Heroins
-
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్‌లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్‌లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్‌లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్‌కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
హీరోయిన్స్‌గా రఫ్ఫాడించిన హీరోల కూతుర్లు వీళ్లే.. (ఫొటోలు)
-
దూసుకుపోతున్న గ్లామర్ హీరోయిన్స్.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే
-
ఈ హీరోయిన్స్ కు అన్ని ప్లాపులే పాపం..
-
ఆ ట్విస్ట్‌లు తెలుసుకోవడానికి వచ్చేస్తున్నారీ సైంటిస్ట్స్
అంతరిక్షంలో ఏం ఉందో తెలుసుకోవాలి.. కావాలి ఓ సైంటిస్ట్. అంతరిక్షానికి పంపడానికి రాకెట్ కావాలి.. ఆ రాకెట్ తయారీకి కావాలి ఓ సైంటిస్ట్. కళ్లు చెదిరే రంగు రాయి దొరికింది. ఆ రాయి విలువ తెలియాలంటే కావాలి ఓ సైంటిస్ట్. సైంటిస్ట్‌లు చేసే ట్విస్ట్‌లు భలే ఉంటాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఆ ట్విస్ట్‌లు చాలా మజానిస్తాయి. నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాల్లో సైంటిస్టులుగా కనిపించనున్న స్టార్స్ ఎవరో చూద్దాం. మొన్నామధ్య బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ చేరుకుని పరిశోధనలు చేశారు. ‘ప్రాజెక్ట్ కె’ సక్సెస్ కావడం కోసమే అమితాబ్ ఈ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారట. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అని, ఈ చిత్రానికి టైమ్ ట్రావెల్ టచ్ ఉందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారన్నది తాజా వార్త. పరిశోధనల్లో భాగంగా అమితాబ్ చేసే ఓ ప్రయోగం వల్లే ‘ప్రాజెక్ట్ కె’ కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందట. ఈ ‘ప్రాజెక్ట్ కె’లో సైంటిస్ట్‌గా అమితాబ్ ఇచ్చే ట్విస్టులు చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక హిందీలో రూపొందిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ప్రధాన తారాగణంగా నటించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్ర దర్శకుడు. ఈ మూవీలో నాగార్జున పురాతత్త్వ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. నాగార్జున చేసే పరిశోధనల నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ కథ మొదలవుతుందట. అలాగే ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ఓ కీలక పాత్ర చేశారు. షారుక్ సైంటిస్ట్ అనేది బాలీవుడ్ టాక్. శివలో (‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ పాత్ర పేరు) అతీంద్రీయ శక్తులు ఉన్నాయని సైంటిస్ట్‌గా ఈ సినిమాలో షారుక్ ఇచ్చే ట్విస్ట్‌తోనే కథ అసలు మలుపు తిరుగుతుందట. నాగార్జున, షారుక్ సైంటిస్ట్‌లుగా ఆడియన్స్‌కు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారనేది ఈ ఏడాదిలోనే చూడొచ్చు. షారుక్ ఖాన్, మాధవన్ ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ను ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల కానుంది. సేమ్ టు సేమ్ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున చేసిన పురాతత్త్వ శాస్త్రవేత్తగానే అక్షయ్ కుమార్ నటించారు. అక్షయ్ కుమార్ హీరోగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో హిందీలో ‘రామ సేతు’ అనే చిత్రం రూపొందింది. ఇందులోనే పురాతత్త్వ శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ నటించారు. రావణుడి బారి నుండి తన భార్య సీతను రక్షించడానికి భారతదేశం, శ్రీలంక మధ్య రాముడు నిర్మించినట్లుగా చెప్పుకుంటున్న రామసేతు అనే బ్రిడ్జ్ ఉన్న మాట నిజమా? కాదా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. ఈ బ్రిడ్జ్‌ను పూర్తి చేయడానికి శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ ఏం చేశారు? అనే అంశంతో కథ సాగుతుందట. హీరోయిన్లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేశారు సత్యదేవ్. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్త, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. కొన్ని అభియోగాల వల్ల నంబి నారాయణన్ ఇస్రో నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ పరిణామాలు, ఇస్రోలో ఆయన చేసిన పరిశోధనలు వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్‌గా మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం వహించి, నిర్మించారు. నటి సిమ్రాన్ కీలక పాత్ర చేశారు. ‘బ్రహ్మాస్త్ర’లో ఓ గెస్ట్ రోల్ చేసినట్లుగానే ఈ చిత్రంలో కూడా షారుక్ అతిథిగా కనిపిస్తారని టాక్. అక్షయ్ కుమార్, హన్సిక ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను ఈ ఏడాది జూలై 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ హన్సిక ఓ సైన్స్ ల్యాబ్‌లో సైంటిస్ట్‌గా జాయినయ్యారు. తన నెక్ట్స్ ఫిల్మ్ కోసమే హన్సిక సైంటిస్ట్‌గా మారారు. కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేత్ర అనే యంగ్ సైంటిస్ట్‌గా కనిపిస్తారు హన్సిక. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో ఓ భారీ సైన్స్ ల్యాబ్ సెట్ వేశారు. షూటింగ్‌ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ పేర్కొంది. వీరితోపాటు మరికొందరు సినీ తారలు వెండితెర సైంటిస్టులుగా కనిపించనున్నారు. -
‘డీ గ్లామరస్’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ
హీరోయిన్ అంటే అమాయకంగా ఉండి.. హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్ హీరోయిన్’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్ కనబడింది. ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం. ‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్ పరేశాన్ అయ్యారు. కెరీర్ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్ చేసినవన్నీ గ్లామరస్ రోల్సే కాబట్టి ‘గ్లామరస్ హీరోయిన్’ అనే స్టాంప్ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని రకుల్ నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. రకుల్ కంటే సీనియర్ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ. గ్లామర్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్ రోల్స్ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి. 2022లోనూ... 2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్ తార, దాదాపు డీ–గ్లామరస్ రోల్స్ చేసే నందితా దాస్ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే సాయిపల్లవి డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ. సాయిపల్లవి మీద గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్. కీర్తికి గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. -
నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రానికి హీరోయిన్ కష్టాలు.. ఫైనల్‌గా
Sonal Chauhan Heroine In Nagarjunas The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. మొన్నటిదాకా బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో అలరించిన నాగ్.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించాడు. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీకి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని తెలిసిందే. మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు నాగార్జున. ఇటీవల 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కింగ్ నాగ్ స్వయంగా ప్రకటించాడు. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథానాయికగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారట. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర ఒక గూఢచారి. ఇందుకోసం మొదట చందమామ కాజల్ అగర్వాల్‌ను మేకర్స్ సెలెక్ట్ చేశారని సమాచారం. కాజల్‌తో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. అయితే పలు అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుందని తెలుస్తోంది. తర్వాత అమలాపాల్‌ను ఎంపిక చేసి కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆమె కూడా మూవీ నుంచి తప్పుకుందట. తర్వాత చిత్రబృందం ఎఫ్2 ఫేమ్ మెహ్రీన్‌ను సంప్రదించింది. ఆమె పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కితగ్గారట. ఇక చేసేదేం లేక హీరోయిన్ వేటలో పడిందట 'ది ఘోస్ట్' చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ జాబితాలో సోనాల్ చౌహన్ పేరు ఉన్నట్లు సమాచారం. చిత్రంలో గూఢచారి పాత్రలో ఆఖరిగా సోనాల్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న 'ది ఘోస్ట్' మూవీలో నాగార్జున మాజీ 'రా' అధికారిగా కనిపించనున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీవరకు 'వైల్డ్ డాగ్' చిత్రంలో 'ఎన్ఐఏ' అధికారిగా నటించారు నాగార్జున. ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
వెబ్ సిరీస్‌లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..
Heroines Who Has Entry In Web Series: కరోనా కారణంగా స్టార్స్‌కి వెబ్ వరల్డ్ మంచి హబ్ అయింది. బిగ్స్క్రీన్పై తారలు కనిపించని లోటుని వెబ్ సిరీస్‌లు కొంతవరకు తీర్చాయి. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. హబ్బ్బబ్బా.. వెబ్బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్ సిరీస్‌లే ఓ ఎంటర్టైన్మెంట్. పైగా స్టార్స్ చేయడంవల్ల ఈ సిరీస్‌లు బోలెడంత క్రేజ్ కూడా తెచ్చుకోగలిగాయి. ఆ క్రేజ్‌ని స్టార్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు. మరి.. వెబ్ ఉండగానే హౌస్‌ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా ! కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది సమంత. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లోనూ మెరిసింది. సిల్వర్ స్క్రీన్ సమంతలోని పాజిటివ్ యాంగిల్‌ని చూపిస్తే డిజిటల్ వరల్డ్ నెగెటివ్ యాంగిల్‌ని బయటికి తీసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ షేడ్‌లో కనిపించింది సమంత. వెబ్ ఎంట్రీతోనే ఎల్టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారామె. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారింది. కానీ ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించింది. సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయి. ఇక మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలీక్యాస్ట్’పై అప్పట్లో వెబ్ వ్యూయర్స్ ఆసక్తి కనబరిచారు. కానీ వీరి అంచనాలను ఈ సిరీస్ అందుకోలేకపోయింది. ఇందులో జెన్నీఫర్ మాథ్యూ పాత్రలో కనిపిస్తుంది కాజల్. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘లైవ్ టెలీకాస్ట్’కు సరైన వ్యూయర్షిప్ లభించలేదు. ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూషన్లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తెలిపింది. మరో స్టార్ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్ సిరీస్‌లు ‘లెవన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ చేసింది. కేవలం వెబ్ సిరీస్‌ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్‌గా కనిపించింది తమన్నా. ఓ ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘మాస్టర్ చెఫ్’ షోకు తమన్నా హోస్ట్‌గా కనిపించింది. అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’తో ఈ ఏడాది వెబ్‌లోకి తొంగిచూశారు పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా. ఇదే ఏడాది వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలోనూ ఈషా రెబ్బా మెరిసింది. ఇక ఇదే ‘పిట్టకథలు’లోని ఓ కథలో కనిపించిన అమలా పాల్ ఆ తర్వాత తెలుగు వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’తో ఆకట్టుకుంది. ఇదే ఆంథాలజీలో మెరిసిన టాప్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిందట. కాగా మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ‘నవరస’లో ఓ రోల్ చేసింది అంజలి. వీరితోపాటు మరికొందరు హీరోయిన్లు వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు. సమంత, కాజల్, తమన్నాల కన్నా కాస్త లేట్‌గా వెబ్‌లోకి ఎంటరయింది త్రిష. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రిందా’కు సైన్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆల్రెడీ ఒకేసారి రెండు వెబ్ సిరీస్‌లను పూర్తి చేసిన మరో హీరోయిన్ రాశీ ఖన్నా. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లలో తన వంతు షూటింగ్‌ను రాశీ ఖన్నా పూర్తి చేసింది. హిందీ వెబ్ వరల్డ్‌లో హీరోయిన్ రెజీనా చేసిన తొలి సిరీస్ ‘రాకెట్ బాయ్స్’. ఇందులో మృణాళినీ సారాభాయ్‌గా కనిపిస్తుంది రెజీనా. ఇటు ‘సన్నీ’ వెబ్ సిరీస్‌లోనూ రెజీనా ఓ లీడ్ చేసింది. హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ నటిస్తున్నారు. ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
వీళ్ళు చాల కేక గురు
-
నా ఆరోగ్యం బాగుంది!
సినీ సెలబ్రిటీల ఆరోగ్యంపై ఆన్లైన్లో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియక వారి అభిమానులు కంగారు పడుతుంటారు. ఆ వార్తలు అటూ ఇటూ తిరిగి సంబంధిత సెలబ్రిటీ వద్దకు చేరాక ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. వదంతులు నమ్మొద్దు’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా నటి రాధికకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రాధిక ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా రాధిక స్పందిస్తూ– ‘‘మీరు (అభిమానులు) నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. నాకు కరోనా సోకలేదు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆఫీసుకు హాజరవుతున్నా’’ అన్నారు. -
సవాల్‌కి సై
కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పాత్రలో కనిపించనున్నారు. హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘సీటీమార్’. ఇందులో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్’ అనే స్పోర్ట్స్ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్ లుక్ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్నెస్ మీద మరింత దృష్టిపెట్టారామె. మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్ ట్రైనింగ్ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్ హీరోయిన్గా మారనున్నారు కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్ హీరోయిన్ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్ రోల్స్ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుందాం. -
చదివేస్తున్నారానందంగా...
హీరోయిన్లంటే తీరిక లేనంత బిజీ. పలు భాషల్లో సినిమాలు చేస్తుంటారు. షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో సగం సమయం గడిచిపోతుంది. హాబీలకు సమయం కేటాయించేంత వీలు ఎక్కువగా దొరకదు. కొందరికి బుక్స్ చదవడం ఓ హాబీ. కరోనా వల్ల పని ఒత్తిడి తగ్గి, పుస్తకాలు చేతిలో తీసుకునే ఛాన్స్ దొరికింది. ఆలస్యం చేయకుండా షెల్ఫ్‌లో ఉన్న పుస్తకాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. అక్షరాలన్నీ నమిలేసే పుస్తకాల పురుగులయ్యారు. ఈ లాక్డౌన్లో నచ్చిన పుస్తకాల్ని ‘చదివేస్తున్నారానందంగా’. మరి బుక్స్ పట్టిన భామల గురించి చదివేద్దామా? ‘‘ఈ క్వారంటైన్లో యోగా, పుస్తకాలు బిజీగా ఉంచాయి’’ అంటూ తాను చదివిన పుస్తకాల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు శ్రియ. అనార్కీ, ఉమెన్ హూ రన్ దిత్ ది ఉల్వ్స్, లైవ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్, విపాసన యోగాకు సంబంధించిన పుస్తకాలు.. ఇంకా చాలా చదివానని తెలిపారామె. అంతే కాదు.. మంచి పుస్తకాలేమైనా ఉంటే నాకు సూచించరూ అని విన్నవించుకున్నారు శ్రియ. పుస్తకాల పురుగు రాశీ ఖన్నా ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకం ‘ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్’. ఈ లాక్డౌన్లో చదవడం మొదలెట్టారట. ‘‘ఈ పుస్తకం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. కొంచెం నెమ్మదస్తురాలిని కూడా అయ్యాను’’ అన్నారు రాశీ ఖన్నా. దక్షిణాదిన క్రేజీ హీరోయిన్గా దూసుకెళుతోన్న రష్మికా మందన్నాకు కూడా పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఇటీవల చదివిన ‘ది లిటిల్ బిగ్ థింగ్స్’ చాలా బాగుందని పేర్కొన్నారామె. ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులార్టీ తెచ్చుకున్న నభా నటేశ్ కూడా లాక్డౌన్ సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించారు. మరో తార ఆండ్రియా ‘‘జీవితాన్ని హ్యాండిల్ చేయలేనట్టుగా అనిపిస్తే పుస్తకాల్లోకి వెళ్లిపోతాను. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి ఎస్కేప్ అయి పేజీల మధ్యలో సంతోషాన్ని వెతుక్కోవడం నాకు భలే ఇష్టం’’ అంటారు. ‘మీరు పుస్తకాలు ఎందుకు చదువుతుంటారు’ అని అడిగితే ఈ బ్యూటీ ఇలా చెబుతారు. అది మాత్రమే కాదు.. ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం కూడా రాశారామె. ఇందులో కవితలు ఉంటాయి. గతంలో ఒక పెళ్లయిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారామె. అతడు ఆండ్రియాని మానసికంగా, శారీరకంగా వేధించాడట. అతన్నుంచి విడిపోయి, మానసికంగా చాలా కుంగిపోయారామె. తన వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు ఆండ్రియా. ఇక ఆమె చదివిన పుస్తకాల విషయానికొస్తే.. ‘ది లేజీ జీనియస్ వే’, ‘హామిల్టన్: ది రివల్యూషన్’, ‘ఇంటిమేషన్స్’.. ఇంకా చాలా ఉన్నాయి. ‘‘జీవితం ఏమో చిన్నది. చదవాల్సిన పుస్తకాలేమో చాలా!’’ అంటున్నారు శోభితా ధూళిపాళ్ల. క్వారంటైన్ సమయంలో అక్షరాల్ని నమిలేశారు ఈ తెలుగమ్మాయి. లియోనార్డ్ కోహెన్ రాసిన నవలలు, కవితలంటే చాలా ఇష్టం అంటున్నారు శోభితా. జ్ఞానం పెంచుకోవడానికి, సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా చదవడానికి, బాధ నుంచి బయటపడటానికి, టైమ్‌పాస్ కోసం... ఇలా ఏదైనాసరే మనకోసం ఒక పుస్తకం ఉంటుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అవుతుంది. -
2020లో 10 పూర్తి
ఇండస్ట్రీకి ప్రతి ఏడాది కొత్త ముఖాలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకునేలోపే చాలా వరకు మాయమవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు.. హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్ స్పాన్ తక్కువ. ఎంత మంది వచ్చినా కొందరికి మాత్రమే టాప్‌లీగ్ లో చోటు దక్కుతుంది. అలాంటి హీరోయిన్లను ఎన్ని ఏళ్లు చూసినా బోర్ కొట్టదంటారు ప్రేక్షకులు. ఆ నాయికలు పరిచయం అయి పదేళ్లయినా అదే ఫాలోయింగ్‌ని ఎంజాయ్ చేస్తారు. సమంత, శ్రుతీ హాసన్, తాప్సీ, ప్రణీత... ఈ నలుగురూ ఇండస్ట్రీకి వచ్చి 2020తో పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీళ్ల కెరీర్‌పై స్పెషల్ రౌండప్. జోరుగా.. హుషారుగా ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమయింది తాప్సీ. ‘మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, కాంచన’ వంటి హిట్ సినిమాల్లో నటించి, తెలుగు లో స్టార్ హీరోయిన్ల జాబితా లో చేరిందీ బ్యూటీ. కానీ వరుస సినిమాలు చేస్తున్నా వరుస హిట్స్ అందుకోలేకపోయింది. అయితే తాప్సీ సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ సక్సెస్‌లు చూస్తోంది. హిందీలో చేసిన ‘పింక్’ సినిమా తాప్సీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలను వరుసగా ఎంపిక చేసుకుంటూ హిందీలో స్టార్ అయింది. బాలీవుడ్లో తాప్సీ చేసిన ‘సూర్మ, ముల్క్, బద్లా, సాంద్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్, థప్పడ్’ వంటి సిని మాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే సౌత్‌లోనూ ఈ మధ్య ఆ జోష్ని కొనసాగించింది. తమిళంలో ‘గేమ్ ఓవర్’, తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ వంటి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు సైన్ చేసి జోరుగా హుషారుగా ఉంది తాప్సీ. శ్రుతి నచ్చింది కమల్ హాసన్ కుమార్తె అంటే అడగకుండానే పాపులారిటీ వస్తుంది. దాని వెనకే ప్రెషర్ కూడా ఉంటుంది. అడుగు తీసి అడుగేస్తే కమల్‌తోనే పోలుస్తారు. శ్రుతికి ఎంట్రీ సులువుగా లభించినా హిట్ అంత త్వరగా రాలేదు. ఐరన్ లెగ్ అని బ్రాండ్ పడింది. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించింది శ్రుతి. దాంతో ఐరన్ లెగ్ ముద్ర పోయింది. ప్రేక్షకులకు శ్రుతి నచ్చింది. కేవలం నటిగానే భేష్ అనిపించుకోవడమే కాదు.. గాయనిగా పలు హిట్ సాంగ్స్ పాడి శభాష్ అనిపించుకుంది. ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (ఓ మై ఫ్రెండ్), కన్నులదా (3), డౌన్ డౌన్ డౌన్ (రేసుగుర్రం)’ వంటి పాటలు పాడింది. మ్యూజిక్ మీద దృష్టిపెడుతూ ఆ మధ్య యాక్టింగ్ కెరీర్‌కి చిన్న గ్యాప్ ఇచ్చింది. మూడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తోంది శ్రుతీహాసన్. ‘యాక్టర్‌గా 11ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. మీ అందరి అభిమానానికి, ప్రేమకి ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది శ్రుతి. మాయ చేసింది ‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్గా పరిచయమయింది సమంత. అందులో స్యామ్ చేసిన జెస్సీ పాత్ర యూత్ అందర్నీ మాయలో పడేసింది. ఆ తర్వాత సమంత ఏ సినిమా చేసినా థియేటర్స్‌కి వెళ్లేలా చేసింది. టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూనే, పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయింది. ‘బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మహానటి, యూ టర్న్, మజిలీ, ఓ బేబి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు స్యామ్ కెరీర్లో ఉన్నాయి. హిట్ సినిమాలో భాగమవ్వడమే కాదు, తను భాగమవ్వడం వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. పెళ్లి అయితే పెద్దగా సినిమాల్లో కనిపించదు అనే అపోహను కూడా బ్రేక్ చేసింది ఈ అక్కినేని కోడలు. పై లిస్ట్‌లో చివరి ఐదు సినిమాలు పెళ్లి తర్వాత చేసినవే. తెలుగులోనే కాదు తమిళంలోనూ ‘కత్తి, తేరీ, ఇరుంబు దురై’ వంటి హిట్ సినిమాలు చేసింది సమంత. ‘‘ఇదో బెస్ట్ జర్నీ. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలున్నాయి. సంతోషాలు, బాధలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో నిలబడిన అందరికీ థ్యాంక్స్’’ అంటోంది సమంత. అన్నట్లు.. నటిగా పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమంత తన ఇన్ స్ట్రాగామ్‌లో 11 మిలియన్ (కోటీ 10 లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించిన విషయాన్ని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది. హిందీ జర్నీ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయింది బెంగళూర్ బ్యూటీ ప్రణీతా సుబాష్. పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌తో ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించింది ప్రణీత. ఈ మధ్యే రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించింది. సౌత్‌లో నాయికగా పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రణీత ఇప్పుడు హిందీలో కూడా జర్నీ మొదలుపెట్టింది. అజయ్ దేవగన్ ‘భూజ్’లో కీలక పాత్రలో కనిపించనుందామె. అలాగే ‘హంగామా’ అనే సినిమాలోనూ నటిస్తోంది ప్రణీత. -
తారా దీపం
చీకటిని అంతం చేసేది వెలుగు. కోవిడ్–19తో ప్రపంచాన్ని ఒకలాంటి చీకటి ఆవహించింది. మన దేశంలో ఈ చీకటిని పోగొట్టడానికి ‘దీపం వెలిగిద్దాం’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల దీపాలు వెలిగాయి. సినిమా స్టార్స్ కూడా దీపాలు వెలిగించి ‘‘మేము సైతం’’ అన్నారు. ఆ వెలుగులు చూద్దాం. వెంకటేష్, నాగార్జున, అమల, అఖిల్, మహేశ్ బాబు పాయల్ రాజ్‌పుత్, విష్ణు, గోపీచంద్, శ్రీయ పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక అర్జున్, ఐశ్వర్య, సాయి కుమార్, సురేఖ -
సత్య నాయికలు
సత్యభామ అంటే.. నిలువెత్తు అహంకారం, పొగరు, మంకుపట్టు.. గారాల భార్యామణి.. ఇవే గుర్తొస్తాయి. వీరోచిత నారీమణిగా ఆమెను దీపావళి నాడు మాత్రమే తలుచుకుంటాం! నిజానికి సత్యభామ నిలువెత్తు ఆత్మస్థయిర్యం, ఆత్మగౌరవం. సడలని పట్టుదల. భర్తతో సమానంగా హోదా తీసుకున్న సహచరి. కష్టాల్లో భర్తకు కొండంత అండగా నిలిచిన జీవిత భాగస్వామి! మహిళలకు సంబంధించినంత వరకు నరకాసుర వధ కాదు దీపావళి. పిరికితనాన్ని కాల్చేసి.. ఆత్మ స్థయిర్యాన్ని వెలిగించుకున్న రోజు! మహిళలంతా సత్యభామగా గౌరవం అందుకున్న వేడుక!! ఇలాంటి సత్యభామలు స్క్రీన్ మీద కూడా కనిపించి మహిళా ప్రేక్షకుల ఆలోచనా కోణాన్నే మార్చేశారు. ‘మిష్టర్ పెళ్లాం’.. గుర్తుంది కదా? బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త దొంగతనం నిందతో సస్పెండ్ అవుతాడు. అప్పుడు.. అప్పటి దాకా గృహిణిగా ఉన్న భార్య కుటుంబ పోషణ బాధ్యతను తీసుకొని ఉద్యోగానికి వెళ్తుంది. నైపుణ్యంతో తక్కువ సమయంలోనే పదోన్నతిని, మంచి జీతాన్ని అందుకుంటుంది. ఇంకోవైపు భర్త నిర్దోషి అని రుజువుచేయడానికి తనవంతు ప్రయత్నమూ మొదలుపెట్టి ‘మిష్టర్ పెళ్లాం’ అనిపించుకుంటుంది కథానాయిక ఝాన్సీ (ఆమని). రాధాగోపాళం చూసే ఉంటారు. పురుషాహంకారాన్ని మీసానికి అంటించుకున్న గోపాలానికి చిలిపితనం, సమయస్ఫూర్తి, ప్రజ్ఞాపాటవాలుగల జీవన సహచరి రాధ. గోపాళం (శ్రీకాంత్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. రాధ (స్నేహ) కూడా లాయరే. ఇంకా చెప్పాలంటే గోపాలం వాదిస్తున్న ఓ కేసులో డిఫెన్స్ లాయర్. నిజం నిగ్గు తేల్చి భర్తను ఓడిస్తుంది. అహం దెబ్బతిన్న గోపాలం భార్యను వదిలేయాలనుకుంటాడు. అప్పటికి ఆమె గర్భవతి. తను తలదించుకోకుండా.. సాగిల పడకుండా.. భర్త తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది రాధ. తప్పొప్పులను సరిదిద్దుకుంటూ నడిస్తేనే దాంపత్యం.. కలిసి ఉంటేనే ఆలుమగలు లేకపోతే ఒక స్త్రీ, ఒక పురుషుడు అని చెప్తుందీ సినిమా. ‘గోరంత దీపం’ ఇంకో సినిమా. భర్తే తండ్రి, గురువు, దైవం అన్నీనూ అనే సుద్దుల సారెతో అత్తారింట్లోకి అడుగుపెడ్తుంది పద్మ (వాణిశ్రీ). భర్త శేషు (శ్రీధర్) బ్యాడ్మింటన్ ఆటగాడు. అత్తగారి (సూర్యకాంతం) ఆరళ్లు షరామామూలే. భార్య ఆత్మగౌరవాన్ని గుర్తించని భర్త ప్రవర్తనా సహజమే ఆ సంసారంలో. అదనంగా పద్మకున్న సమస్య డాక్టర్ మోహన్ (మోహన్ బాబు). భర్త స్నేహితుడు అతను. ఆమె మీద కన్నేసి కబళించాలని ఎప్పటికప్పుడు ఎత్తులు, పన్నాగాలు పన్నుతూంటాడు. అతని గురించి భర్తకు చెప్పినా వినడు. విన్నా నమ్మడు. నమ్మినా స్పందించడు. అప్పుడు తనే సత్యభామ అయి మోహన్‌ను ఎదుర్కొంటుంది. విజయం సాధిస్తుంది. ఇంటికే కాదు జీవితానికే దీపావళి తెచ్చుకుంటుంది. హిందీలో ‘‘తుమ్హారీ సులూ’’ కూడా ఏం తీసిపోదు ఈ సత్యభామ సీక్వెన్స్‌లో. కథానాయిక సులోచనా దూబే (విద్యా బాలన్) చూపిన తెగువా తక్కువేం కాదు. రేడియోలో పాటలు వింటూ .. వాళ్లు పెట్టే క్విజ్‌లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్న ఆమె ఒకరోజు రేడియో క్విజ్‌లో విజేతవుతుంది. అప్పటికే భర్త తను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని మారి ఇబ్బందులు పడ్తూంటాడు. సులూ తనకు వచ్చిన బహుమతి తీసుకోవడానికి రేడియో స్టేషన్‌కు వెళ్లి అక్కడ లేట్ నైట్ షో అనౌన్సర్‌గా జాబ్ తెచ్చుకుంటుంది. భర్త ఉద్యోగం పోయే స్థితి వస్తుంటే ఆమె ఉద్యోగంలో రాణిస్తూంటుంది. దీంతో తలెత్తిన భర్త ఈగో సమస్యను, కొడుకు క్రమశిక్షణారాహిత్యాన్ని అన్నిటినీ నేర్పుగా చక్కదిద్దుకొని.. చివరకు తను పనిచేసే రేడియోస్టేషన్లోని ఉద్యోగులకు క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చేలా భర్తకు కాంట్రాక్టూ ఇప్పిస్తుంది సులోచన దూబే. వర్తమాన ‘సత్య’లు అయితే ఈ సినిమాలకు పురాణ స్త్రీ సత్యభామ స్ఫూర్తి కాదు. వ్యాపారంలో నష్టం వస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని భర్త చతికిలపడితే ఆఖరుసారిగా ఒక్క చాన్స్ తీసుకొని దగ్గరున్న బంగారాన్ని కుదువబెట్టి.. కంపెనీకోసం శ్రమించి రుణంలోంచి బయటపడేసి.. తమను నమ్ముకున్న వాళ్ల జీతాలకు పూచీ ఇచ్చి జీవితాలకు భరోసా కల్పించిన భార్య, ఉన్నది అమ్ముకొని దుబాయ్ వెళ్లి ధిర్హామ్స్లో సంపాదనను ఇంటికి పంపిస్తాననే ధీమా చూపిన మనిషి అనారోగ్యంతో ఇంటికొచ్చి మంచానికి అతుక్కుపోతే ఆయన ఆరోగ్యానికి చికిత్సే కాదు కుటుంబ ఆర్థిక సమస్యల ట్రీట్మెంట్నూ తలకెత్తుకొని ధైర్యంగా జీవనపోరాటం చేస్తున్న ఆ ఇంటి ఇల్లాలు, కష్టాల కడలిలో చిక్కుకున్న ఇంటిని వీడని ధైర్యంతో చక్కబెట్టిన సహధర్మచారిణి.. ఇలాంటి ఇంకెందరో సంసార సమరంలో సొమ్మసిల్లిన భర్తల చేతిలోంచి కుటుంబ రథం పగ్గాలు పట్టి ముందుకు నడిపిస్తున్న వారంతా నిజ జీవితంలోని సత్యభామలే. మహిళాలోకానికి ఎప్పటికీ వారే స్ఫూర్తి.. ప్రేరణ!! -
బేడీలు వేస్తాం!
పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్, రాయ్ లక్ష్మి, రేవతి, జ్యోతిక అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్ శరత్‌కుమార్. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ఇన్విస్టిగేషన్ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె స్కెచ్ హీరో సుదీప్ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్ గెటప్ వేయడం కోసమే. పీవీఆర్ గురుప్రసాద్ ఈ చిత్రానికి డైరెక్టర్. సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్ భామలు కొందరు పోలీస్‌సైరన్ మోగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్ పట్టుకున్నారు కరీనా కపూర్. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ -
శాండల్ సౌందర్యం
తెలుగు హీరోల జాతకాలు తెరపై ఎక్కువగా కన్నడ హీరోయిన్లతో కలుస్తాయెందుకో. ఆ కస్తూరి నేల నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ హిట్లు కొట్టారు. తెర మీద శాండిల్ సౌందర్యాన్ని పరిచారు. బి.సరోజాదేవి నుంచి నేటి పూజా హెగ్డే వరకు బెంగళూరు నుంచి ఫ్లయిటెక్కితే హైదరాబాద్‌లో క్లాప్ కొట్టడమే. ఒకప్పుడు ముంబై హీరోయిన్ల తాకిడి ఉండేది. ఇప్పుడు సెట్‌కి వెళితే వేడివేడి బిసిబేళా బాత్ సువాసనే. అందమైన ఆడపిల్లలందరూ హీరోయిన్లు కాలేరు. హీరోయిన్లు అయినవారందరూ నిలబడలేరు. ఈ కెరీర్లో నిలబడాలంటే చాలా కలిసిరావాలి. అందుకే యాక్టింగ్ ఫీల్డ్కి దగ్గరవ్వాలని చూసేవారి కంటే దూరంగా ఉండేవాళ్లే ఎక్కువ. అదీగాక ఆ రంగానికి అవసరమైన ట్రెండ్ ఫాలో అవడం అంటే ఫ్యాషన్ పరంగా, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండటం కూడా కష్టమైన పనే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో వంద మంది హీరోయిన్లు కూడా ఉండరు ప్రస్తుత మార్కెట్లో. అందుకేనేమో ఏ సినిమా రంగమైనా ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను వెతుకుతూ ఉంటుంది. ఒకప్పుడు హిందీ రంగంలో హీరోలందరూ పంజాబీలు అయితే హీరోయిన్లు అధికంగా ముస్లింలు. ఇప్పుడు ఆ పరంపర కూడా తెగిపోయింది. టాలెంట్ ఎక్కడున్నా వెతికి తెచ్చుకోవడం తప్పనిసరి అయ్యింది. తెలుగువారికి, కన్నడ సీమకు ఇరుగుపొరుగు దోస్తీ ఉన్నట్టే సినీరంగపు అనుబంధం కూడా ఉంది. ఆ ప్రాంతం హీరోయిన్లు బి.సరోజా దేవి దగ్గరి నుంచి జయంతి, భారతి వరకు తెలుగు సినీ సీమలో తమ ప్రభావాన్ని చూపారు. ఇప్పటికీ ఆ దారిలో కొత్త హీరోయిన్లు నడిచి వచ్చేలా చేశారు. ఇవాళ పెద్ద తెలుగు సినిమాలన్నీ కన్నడ హీరోయిన్లతో పని చేస్తున్నాయని చెప్పాలి. ఆ వివరాలు చూద్దాం. హెగ్డే ప్రస్తుతం హెడ్డే మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్‌తో ఆల్రెడీ యాక్ట్ చేసిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)లో హీరోయిన్గా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో మరోసారి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ ఆకట్టుకునేలా ఉండటంతో పూజా డేట్స్ కోసం గిరాకీ పెరిగింది. పుట్టి పెరిగింది వేరు వేరు ప్రాంతాల్లో అయినా పూజా మూలాలు మాత్రం కన్నడ గడ్డ మీదే ఉన్నాయి. పూజా తండ్రి మంజునాథ్, తల్లి లతా కర్ణాటకలోని మంగళూర్ ప్రాంతానికి చెందినవారు. క్రష్మిక మండన్నా రష్మికా మండన్నాను ‘కర్ణాటక స్టేట్ క్రష్’ అంటారు. ‘కిరాక్ పార్టీ’తో అక్కడ ఆమెకు ఆ పేరు వచ్చింది. తెలుగులో కూడా అదే ఊపుతో హవా కొనసాగిస్తున్నారు. దానికి తోడు గోల్డెన్ లెగ్గా మారారు. రష్మికాకు తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాఫ్ లేదు. నాగశౌర్యతో బ్లాక్‌బస్టర్ మూవీ ‘చలో’ చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ‘గీతా గోవిందం’ అయితే వంద కోట్ల క్లబ్లో చేరింది. నాగార్జున–నానీల ‘దేవదాస్’తో 2018లో తన హ్యాట్రిక్ పూర్తి చేశారు రష్మిక. ఈమె చేతిలో ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్, నితిన్ ‘భీష్మ’ ఉన్నాయి. అవే కాకుండా అల్లు అర్జున్ – సుకుమార్ చేయబోయే ప్రాజెక్ట్‌లో, మహేశ్ బాబు – అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారు. నభా.. శభాష్ జోష్ మీదున్న మరో చిక్మగ్లూర్ చిన్నది నభా నటేశ్. రవిబాబు తీసిన ‘అదుగో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నభా నటేశ్.. ‘నన్ను దోచుకుందువటే’ నభాకు కావాల్సిన బూస్ట్ ఇచ్చింది. . ప్రస్తుతం రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా చేస్తున్నారు నభా. రవితేజతో ‘డిస్కో రాజా’లో కూడా ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. అది కాకుండా గల్లా అశోక్ హీరోగా రూపొందే సినిమాలోనూ చేస్తున్నారు. నిధీ వచ్చిన లగాయత్తు ‘నిన్ను రోడు మీద చూసినాది లగాయత్తు’ అని అప్పట్లో రమ్యకృష్ణ కోసం నాగార్జున పాడితే ఈ మధ్య నిధీ అగర్వాల్ కోసం నాగచైతన్య పాడారు. ‘సవ్యసాచి’లో నిధీ అగర్వాల్ హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ వెంటనే అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ చేశారు. తాజాగా రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు నిధీ అగర్వాల్. తెలుగుపై ‘శ్రద్ధ’ పెట్టారు కన్నడ ఇండస్ట్రీలో టాప్ ఫామ్‌లో కొనసాగుతున్న హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. ఈ ఏడాది ఏకకాలంలో అటు బాలీవుడ్‌కు ఇటు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు శ్రద్ధ. తెలుగులో నాని హీరోగా రూపొందిన ‘జెర్సీ’లో సారా అనే పాత్ర చేశారు. సినిమాలో నాని, శ్రద్ధా కెమిస్ట్రీ బ్యాటు, బాల్లా ఉన్నాయని విమర్శకులు రాశారు. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ఆదితో చేసిన ‘జోడీ’ సినిమా ఉంది. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎక్కడికీ పోలేదు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో పరిచయమైన బెంగళూరు బ్యూటీ నందితా శ్వేతా. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ సినిమాల్లో కనిపించారామె. లేటెస్ట్గా ఆమె నటించిన ‘అభినేత్రి 2’, ‘7’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘అక్షర’ షూటింగ్ జరుగుతోంది. రాజశేఖర్ ‘కల్కి’లో కూడా నటిస్తున్నారు. సెకండ్ లిస్ట్ యాక్ట్రెస్‌గా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు నందితా. అనుష్క సో స్వీట్... తెలుగులో రాణించిన కన్నడ హీరోయిన్లు అనగానే మనకు ముందు గుర్తొచ్చేది సౌందర్య, ఆ తర్వాత అనుష్క. 2010లో పూరీ ‘సూపర్’తో పరిచయం అయిన ఈ యోగా టీచర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చారు. ‘వదల బొమ్మాళీ’ అని ‘అరుంధతి’లో సోనూసూద్ అన్నట్టు తెలుగు ప్రేక్షకులు వదల్లేదు. అనుష్క ప్రతి సినిమాను ఇరగ చూసేశారు. 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు అనుష్క. ‘విక్రమార్కుడు’, ‘అరుంధతి’, ‘డాన్’, ‘మిర్చీ’, ‘బాహుబలి’ వంటి కొన్ని సినిమాలు ఉదాహరణ. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరితో దాదాపు యాక్ట్ చేసిన స్వీటీ ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సైలెంట్ థ్రిల్లర్‌లో, చిరంజీవి ‘సైరా: నరసింహా రెడ్డి’లో నటిస్తున్నారు. మరువలేని సౌందర్యం తాను పరభాష కథానాయిక అయినా తెలుగు ప్రేక్షకులకు ఆ భావన కలిగించలేదు సౌందర్య. అచ్చ తెలుగు హీరోయిన్‌లానే కనిపించారు. ఫ్యామిలీ హీరోయిన్గా చెరగని ముద్ర వేసుకున్నారామె. కోడి రామకృష్ణ తీసిన ‘అమ్మోరు’ సౌందర్య కెరీర్లో పెద్ద హిట్. ‘హలో బ్రదర్’, ‘మాయలోడు’, ‘నంబర్ వన్’, ‘చూడాలని ఉంది’, ‘పెదరాయుడు’, ‘పవిత్రబంధం’, ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’, ‘అంతఃపురం’, ‘అన్నయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారామె. విమాన ప్రయాణంలో జరిగిన ప్రమాదం వరకూ వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గానే కొనసాగారు సౌందర్య. ఇంకా వెనక్కి వెళ్తే... ‘పాండురంగ మహత్యం’, ‘భూకైలాస్’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమాలలో నాగేశ్వరరావు, రామారావులతో నటించిన బి.సరోజా దేవి కన్నడ కథానాయికే. తమిళనాడు మాజీ సీఎం, అప్పటి కథానాయిక జయలలిత కర్ణాటకలోనే జన్మించారు. ‘గూఢచారి 116’, ‘చిక్కడు దొరకడు’, ‘కథానాయకుడు’, ‘గండికోట రహస్యం’ సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్నారు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’ ఆమనిది బెంగుళూరే. ‘సమరసింహారెడ్డి’లో సంఘవిని ఉద్దేశిస్తూనే ‘బెంగుళూరు బాలికా చెంగు చాటు చేయక’ అంటూ ఓ పాట రాశారు. ‘చాలా బాగుంది’తో పరిచయమైన మాళవిక, జంధ్యాల ‘అహ నా పెళ్లంట’, ‘రెండురెళ్ళ ఆరు’ హీరోయిన్ రజనీ, ‘దేవి’ సినిమా హీరోయిన్ ప్రేమ కర్ణాటక ప్రాంతానికి చెందినవారే. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే... గతంలో టాలీవుడ్‌ను మురిపించిన కన్నడ కథానాయికలు చాలామందే ఉన్నారు. ‘ఇడియట్’తో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన రక్షిత ఆ సూపర్‌హిట్‌తో కొన్ని సంవత్సరాలు బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. మహేశ్‌బాబుతో ‘నిజం’, నాగార్జునతో ‘శివమణి’, బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహా’, ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’, చిరంజీవితో ‘అందరివాడు’ సినిమాల్లో కనిపించారు రక్షిత. ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిన సంజన ‘సత్యమేవ జయతే’, ‘పోలీస్ పోలీస్’, ‘దుశ్శాసన’, ‘యమహో యమా’, ’సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాల్లో కనిపించారు. భూమిక నిర్మించిన ‘తకిట తకిట’తో తెలుగు కుపరిచయమైన కన్నడ భామ హరిప్రియ. ‘పిల్ల జమిందార్’, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘జై సింహా’ వంటి సినిమాల్లో కనిపించారామె. తెలుగు సినిమాల్లో ఓ మార్క్ చూపించుకున్న మరో హీరోయిన్ ప్రణీతా సుభాష్ . పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమా ద్వారా తెలుగుకు పరిచయమైన ప్రణీతా... సిద్ధార్థ్‌తో ‘బావ’, పవన్ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్ ‘రభస’ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల్లో సూపర్ హిట్ అయిన ‘అమ్మో బాపుగారి బొమ్మో’, ‘అచ్చ తెలుగు ఆడపిల్లలా’ అనే పాటలు ఈ కన్నడ భామకు అచ్చ తెలుగమ్మాయి, బాపూగారి బొమ్మ అనే ట్యాగులిచ్చేశాయి. రీసెంట్గా ‘హలో గురూ ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాల్లోనూ నటించారు. ఎప్పటికప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో పలకరిస్తున్న లక్ష్మీ రాయ్ కూడా కన్నడ అమ్మాయే. మరి.. ఇంకా శాండిల్ వుడ్ తీరం నుంచి ఎంతమంది అందగత్తెలు వస్తారో చూడాలి. – గౌతమ్ మల్లాది -
అమ్మ వద్దంటున్న అమ్మాయిలు
అస్తిత్వం, స్థిరత్వం.. నాణేనికి రెండు వైపులు. స్థిరత్వాన్ని కోరుకుంటే.. అస్తిత్వం పోవచ్చు! అయినా సరే మహిళ ఇవాళ.. స్థిరత్వం కన్నా అస్తిత్వాన్నే కోరుకుంటోంది. స్నేహంలో.. ఉద్యోగంలో.. వివాహంలో.. అనుబంధాల్లో.. తనకు కావలసింది.. తనకు ఇవ్వవలసిందీ తనకు దక్కాల్సిందీ.. గౌరవంతో కూడిన అస్తిత్వం. ఆమె అస్తిత్వమే సమాజానికి స్థిరత్వం. అమ్మ.. (మలయాళీ ఆర్టిస్టుల అసోసియేషన్) వారి అస్తిత్వాన్ని తేలిక చేసింది. అందుకే.. ‘ఈ అమ్మ మాకు వద్దు’ అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీకీ ‘మా’ ఉన్నట్లే, మలయాళ పరిశ్రమకు ‘అమ్మ’ ఉంది. లేటెస్ట్ న్యూస్.. ఇప్పుడా అమ్మ ఒడి నుంచి ఒక్కో హీరోయిన్ వెళ్లిపోతోంది! రీమా కళింగళ్, రెమ్యా నంబీసన్, గీతూ మోహన్‌దాస్ వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది.. ‘అమ్మా.. నీకిది న్యాయమేనా?’ అని ప్రశ్నించి, వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘ముఖ్య బాధితురాలు’.. వీళ్లందరికంటే ముందే వెళ్లిపోయారు! ఎందుకు వెళ్లిపోతున్నారు? ఎందుకు వెళ్లిపోతామంటున్నారు? అమ్మ ఒడే కదా! ధైర్యంగా ఉంటుంది కదా. భరోసా ఇస్తుంది కదా! నిజమే. అయితే ఆ తల్లి ఒడిలోకి ‘దారితప్పిన పిల్లవాడు’ ఒకడు మళ్లీ వచ్చి చేరాడు. ఆ పిల్లవాడి పేరు దిలీప్. ఆ పిల్లవాణ్ణి మళ్లీ అమ్మ ఒడిలోకి రానిచ్చిన పెద్ద మనిషి మోహన్‌లాల్. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’కు (అమ్మ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే మోహన్‌లాల్ చేసిన మొదటి పని దిలీప్‌కి మళ్లీ సభ్యత్వం ఇవ్వడం! మూడు కేసుల్లో నిందితుడు దిలీప్ ఇంచుమించు స్టార్ హీరో అవొచ్చు. కేసు నడుస్తుండగా విడుదలైన అతడి సినిమా ‘రామలీల’ (2017) సూపర్‌హిట్ అయి ఉండొచ్చు. దిలీప్ అరెస్ట్ అయినందువల్ల మలయాళం ఇండస్ట్రీకి 60 కోట్ల నష్టం వచ్చి ఉండొచ్చు. కానీ అతడు కళంకితుడు. బెయిల్ మీద తిరుగుతున్న నిందితుడు. అతడి మీద కుట్ర కేసు ఉంది. కిడ్నాపింగ్ కేసు ఉంది. రేప్ చేయబోయాడన్న కేసు ఉంది. అతడి కుట్ర, కిడ్నాపింగ్, రేప్ అటెంప్ట్ అన్నీ జరిగింది ఎవరి మీదో కాదు. అమ్మ ఒడిలోనే ఉన్న సహ నటి మీద! ఆ నటికో పేరుంది. పేరున్న నటి కూడా. మనం పైన చెప్పుకున్న ‘ముఖ్య బాధితురాలు’ ఆమే! సొంత నిర్ణయంపై నిరసన దిలీప్ని ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ బయటికి పంపించగానే, ఎగ్జిబిటర్లు పంపించేశారు. ప్రొడ్యూసర్లు పంపించేశారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ కూడా పంపించేశారు. జైల్లో తప్ప ఎక్కడా దిలీప్‌కి చోటు దొరకలేదు. జూలైలో అరెస్ట్ అయి, అక్టోబర్‌లో బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ‘అమ్మ’ ఒడిలోకి వచ్చేశాడు. రావడం కాదు. ‘అమ్మ’ నూతన అధ్యక్షుల వారైన సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. దిలీప్‌కి రీ ఎంట్రీ ఇప్పించాడు. ఎవర్నీ అడగలేదు. ‘ముఖ్య బాధితురాలి’ని అసలే అడగలేదు. మోహన్‌లాల్ సొంత నిర్ణయం! ఇక దిలీప్ ఇప్పుడు మీటింగుల్లో కూర్చుంటాడు. విజయగర్వంతో ముఖ్య బాధితురాలిని, ఆమెకు సపోర్ట్ చేసిన హీరోయిన్లను కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటాడు. ఎలా భరించడం? ఎలా సహించడం? అందుకే ఒక్కొక్కరుగా అమ్మాయిలు ‘అమ్మ’ను కాదనుకుని మెట్లు దిగేస్తున్నారు. మోహన్లాల్కి చీమ కుట్టినట్లయినా ఉందా?! తెలుస్తుంది.. నేడో, రేపో మరికొందరు వెళ్లిపోతే. ‘మీటూ’ (నేను కూడా వెళ్లిపోతున్నాను) అని అసోసియేషన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతే.. మోహన్‌లాల్ ఎ1, దిలీప్ ఎ2 అవకుండా ఉంటారా? మరికొన్ని రాజీనామాలు కోళ్ల గంపలోకి పిల్లిని తెచ్చి పెట్టేశాడు మోహన్‌లాల్. అయితే ఆ గంప నుంచి భయపడి బయటికి రాలేదు రీమా, రెమ్య, గీతూ! నిరసనగా వచ్చారు. అతడిని బయటికి పంపించే వరకు లోపలికి అడుగు పెట్టేది లేదని చెప్పి మరీ వచ్చారు. ‘ఇంకా ఇక్కడ ఉండటం అర్థం లేని పని’ అన్నారు ముఖ్య బాధితురాలు. ‘ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు రెమ్యా నంబీసన్. ‘ఇప్పటికే ఆలస్యం చేశాను.. బయటికి వచ్చేయకుండా..’ అన్నారు గీతూ మోహన్‌దాస్. ‘ఇది ఒక వ్యక్తికో, ఒక అసోసియేషన్కో పరిమితమైనది కాదు. ముందు జనరేషన్వాళ్ల డిగ్నిటీ కోసం మనం బయటికి వచ్చేయాలి’.. అని రీమా పిలుపు ఇచ్చారు. వీళ్లు ముగ్గురూ డబ్లు్య.సి.సి.లో కూడా సభ్యులు. ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’! అందులో సభ్యులుగా ఉన్న పార్వతి, మంజు వారియన్, పద్మప్రియ కూడా బయటికి వచ్చేందుకు పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు. ఒకవేళ రాలేదంటే.. లోపలే ఉండి దిలీప్ని బయటికి పంపించాలని వాళ్లు అనుకుంటున్నట్లు! ఆత్మగౌరవమే ముఖ్యం లోపల్నుంచైనా, బయటి నుంచైనా పోరాటం పోరాటమే. మలయాళీ హీరోయిన్లలో అందాన్ని మించిన ఆత్మగౌరవం ఉంది ఆడవాళ్లను కించపరిచే డైలాగ్‌లు ఉన్నందుకు స్క్రీన్‌ని చింపి పోగులు పెట్టిన హిస్టరీ ఉంది. దిలీప్నే తీసుకోండి. 2017 ఫిబ్రవరిలో దిలీప్.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్లెట్ని (ముఖ్య బాధితురాలు) కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యాడు. కొంతకాలం జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు. హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. దిలీప్ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. అందరూ క్షమించేశారు. బాధితురాలు, తక్కిన హీరోయిన్లు తప్ప. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే వాళ్లుంటారు. ఉన్న ఇంటి ఆడవాళ్లనే చెరబట్టే వాళ్లు కూడా ఉంటారా?! దిలీప్ మాట వచ్చినప్పుడల్లా వాళ్లు అనుకునే మాట ఇది. వాట్సాప్ గ్రూప్‌లోంచి గూడెం పెద్ద ఎవరైనా ఒక సభ్యుడిని తీసేస్తే.. ‘రిమూవ్డ్’ అని వస్తుంది. కారణం కూడా అక్కడే తెలిసిపోతుంది. చాటింగ్‌లో జరిగిన దానికి పర్యవసానం అయి ఉంటుందది. అదే.. ‘లెఫ్ట్’ అని వస్తే.. వెంటనే తెలిసే అవకాశం లేదు. కానీ ఆ లెఫ్ట్ అయినవాళ్లు బాగా హర్ట్ అయ్యారని తెలిసిపోతుంది. ‘అమ్మ’ నుంచి ఇప్పుడు లెఫ్ట్ అవుతున్న మలయాళీ నటీమణులు కేవలం హర్ట్ మాత్రమే కాలేదు. కోపోద్రిక్తులు అయ్యారు. ఈ ఆగ్రహ జ్వాలలు చివరికి గ్రూపునే దహించి వేసినా ఆశ్చర్యం లేదు. ఈ లోపే గూడెం పెద్ద మోహనల్‌లాల్ నష్ట నివారణ చర్యలేమైనా తీసుకోవాలి. రేష్మ.. పార్వతి రెడీ..! మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ గత యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడా. ఓ ఇంటర్వ్యూలో రేష్మా ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది. అది మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్‌లకు కోపం తెప్పించింది. ‘‘మమ్ముట్టి, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్. వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టి తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). ఆ సమయంలో రేష్మకు హీరోయిన్లు అంతా తోడుగా ఉన్నారు. ఇప్పుడు రేష్మ మద్దతు ఇవ్వబోతోంది. ‘అమ్మ’నుంచి బయటికి రాబోతోంది. పార్వతి ఇంకో నటి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. గత ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ చిత్రాన్ని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. ఓ సీన్లో అతడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్‌ను కించపరిచే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. ‘ఎవరు చేస్తేనేం.. బ్యాడ్ క్యారెక్టర్’ అంది. ఫ్యాన్స్ పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పుడు ఆమెకు తక్కిన హీరోయిన్లంతా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ‘అమ్మ’నుంచి బయటికి వచ్చి తను సపోర్ట్ ఇవ్వబోతోంది పార్వతి. -
కంటిపై కునుకు పట్టనివ్వని సమంత
సాక్షి, సినిమా: సమంత కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. ఇటీవలే ‘సమంత రూథ్ ప్రభు’ పేరులో తండ్రి పేరును మార్చుకుని జీవిత భాగస్వామి ఇంటి పేరును చేర్చుకుని ‘సమంత అక్కినేని’ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చెన్నై చంద్రం హైదరాబాద్ బ్యూటీగా మారిపోయారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సహ నటీమణులకు కంటి మీద కునుకు రానీయకుండా చేస్తున్న అంశం. సమంత కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ సక్సెస్ అవుతుందా.? వీరు అసలు పెళ్లి పీటలు ఎక్కుతారా.? అన్న ఆసక్తి, అనుమానాలతో చాలా మంది ఎదురుచూశారు. నాగచైతన్య, సమంతల వివాహం విజయవంతంగా జరిగింది. అయితే వివాహానంతరం తాను నటనకు దూరం కాను అని సమంత ముందుగానే ప్రకటించినా, చాలా మంది పెళ్లి తరువాత హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయి అని అనుకున్నారు. ఇక సహ నటీమణులయితే సమంత మనకు పోటీ అవ్వదు, ఆమె అవకాశాలన్నీ తమ తలుపులు తడతాయని సంబరపడ్డారు. అలాంటి వారికే ఇప్పుడు సమంత కంటికి కునుకు పట్టనీయడం లేదు. పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మత్రం తగ్గలేదు. తెలుగు, తమిళం భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా రంగస్థలం, మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం(తెలుగులో మహానటి), తమిళంలో విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, సూపర్ డీలక్స్ చిత్రాలలో నటిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా ఇకపై గ్లామరస్ పాత్రలు చేయబోనని, నటనకు అవకాశం ఉన్న పాత్రల్నే ఎంపిక చేసుకుని నటిస్తానని అని సమంత నిర్ణయం తీసుకున్నారు. -
మెరుపు తీగలు
-
దెయ్యం పిల్ల
-
వ్యభిచార కూపంలో సినిమా నటీమణులు!
సినిమా నటీమణులు వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువై పోతున్నాయి. అన్ని భాషల నటీమణులు, దేశవ్యాప్తంగా చిక్కుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా దొరుకుతున్నారు. ఈ సంఘటనలు ఇలాగే కొనసాగితే సమాజంపై చెడుప్రభావం చూపే ప్రమాదం ఉంది. అవకాశాలు తగ్గిపోయిన సినిమా నటీమణులు వ్యభిచార కూపంలోకి ఎందుకు దిగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు కారణమా? విలాసాలకు అలవాటుపడటమా? వీరిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మానసిక దౌర్భల్యమా? నైతిక విలువలు లేకనా? తేలికగా డబ్బు సంపాదించవచ్చని అనుకోవడమా? ఇదొక ప్రధాన సామాజిక సమస్య అయినందున అన్ని కోణాలలో దీని గురించి ఆలోచన చేయవలసి ఉంది. మన దేశంలో వ్యభిచారం చట్టవ్యతిరేకం అని తెలిసి కూడా ఇంత మంది ప్రముఖులు ఈ వృత్తిలోకి ఎందుకు దిగుతున్నారో సామాజిక శాస్త్రవేత్తలతోపాటు మేథావులు, ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అవకాశాలు తగ్గిపోతే బతకడానికి మరో మార్గంలేదా? ఈ వృత్తిలోకే దిగాలా? విలువలకు కట్టుబడి చట్టబద్దమైన మార్గంలో అనేక పనులు చేసుకొని బతకవచ్చు. ఆ మార్గాలను ఎందుకు ఆలోచించరు? పండు ముసలివాళ్లు కూడా బుట్టలో పల్లీలు అమ్ముతూ బతుకుతున్నారు. కూలి పని చేసుకొని బతుకుతున్నారు. శరీరంలో శక్తి, మెదడులో ఆలోచనలు, సెలబ్రిటీగా పలువురితో పరిచయాలు ఉండి కూడా ఇటువంటి చట్టవ్యతిరేకమైన వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎందుకు? అని ఆలోచన చేయరా? బతకడానికి ఇతర చట్టబద్దమైన మార్గాలను ఎందుకు ఎన్నుకోరు? సాధారణంగా ఇటువంటి సందర్భాలలో పట్టుబడిన ఆ నటీమణులపై కొందరు జాలి చూపుతారు. ఇంత చిన్న నేరానికే ఇంత ప్రచారమా? అని అంటుంటారు. మరి కొందరు తిట్టిపోస్తారు. బతకడానికి ఈ పనే దొరికిందా? అని ప్రశ్నిస్తుంటారు. మరికొందరు ఆ విటుల గురించి ప్రశ్నిస్తుంటారు. నటీమణులు గానీ, ఇతర యువతులు గానీ వ్యభిచార కూపంలోకి దిగడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులతోపాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, మానసిక దౌర్భల్యం ...ఇవన్నీ ప్రధాన కారణాలుగా భావించవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా, మానసిక స్థితి దిగజారకుండా వారికి కౌన్సిలింగ్ ఇప్పించవలసి ఉంది. మహిళా సంక్షేమ శాఖ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక పథకాలను రూపొందించవలసిన అవరసం ఉంది. ఇటువంటి సంఘటనలు అధికమవుతూ ఉంటే సమాజాం మీద చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యభిచారం ఎక్కువగా జరిగే ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. - శిసూర్య -
చిరంజీవితో జతకట్టేది ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే కథ సిద్ధం అయింది..ఈ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవలే చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని దర్శకుడుని ఎంపిక చేయవలసి ఉందని రామ్ చరణ్ చెప్పారు. దర్శకుడు ఎవరన్నది సందిగ్ధంలో ఉంది. ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. కొంతమంది మాత్రం ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్స్‌గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఒక స్పష్టత లేదు. ఎవరిని సంప్రదిస్తున్నారనే విషయం కూడా బయటకు రాలేదు. అయితే పలువురు హీరోయిన్లు చిరంజీవి సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వినాయక్ ఇప్పటికే దర్శకుల రేసులో ఉన్నందున, అతడికి కొందరు హీరోయిన్స్ నుంచి సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. . అలాగే సన్నిలియోన్ సైతం చిరు సినిమాలో ఏదైనా పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. చిరు సినిమాలో హీరోయిన్గా నటించడానికి ప్రణీత , శ్రీయ ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. సీనియర్ నటి టబు కూడా చిరు 150వ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందో ఊహించి చెప్పడం కష్టం. టాలీవుడ్లో ఎప్పుడు ఎక్కడ విన్నా ఈ చిత్రం గురించే వినిపిస్తోంది. ఇక అభిమానులు, ప్రేక్షకులు చిరు సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో వేరే చెప్పవలసిన అవసరంలేదు. **