శాండల్‌ సౌందర్యం | Kannada Heroines So Popular In Tollywood | Sakshi
Sakshi News home page

శాండల్‌ సౌందర్యం

Published Tue, May 28 2019 7:12 AM | Last Updated on Tue, May 28 2019 7:13 AM

Kannada Heroines So Popular In Tollywood - Sakshi

తెలుగు హీరోల జాతకాలు తెరపై ఎక్కువగా కన్నడ హీరోయిన్లతో కలుస్తాయెందుకో. ఆ కస్తూరి నేల నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ హిట్లు కొట్టారు. తెర మీద శాండిల్‌ సౌందర్యాన్ని పరిచారు. బి.సరోజాదేవి నుంచి నేటి పూజా హెగ్డే వరకు బెంగళూరు నుంచి ఫ్లయిటెక్కితే హైదరాబాద్‌లో క్లాప్‌ కొట్టడమే. ఒకప్పుడు ముంబై హీరోయిన్ల తాకిడి ఉండేది. ఇప్పుడు సెట్‌కి వెళితే వేడివేడి బిసిబేళా బాత్‌ సువాసనే.

అందమైన ఆడపిల్లలందరూ హీరోయిన్లు కాలేరు. హీరోయిన్లు అయినవారందరూ నిలబడలేరు. ఈ కెరీర్‌లో నిలబడాలంటే చాలా కలిసిరావాలి. అందుకే యాక్టింగ్‌ ఫీల్డ్‌కి దగ్గరవ్వాలని చూసేవారి కంటే దూరంగా ఉండేవాళ్లే ఎక్కువ. అదీగాక ఆ రంగానికి అవసరమైన ట్రెండ్‌ ఫాలో అవడం అంటే ఫ్యాషన్‌ పరంగా, లుక్స్‌ పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉండటం కూడా కష్టమైన పనే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో వంద మంది హీరోయిన్లు కూడా ఉండరు ప్రస్తుత మార్కెట్‌లో. అందుకేనేమో ఏ సినిమా రంగమైనా ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను వెతుకుతూ ఉంటుంది.

ఒకప్పుడు హిందీ రంగంలో హీరోలందరూ పంజాబీలు అయితే హీరోయిన్లు అధికంగా ముస్లింలు. ఇప్పుడు ఆ పరంపర కూడా తెగిపోయింది. టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి తెచ్చుకోవడం తప్పనిసరి అయ్యింది. తెలుగువారికి, కన్నడ సీమకు ఇరుగుపొరుగు దోస్తీ ఉన్నట్టే సినీరంగపు అనుబంధం కూడా ఉంది. ఆ ప్రాంతం హీరోయిన్లు బి.సరోజా దేవి దగ్గరి నుంచి జయంతి, భారతి వరకు తెలుగు సినీ సీమలో తమ ప్రభావాన్ని చూపారు. ఇప్పటికీ ఆ దారిలో కొత్త హీరోయిన్లు నడిచి వచ్చేలా చేశారు. ఇవాళ పెద్ద తెలుగు సినిమాలన్నీ కన్నడ హీరోయిన్లతో పని చేస్తున్నాయని చెప్పాలి. ఆ వివరాలు చూద్దాం.

హెగ్డే ప్రస్తుతం హెడ్డే
మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ వంటి టాప్‌ స్టార్స్‌తో ఆల్రెడీ యాక్ట్‌ చేసిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ 20వ చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో హీరోయిన్‌గా చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో మరోసారి హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. స్క్రీన్‌ ప్రెజెన్స్, గ్లామర్‌ ఆకట్టుకునేలా ఉండటంతో పూజా డేట్స్‌ కోసం గిరాకీ పెరిగింది. పుట్టి పెరిగింది వేరు వేరు ప్రాంతాల్లో అయినా పూజా మూలాలు మాత్రం కన్నడ గడ్డ మీదే ఉన్నాయి. పూజా తండ్రి మంజునాథ్, తల్లి లతా కర్ణాటకలోని మంగళూర్‌ ప్రాంతానికి చెందినవారు. 

క్రష్మిక మండన్నా
రష్మికా మండన్నాను ‘కర్ణాటక స్టేట్‌ క్రష్‌’ అంటారు. ‘కిరాక్‌ పార్టీ’తో అక్కడ ఆమెకు ఆ పేరు వచ్చింది. తెలుగులో కూడా అదే ఊపుతో హవా కొనసాగిస్తున్నారు. దానికి తోడు గోల్డెన్‌ లెగ్‌గా మారారు. రష్మికాకు తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాఫ్‌ లేదు. నాగశౌర్యతో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘చలో’ చేశారు. విజయ్‌ దేవరకొండతో కలిసి చేసిన ‘గీతా గోవిందం’ అయితే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. నాగార్జున–నానీల ‘దేవదాస్‌’తో 2018లో తన హ్యాట్రిక్‌ పూర్తి చేశారు రష్మిక. ఈమె చేతిలో ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్, నితిన్‌ ‘భీష్మ’ ఉన్నాయి. అవే కాకుండా అల్లు అర్జున్‌ – సుకుమార్‌ చేయబోయే ప్రాజెక్ట్‌లో, మహేశ్‌ బాబు – అనిల్‌ రావిపూడి సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్‌ చేయబోతున్నారు.
నభా.. శభాష్‌
జోష్‌ మీదున్న మరో చిక్‌మగ్లూర్‌ చిన్నది నభా నటేశ్‌. రవిబాబు తీసిన ‘అదుగో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నభా నటేశ్‌.. ‘నన్ను దోచుకుందువటే’ నభాకు కావాల్సిన బూస్ట్‌ ఇచ్చింది. . ప్రస్తుతం రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ హీరోయిన్‌గా చేస్తున్నారు నభా. రవితేజతో ‘డిస్కో రాజా’లో కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అది కాకుండా గల్లా అశోక్‌ హీరోగా రూపొందే సినిమాలోనూ చేస్తున్నారు. 

నిధీ వచ్చిన లగాయత్తు
‘నిన్ను రోడు మీద చూసినాది లగాయత్తు’ అని అప్పట్లో రమ్యకృష్ణ కోసం నాగార్జున పాడితే ఈ మధ్య నిధీ అగర్వాల్‌ కోసం నాగచైతన్య పాడారు. ‘సవ్యసాచి’లో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ వెంటనే అఖిల్‌తో ‘మిస్టర్‌ మజ్ను’ చేశారు. తాజాగా రామ్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధీ అగర్వాల్‌. 

తెలుగుపై ‘శ్రద్ధ’ పెట్టారు
కన్నడ ఇండస్ట్రీలో టాప్‌ ఫామ్‌లో కొనసాగుతున్న హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాథ్‌ ఒకరు. ఈ ఏడాది ఏకకాలంలో అటు బాలీవుడ్‌కు ఇటు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు శ్రద్ధ. తెలుగులో నాని  హీరోగా రూపొందిన ‘జెర్సీ’లో సారా అనే పాత్ర చేశారు. సినిమాలో నాని, శ్రద్ధా కెమిస్ట్రీ బ్యాటు, బాల్‌లా ఉన్నాయని విమర్శకులు రాశారు. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ఆదితో చేసిన ‘జోడీ’ సినిమా ఉంది. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 

ఎక్కడికీ పోలేదు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో పరిచయమైన బెంగళూరు బ్యూటీ నందితా శ్వేతా. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ సినిమాల్లో కనిపించారామె. లేటెస్ట్‌గా ఆమె నటించిన ‘అభినేత్రి 2’, ‘7’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘అక్షర’ షూటింగ్‌ జరుగుతోంది. రాజశేఖర్‌ ‘కల్కి’లో కూడా నటిస్తున్నారు. సెకండ్‌ లిస్ట్‌ యాక్ట్రెస్‌గా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు నందితా. 

అనుష్క సో స్వీట్‌...
తెలుగులో రాణించిన కన్నడ హీరోయిన్లు అనగానే మనకు ముందు గుర్తొచ్చేది సౌందర్య, ఆ తర్వాత అనుష్క. 2010లో పూరీ ‘సూపర్‌’తో పరిచయం అయిన ఈ యోగా టీచర్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చారు. ‘వదల బొమ్మాళీ’ అని ‘అరుంధతి’లో సోనూసూద్‌ అన్నట్టు తెలుగు ప్రేక్షకులు వదల్లేదు. అనుష్క ప్రతి సినిమాను ఇరగ చూసేశారు. 

15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు అనుష్క. ‘విక్రమార్కుడు’,  ‘అరుంధతి’, ‘డాన్‌’, ‘మిర్చీ’, ‘బాహుబలి’ వంటి కొన్ని సినిమాలు ఉదాహరణ. ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ హీరోలందరితో దాదాపు యాక్ట్‌ చేసిన స్వీటీ ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సైలెంట్‌ థ్రిల్లర్‌లో, చిరంజీవి ‘సైరా: నరసింహా రెడ్డి’లో నటిస్తున్నారు. 

మరువలేని సౌందర్యం 
తాను పరభాష కథానాయిక అయినా తెలుగు ప్రేక్షకులకు ఆ భావన కలిగించలేదు సౌందర్య. అచ్చ తెలుగు హీరోయిన్‌లానే కనిపించారు. ఫ్యామిలీ హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసుకున్నారామె. కోడి రామకృష్ణ తీసిన ‘అమ్మోరు’ సౌందర్య కెరీర్‌లో పెద్ద హిట్‌. ‘హలో బ్రదర్‌’, ‘మాయలోడు’, ‘నంబర్‌ వన్‌’, ‘చూడాలని ఉంది’, ‘పెదరాయుడు’, ‘పవిత్రబంధం’, ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’, ‘అంతఃపురం’, ‘అన్నయ్య’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించారామె. విమాన ప్రయాణంలో జరిగిన ప్రమాదం వరకూ వరుస సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌గానే కొనసాగారు సౌందర్య. 

ఇంకా వెనక్కి వెళ్తే...
‘పాండురంగ మహత్యం’, ‘భూకైలాస్‌’,  ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమాలలో నాగేశ్వరరావు, రామారావులతో నటించిన  బి.సరోజా దేవి  కన్నడ కథానాయికే. తమిళనాడు మాజీ సీఎం, అప్పటి కథానాయిక జయలలిత కర్ణాటకలోనే జన్మించారు. ‘గూఢచారి 116’, ‘చిక్కడు దొరకడు’, ‘కథానాయకుడు’, ‘గండికోట రహస్యం’ సినిమాలతో పెద్ద హిట్స్‌ అందుకున్నారు. ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’ ఆమనిది బెంగుళూరే. ‘సమరసింహారెడ్డి’లో సంఘవిని ఉద్దేశిస్తూనే ‘బెంగుళూరు బాలికా చెంగు చాటు చేయక’ అంటూ ఓ పాట రాశారు. ‘చాలా బాగుంది’తో పరిచయమైన మాళవిక, జంధ్యాల ‘అహ నా పెళ్లంట’, ‘రెండురెళ్ళ ఆరు’ హీరోయిన్‌ రజనీ, ‘దేవి’ సినిమా హీరోయిన్‌ ప్రేమ కర్ణాటక ప్రాంతానికి చెందినవారే.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే...
గతంలో టాలీవుడ్‌ను మురిపించిన కన్నడ కథానాయికలు చాలామందే ఉన్నారు. ‘ఇడియట్‌’తో  పూరి జగన్నాథ్‌ పరిచయం చేసిన  రక్షిత ఆ సూపర్‌హిట్‌తో కొన్ని సంవత్సరాలు బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. మహేశ్‌బాబుతో ‘నిజం’, నాగార్జునతో ‘శివమణి’, బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహా’, ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’, చిరంజీవితో ‘అందరివాడు’ సినిమాల్లో కనిపించారు రక్షిత.  ప్రభాస్‌ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా పరిచయం అయిన సంజన ‘సత్యమేవ జయతే’, ‘పోలీస్‌ పోలీస్‌’, ‘దుశ్శాసన’, ‘యమహో యమా’, ’సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాల్లో కనిపించారు. భూమిక నిర్మించిన ‘తకిట తకిట’తో తెలుగు కుపరిచయమైన కన్నడ భామ హరిప్రియ. ‘పిల్ల జమిందార్‌’, ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’, ‘జై సింహా’ వంటి సినిమాల్లో కనిపించారామె. తెలుగు సినిమాల్లో ఓ మార్క్‌ చూపించుకున్న మరో హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌ .

పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌ సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమా ద్వారా తెలుగుకు పరిచయమైన ప్రణీతా... సిద్ధార్థ్‌తో ‘బావ’, పవన్‌ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌ ‘రభస’ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల్లో సూపర్‌ హిట్‌ అయిన ‘అమ్మో బాపుగారి బొమ్మో’, ‘అచ్చ తెలుగు ఆడపిల్లలా’ అనే పాటలు ఈ కన్నడ భామకు అచ్చ తెలుగమ్మాయి, బాపూగారి బొమ్మ అనే ట్యాగులిచ్చేశాయి. రీసెంట్‌గా ‘హలో గురూ ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’ సినిమాల్లోనూ నటించారు. ఎప్పటికప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌తో పలకరిస్తున్న లక్ష్మీ రాయ్‌ కూడా కన్నడ అమ్మాయే.  మరి.. ఇంకా శాండిల్‌ వుడ్‌ తీరం నుంచి ఎంతమంది అందగత్తెలు వస్తారో చూడాలి.
– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement