నాది అత్యాశ కాదు
ఏ చిత్రమైనా భారీ వసూళ్లు సాధించాలంటే, కచ్చితంగా అందులో స్టార్ హీరో ఉండి తీరాల్సిందే అని చాలామంది భావిస్తారు. కానీ, మేం కూడా సినిమాని మోయగలం అని విద్యాబాలన్, కంగనా రనౌత్ వంటి తారలు నిరూపిస్తున్నారు. ఈ ఇద్దరూ చేసిన కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఉన్న విద్యాబాలన్ గురించి పక్కన పెడితే.. కంగనా మాత్రం తెగ రెచ్చిపోతున్నారట. ‘సినిమాను మోసే సత్తా ఉన్న నేను ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేస్తారు’ అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.
చెప్పడం మాత్రమే కాదు.. ఓ శుభముహూర్తాన తాను పారితోషికం పెంచుతున్నట్లు ప్రకటించేశారు కంగనా. ఇప్పుడామె పారితోషికం మూడు, నాలుగు కోట్లు అనుకుందాం.. అందులో సగం పెంచేశారు. ఏదో పాతిక, యాభై లక్షలు పెంచితే నిర్మాతలు షాక్ అయ్యుండేవారు కాదు కానీ.. ఒక్కసారిగా కోటిన్నర, రెండు కోట్లు పెంచడంతో ఖంగు తిన్నారు. ‘‘నాకంత సీన్ ఉంది కాబట్టే, పారితోషికం పెంచాను కానీ అత్యాశ కాదు’’ అంటున్నారు కంగనా.