‘హీరోల’ కంటే వీళ్లకే ఎక్కువ రెమ్యునరేషన్‌! | Actresses Who Got Higher Remuneration Than Male Counterparts | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న హీరోయిన్లు!

Published Wed, Sep 30 2020 5:43 PM | Last Updated on Wed, Sep 30 2020 8:43 PM

Actresses Who Got Higher Remuneration Than Male Counterparts - Sakshi

ఒకప్పుడు ‘హీరోయిన్లు’ అంటే కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యేవారు. నాలుగు డ్యూయెట్లు, ‘హీరో’ బాధలో ఉన్నపుడు ఓదార్చే ఐదారు ప్రేమ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో పెళ్లితో శుభం కార్డు.. సాధారణంగా ఇలాంటి సీన్లలోనే కనిపించేవారు. అయితే గత కొన్నేళ్లుగా ట్రెండ్‌ మారింది. పాతతరం నటీమణుల స్ఫూర్తితో నయా కథానాయికలు సైతం తమలో దాగున్న నటనా నైపుణ్యానికి పదును పెడుతున్నారు. తాము కేవలం ‘‘గ్లామర్‌ డాల్స్‌’’ కాదని, సరికొత్త, విభిన్న కథాంశాలను ఎంచుకుని హీరోలకు పోటీ ఇస్తున్నారు. సినిమా మొత్తాన్ని భుజాలపై మోస్తూ ‘‘వన్‌ వుమన్‌ షో’’ చేస్తూ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో సత్తా చాటుతున్నారు.

ప్రతిభకు తగ్గ పారితోషికం డిమాండ్‌ చేస్తూ ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదంటూ దూసుకుపోతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా నవతరం నాయికలంతా ఈ ఫీట్‌ను సాధిస్తున్నప్పటీ బాలీవుడ్‌కు ఉన్న విస్తృతి దృష్ట్యా.. సహజంగానే అక్కడి సినిమాల్లో నటించే వారికే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ దక్కుతోంది. ఒక్కోసారి చిన్న హీరోలు తీసుకునే మొత్తం కంటే ఇది ఎక్కువగానే ఉంటుందని సినీ పండితులు అంటున్నారు.

‘క్వీన్‌’కే అగ్రతాంబూలం!
ఫ్యాషన్‌, తను వెడ్స్‌ మను, క్వీన్‌, మణికర్ణిక, వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమాచల్‌ ప్రదేశ్‌ ఆడపడుచు కంగనా రనౌత్‌. వెండితెరపై వెలిగిపోవాలనే కలతో చిన్న గ్రామం నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. నేడు బీ- టౌన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి స్థాయికి చేరుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు, అవమానాలు, ఛీత్కారాలు, విమర్శలు ఎదుర్కొంది. అయినా వెనకడుగు వేయక ధైర్యంగా ముందుకు సాగుతూ ఫైర్‌బ్రాండ్‌ నటిగా గుర్తింపు పొందింది. జాతీయ అవార్డుతో పాటు సినీ రంగంలోని ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ స్వతహాగా సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్న కంగన.. రానున్న రోజుల్లో తలైవి, తేజస్‌, ధాకడ్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరక్కెక్కుతున్న తలైవి సినిమాలో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ. 20 కోట్ల పైగా వసూలు చేస్తోందని బీ- టౌన్‌ టాక్‌. ఇక వినూత్న కథాంశాలను ఎంచుకునే కంగన.. జడ్జిమెంటల్‌ హై క్యా సినిమాలో తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న రాజ్‌కుమార్‌రావు(రూ. 6 కోట్లు) కంటే రెట్టింపు మొత్తం తీసుకుందని సినీ వర్గాలు అంటున్నాయి.

తొలి సినిమాతోనే సెన్సేషన్‌
వర్ధమాన హీరోయిన్లకు సూపర్‌ స్టార్లతో నటించే ఛాన్స్‌ రావడం చాలా అరుదు. కానీ దీపికా పదుకొనె మాత్రం తొలి సినిమాలోనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో జతకట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వృత్తిగత, వ్యక్తిగత ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన దీపికా.. రామ్‌లీలా, పద్మావత్‌, బాజీరావు మస్తానీ వంటి చిత్రాలతో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకుంది. బీ- టౌన్‌లో అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు తెరపై అభిమానులకు కనువిందు చేయనుంది. 

