చెన్నై ,పెరంబూరు: నటుడు కమలహాసన్ పోస్టర్లపై పేడ వేశానని నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు కమలహసన్ అభిమానులు మండిపడుతున్నారు. ఆ వివరాలు చూస్తే రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు లారెన్స్ మాట్లాడుతూ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యం, అద్భుతం అనే పదాలు చాలా కాలంగా ఉన్నాయని, అయితే అవి రజనీ నోటి నుంచి వచ్చిన తరువాతనే ప్రాధాన్యతను సంతరించుకున్నాయనీ అన్నారు. రజనీకాంత్‌పై కొందరు రాజకీయనాయకులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారన్నారు. ఇకపై కూడా అలాంటివి మాట్లాడితే తానూ బదులు చెబుతానని అన్నారు. తాను చిన్న వయసు నుంచే రజనీకాంత్‌కు వీరాభిమానిని అని చెప్పారు. అలా చిన్నతనంలో నటుడు కమలహాసన్ అంటే ఇష్టపడేవాడిని కాదని, ఆయన పోస్టర్లపై పేడ వేశానని చెప్పారు. ఆ తరువాత రజనీ, కమల్‌ల మధ్య ఎంత స్నేహం ఉందో అర్థమైందని అన్నారు. కాగా లారెన్స్ వ్యాఖ్యలపై కమలహాసన్ అభిమానులు మండిపడుతున్నారు.
దీంతో లారెన్స్ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి నెలకొంది. వెంటనే స్పందించిన లారెన్స్ తాను కమలహాసన్ పోస్టర్‌పై పేడ వేశాను అన్న వరకే పరిగణలోకి తాసుకుని తనను అపార్థం చేసుకుంటున్నారని, తన వ్యాఖ్యల వీడియోను పూర్తిగా చూస్తే తన భావన ఏమిటో అర్థం అవుతుందని అన్నారు. తాను చిన్న వయసులో రజనీకాంత్ వీరాభిమానినని చెప్పానని, అలా తెలిసీ తెలియని వయసులో కమలహాసన్ పోస్టర్లపై పేడ వేశాననే చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసునైనా బాధించి ఉంటే క్షమాపణ చెబుతున్నానని, అయినా తాను తప్పుగా మాట్లాడలేదని అన్నారు. నటుడు కమలహాసన్‌పై తనకు ఎంతో గౌరవం అని లారెన్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment