దీపికా పదుకోన్, కంగనా రనౌత్
పారితోషికం అనాల్సింది.. భారితోషికం అన్నారేంటి అనుకుంటున్నారా? అయితే మ్యాటర్‌లోకి ఎంటర్ అవ్వండి. మనలో మన మాట. హీరోలకు పారితోషికం ఎక్కువా? హీరోయిన్లకా? అంటే.. ఎవరైనా ‘హీరో’లకే అంటారు కదా. ఇద్దరు నాయికల విషయంలో ఈ సీన్ రివర్స్ అయింది. ఆ విషయంలోకి వస్తే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎక్కువగా హీరో ఇమేజ్ మీద నడుస్తున్నాయి. కథలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి కూడా. అందుకే పారితోషికం విషయంలోనూ హీరోలదే పై చేయి. కానీ మెల్లిగా ఈ పద్ధతి మారుతున్నట్టుగా కనిపిస్తోంది.
వాళ్ల మార్కెట్‌ని బట్టి మాకింత కావాలని నాయికలు నిక్కచ్చిగా తమ పారితోషికాన్ని డిమాండ్ చేసి, పుచ్చుకుంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘పద్మావత్’ సినిమాలో హీరోలు షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ల కంటే కూడా దీపికా పదుకోన్‌నే ఎక్కువ పారితోషికం (దాదాపు 13 కోట్లు) పుచ్చుకున్నారు. షాహిద్, రణ్‌వీర్‌లు చెరో 10 కోట్లు తీసుకున్నారట. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ – ‘‘నా మార్కెట్ గురించి నాకు తెలుసు. అందుకే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాను’’ అన్నారు.
తాజాగా ‘మణికర్ణిక’ సినిమా కోసం కంగనా రనౌత్ సుమారు 14కోట్లు దాకా తీసుకున్నారని టాక్. సాధార ణంగా కంగనా తీసుకునే పారితోషికం కంటే ఇది డబుల్ అట. స్క్రిప్ట్ బట్టి, అందులో పోషించాల్సిన పాత్ర బట్టి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్నారట కంగనా. పారితోషికం అనేది హీరో, హీరోయిన్ బట్టి కాకుండా మార్కెట్లో తమకున్న డిమాండ్‌ని, పాత్ర కోసం పడాల్సిన కష్టాన్ని బట్టి ‘భారితోషికం’ పుచ్చుకుంటున్నారు. పాత పద్ధతులకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది శుభ పరిణామమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment