కమల్‌హాసన్‌కు మరో పురస్కారం!
దేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన జాబితాలో పురస్కారం చేరింది. ఫ్రాన్స్‌కి చెందిన ప్రసిద్ధ ఫిల్మ్ ఆర్కైవిస్ట్ ‘హెన్రీ లాంగ్లోయిస్’ పేరు మీద ‘యునెస్కో’కు చెందిన ఫ్రెంచ్ నేషనల్ కమిషన్ వారు అందించే ఈ అవార్డు కమల్‌ను వరించింది.
భారత సినీసీమకు అందించిన సేవలకు గాను ఆయ నకు ఈ అవార్డును ప్రదానం చేశారు. హెన్రీ లాంగ్లోయిస్ పుర స్కారం విశిష్టత చెప్పాలంటే... ఫ్రాన్స్‌లో చలన చిత్రాలను భద్రపరిచే ప్రకియ చేపట్టిన ఘనత హెన్రీ లాంగ్లోయిస్‌ది. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్’, ‘సినిమాథెక్యూ ఫ్రాంకైస్’లకు ఆయన కో-ఫౌండర్.
సినిమాల పట్ల కనబర్చిన అంకితభావం, చేసిన సేవలకుగాను 1974లో హెన్రీ గౌరవ అకాడమీ అవార్డు సాధించారు. అలాంటి విశిష్ట వ్యక్తి పేరు మీద ప్రవేశపెట్టిన అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు కమల్‌హాసన్. ‘‘ప్యారిస్‌లో అవార్డు తీసుకున్నా. దీన్ని కళ్లారా చూడడానికి నా గురువు అనంతు సార్ బతికి ఉంటే బాగుండేది. ఆయన ద్వారానే హెన్రీ లాంగ్లోయిస్ గొప్పతనం తెలుసుకున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు. భారత్‌లో ఈ అవార్డ్ అందుకున్న తొలి వ్యక్తి కమలే.