ఇందులో పాన్‌ ఇండియా హీరో, డార్లింగ్‌ ప్రభాస్‌తో జతకట్టి ప్రేక్షకులను ఆకట్టు​కోనుంది. ఈ సినిమా కోసం దీపికా అక్షరాలా రూ. 20 కోట్లు తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. పద్మావత్‌ సినిమాకు గానూ దీపికకు, ఆ సినిమాలో విలన్‌, ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌(అప్పటికింకా పెళ్లికాలేదు, రూ. 8 కోట్లు) కంటే ఓ నాలుగు కోట్లు ఎక్కువగానే చెల్లించారట నిర్మాతలు.

‘సాహో’ భామ సైతం..
శక్తి కపూర్‌ కూతురుగా గాకుండా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. ఆషికి- 2, స్త్రీ, హైదర్‌, చిచోర్‌ వంటి సినిమాల్లో నటించిన శ్రద్ధకు ఒకటి రెండు మినహా పెద్దగా హిట్లు లేనప్పటికీ తనలోని నటికి బారీగానే పారితోషికం ముట్టజెప్పుతున్నారట నిర్మాతలు. చాక్‌లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటించనుందని, అందుకుగానూ రూ. 10 కోట్లకు పైగానే అందుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మళంగ్‌ 2, స్త్రీ రిటర్న్స్‌ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇక స్త్రీ సినిమాలో తనకు జోడీగా కనిపించిన రాజ్‌కుమార్‌ రావు కంటే శ్రద్ధ కోటి రూపాయలు(సుమారు 7 కోట్లు) ఎక్కువగానే వసూలు చేసిందట.

భట్‌ వారసురాలు అలియా..
స్టార్‌ కిడ్‌ అలియా భట్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్’‌ సినిమాతో సిల్వర్‌ స్క్నీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఉడ్తా పంజాబ్‌, రాజీ, గల్లీ బాయ్‌ వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. రాజీ సినిమాకు గానూ దాదాపు రూ. 10 కోట్లు తీసుకుందట. ఆ మూవీలో అలియాకు జోడీగా కనిపించిన విక్కీ కౌశల్‌ రెమ్యునరేషన్‌ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువని వినికిడి.

బెబో కూడా తక్కువేం కాదు
కపూర్‌ ఖాన్‌దాన్‌ వారసురాలు కరీనా కపూర్‌ ఖాన్‌ పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత వీరే దీ వెడ్డింగ్‌, గుడ్‌ న్యూస్‌ వంటి చిత్రాల్లో కనిపించింది. వీరే దీ వెడ్డింగ్ మూవీలో సోనం కపూర్‌, స్వరా భాస్కర్‌ వంటి తోటి నటీమణులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న బెబో.. అందరి కంటే ఎక్కువ పారితోషికం(రూ. 7 కోట్లు )అందుకుందట. రెమ్యునరేషన్‌ విషయంలో ఈ సినిమాలో తనతో జతకట్టిన సుమిత్‌ వ్యాస్‌ కేవలం రూ. 80 లక్షలతో సరిపెట్టుకున్నాడు. క్రేజీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరీనా పక్కన కనిపించినా... ‘మనీ’ విషయంలో ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. ఇక ప్రస్తుతం బెబో గర్భవతి అన్న సంగతి తెలిసిందే. మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌తో ఆమె కలిసి నటించిన లాల్‌ సింగ్‌ చద్ధా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక వీరితో పాటు అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, సోనం కపూర్‌, విద్యా బాలన్‌, ఐశ్వర్యారాయ్‌, ప్రియాంక చోప్రా, సొనాక్షి సిన్హా తదితర హీరోయిన్లు రూ. 5 కోట్లకు తక్కువ గాకుండా రెమ్యునరేషన్‌ అందుకుంటుండగా, తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, జాన్వీ కపూర్‌, ఊర్వశీ రౌతేలా వంటి హీరోయిన్లు కనీసంగా 2 కోట్లు తీసుకుంటున్నారని ఫిల్మీ దునియాలో ప్రచారం సాగుతోంది. ఇవి అధికారిక లెక్కలు కాకపోయినప్పటికీ, సినిమా స్థాయి, బడ్జెట్‌, పాత్ర పరిధిని బట్టి సదరు కథానాయికలు ఈ మాత్రమైనా డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందని సినీ ప్రేమికులు లెక్కలు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement