ మ్యాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement