తమిళసినిమా: తమిళ రాజకీయాలిప్పుడు కోలీవుడ్‌లోని ఇద్దరి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. వారెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ విషయం పక్కన పెడితే విశ్వనటుడు కమలహాసన్ మాత్రం దూకుడును ప్రదర్శిస్తున్నారనే చెప్పవచ్చు. చాలా కాలంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తున్నారు. పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు.
కమల్ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు ఏడవ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈయన రాజకీయరంగ ప్రవేశంపై ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందనే వస్తోందని చెప్పవచ్చు. ఈ విషయంలో కమలహాసన్ సోదరుడు చారుహాసనే నిరుత్సాహపరచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్ రాజకీయాల్లోకొస్తే 10 శాతం ఓట్లు కూడా సాధించలేరని పేర్కొన్నారు. ప్రజలు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు గానీ, కమల్‌ను కోరుకోవడం లేదని అన్నారు.
కాగా కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశం గురించి ఆయన కూతురు, నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ తన తండ్రి రాజకీయరంగ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తానన్నారు. ఆయన మనఃసాక్షి కలిగిన దేశ పౌరుడని పేర్కొన్నారు. తన తండ్రికి రాజకీయాలు తెలుసో, తెలియవో గానీ, ప్రజలకు ఏం అవసరమో, ఏం చేయాలో తెలుసన్నారు. అందుకే నాన్నకు తానెప్పుడూ అండగా ఉంటానని నటి శ్రుతీహాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment