కంగనా రనౌత్
ముక్కుసూటితనానికి మారు పేరు కంగనా.. వివాదాలకు చిరునామా కంగనా.. బాలీవుడ్‌లో కంగనా రనౌత్ గురించి ఇలానే చెప్పుకుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కంగనా కొన్ని వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ముఖ్యంగా నెపోటిజమ్ (బంధుప్రీతి) పై ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపాయి. ఇక హీరో హృతిక్ రోషన్‌తో రచ్చ, ‘సిమ్రన్’ చిత్రంలో రచయితగా క్రెడిట్ తీసుకోవడం, తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్ క్రెడిట్ ఇష్యూ... ఇలా కంగనా జీవితంలో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వీటన్నింటి కంటే ముందు ప్రతిభతో కంగనా బాలీవుడ్‌లో ఎదిగిన తీరు ప్రశంసనీయం. యువకథానాయికలకు స్ఫూర్తి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది.
ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహించనుడటం విశేషం. ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. ‘‘నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇండస్ట్రీలో ఏ పరిచయాలు లేకపోయినా ప్రతిభతో కష్టపడి పైకి ఎదిగి జీవితంలో విజయం సాధించిన ఓ అమ్మాయి కథ ఇది. ఇదేదో నా ప్రచారం కోసమో, నా గురించి గొప్పలు చెప్పుకోవడానికో తీస్తున్న సినిమా కాదు. నా నిజజీవితంలో ఉన్న కీలక పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. ప్రస్తుతం ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారామె. అలాగే ఆమె నటించిన ‘మెంటల్ హై క్యా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ రెండు చిత్రాల పనులు పూర్తయ్యాక కంగనా బయోపిక్ మొదలవుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment