రీమా కళింగళ్ ,రెమ్యా నంబీసన్,గీతూ మోహన్‌దాస్
అస్తిత్వం, స్థిరత్వం.. నాణేనికి రెండు వైపులు. స్థిరత్వాన్ని కోరుకుంటే.. అస్తిత్వం పోవచ్చు! అయినా సరే మహిళ ఇవాళ.. స్థిరత్వం కన్నా అస్తిత్వాన్నే కోరుకుంటోంది. స్నేహంలో.. ఉద్యోగంలో.. వివాహంలో.. అనుబంధాల్లో.. తనకు కావలసింది.. తనకు ఇవ్వవలసిందీ తనకు దక్కాల్సిందీ.. గౌరవంతో కూడిన అస్తిత్వం. ఆమె అస్తిత్వమే సమాజానికి స్థిరత్వం. అమ్మ.. (మలయాళీ ఆర్టిస్టుల అసోసియేషన్) వారి అస్తిత్వాన్ని తేలిక చేసింది. అందుకే.. ‘ఈ అమ్మ మాకు వద్దు’ అంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీకీ ‘మా’ ఉన్నట్లే, మలయాళ పరిశ్రమకు ‘అమ్మ’ ఉంది. లేటెస్ట్ న్యూస్.. ఇప్పుడా అమ్మ ఒడి నుంచి ఒక్కో హీరోయిన్ వెళ్లిపోతోంది! రీమా కళింగళ్, రెమ్యా నంబీసన్, గీతూ మోహన్‌దాస్ వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది.. ‘అమ్మా.. నీకిది న్యాయమేనా?’ అని ప్రశ్నించి, వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘ముఖ్య బాధితురాలు’.. వీళ్లందరికంటే ముందే వెళ్లిపోయారు!
ఎందుకు వెళ్లిపోతున్నారు? ఎందుకు వెళ్లిపోతామంటున్నారు? అమ్మ ఒడే కదా! ధైర్యంగా ఉంటుంది కదా. భరోసా ఇస్తుంది కదా! నిజమే. అయితే ఆ తల్లి ఒడిలోకి ‘దారితప్పిన పిల్లవాడు’ ఒకడు మళ్లీ వచ్చి చేరాడు. ఆ పిల్లవాడి పేరు దిలీప్. ఆ పిల్లవాణ్ణి మళ్లీ అమ్మ ఒడిలోకి రానిచ్చిన పెద్ద మనిషి మోహన్‌లాల్. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’కు (అమ్మ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే మోహన్‌లాల్ చేసిన మొదటి పని దిలీప్‌కి మళ్లీ సభ్యత్వం ఇవ్వడం!
మూడు కేసుల్లో నిందితుడు
దిలీప్ ఇంచుమించు స్టార్ హీరో అవొచ్చు. కేసు నడుస్తుండగా విడుదలైన అతడి సినిమా ‘రామలీల’ (2017) సూపర్‌హిట్ అయి ఉండొచ్చు. దిలీప్ అరెస్ట్ అయినందువల్ల మలయాళం ఇండస్ట్రీకి 60 కోట్ల నష్టం వచ్చి ఉండొచ్చు. కానీ అతడు కళంకితుడు. బెయిల్ మీద తిరుగుతున్న నిందితుడు. అతడి మీద కుట్ర కేసు ఉంది. కిడ్నాపింగ్ కేసు ఉంది. రేప్ చేయబోయాడన్న కేసు ఉంది. అతడి కుట్ర, కిడ్నాపింగ్, రేప్ అటెంప్ట్ అన్నీ జరిగింది ఎవరి మీదో కాదు. అమ్మ ఒడిలోనే ఉన్న సహ నటి మీద! ఆ నటికో పేరుంది. పేరున్న నటి కూడా. మనం పైన చెప్పుకున్న ‘ముఖ్య బాధితురాలు’ ఆమే!
సొంత నిర్ణయంపై నిరసన
దిలీప్‌ని ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ బయటికి పంపించగానే, ఎగ్జిబిటర్‌లు పంపించేశారు. ప్రొడ్యూసర్లు పంపించేశారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ కూడా పంపించేశారు. జైల్లో తప్ప ఎక్కడా దిలీప్‌కి చోటు దొరకలేదు. జూలైలో అరెస్ట్ అయి, అక్టోబర్‌లో బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ‘అమ్మ’ ఒడిలోకి వచ్చేశాడు. రావడం కాదు. ‘అమ్మ’ నూతన అధ్యక్షుల వారైన సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. దిలీప్‌కి రీ ఎంట్రీ ఇప్పించాడు. ఎవర్నీ అడగలేదు. ‘ముఖ్య బాధితురాలి’ని అసలే అడగలేదు.
మోహన్‌లాల్ సొంత నిర్ణయం! ఇక దిలీప్ ఇప్పుడు మీటింగుల్లో కూర్చుంటాడు. విజయగర్వంతో ముఖ్య బాధితురాలిని, ఆమెకు సపోర్ట్ చేసిన హీరోయిన్‌లను కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటాడు. ఎలా భరించడం? ఎలా సహించడం? అందుకే ఒక్కొక్కరుగా అమ్మాయిలు ‘అమ్మ’ను కాదనుకుని మెట్లు దిగేస్తున్నారు. మోహన్‌లాల్‌కి చీమ కుట్టినట్లయినా ఉందా?! తెలుస్తుంది.. నేడో, రేపో మరికొందరు వెళ్లిపోతే. ‘మీటూ’ (నేను కూడా వెళ్లిపోతున్నాను) అని అసోసియేషన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతే.. మోహన్‌లాల్ ఎ1, దిలీప్ ఎ2 అవకుండా ఉంటారా?
మరికొన్ని రాజీనామాలు
కోళ్ల గంపలోకి పిల్లిని తెచ్చి పెట్టేశాడు మోహన్‌లాల్. అయితే ఆ గంప నుంచి భయపడి బయటికి రాలేదు రీమా, రెమ్య, గీతూ! నిరసనగా వచ్చారు. అతడిని బయటికి పంపించే వరకు లోపలికి అడుగు పెట్టేది లేదని చెప్పి మరీ వచ్చారు. ‘ఇంకా ఇక్కడ ఉండటం అర్థం లేని పని’ అన్నారు ముఖ్య బాధితురాలు. ‘ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు రెమ్యా నంబీసన్. ‘ఇప్పటికే ఆలస్యం చేశాను.. బయటికి వచ్చేయకుండా..’ అన్నారు గీతూ మోహన్‌దాస్.
‘ఇది ఒక వ్యక్తికో, ఒక అసోసియేషన్‌కో పరిమితమైనది కాదు. ముందు జనరేషన్‌వాళ్ల డిగ్నిటీ కోసం మనం బయటికి వచ్చేయాలి’.. అని రీమా పిలుపు ఇచ్చారు. వీళ్లు ముగ్గురూ డబ్లు్య.సి.సి.లో కూడా సభ్యులు. ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’! అందులో సభ్యులుగా ఉన్న పార్వతి, మంజు వారియన్, పద్మప్రియ కూడా బయటికి వచ్చేందుకు పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు. ఒకవేళ రాలేదంటే.. లోపలే ఉండి దిలీప్‌ని బయటికి పంపించాలని వాళ్లు అనుకుంటున్నట్లు!
ఆత్మగౌరవమే ముఖ్యం
లోపల్నుంచైనా, బయటి నుంచైనా పోరాటం పోరాటమే. మలయాళీ హీరోయిన్‌లలో అందాన్ని మించిన ఆత్మగౌరవం ఉంది ఆడవాళ్లను కించపరిచే డైలాగ్‌లు ఉన్నందుకు స్క్రీన్‌ని చింపి పోగులు పెట్టిన హిస్టరీ ఉంది. దిలీప్‌నే తీసుకోండి. 2017 ఫిబ్రవరిలో దిలీప్.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్‌లెట్‌ని (ముఖ్య బాధితురాలు) కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యాడు.
కొంతకాలం జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు. హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్‌స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి.
దిలీప్‌ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. అందరూ క్షమించేశారు. బాధితురాలు, తక్కిన హీరోయిన్లు తప్ప. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే వాళ్లుంటారు. ఉన్న ఇంటి ఆడవాళ్లనే చెరబట్టే వాళ్లు కూడా ఉంటారా?! దిలీప్ మాట వచ్చినప్పుడల్లా వాళ్లు అనుకునే మాట ఇది.
వాట్సాప్ గ్రూప్‌లోంచి గూడెం పెద్ద ఎవరైనా ఒక సభ్యుడిని తీసేస్తే.. ‘రిమూవ్డ్’ అని వస్తుంది. కారణం కూడా అక్కడే తెలిసిపోతుంది. చాటింగ్‌లో జరిగిన దానికి పర్యవసానం అయి ఉంటుందది. అదే.. ‘లెఫ్ట్’ అని వస్తే.. వెంటనే తెలిసే అవకాశం లేదు. కానీ ఆ లెఫ్ట్ అయినవాళ్లు బాగా హర్ట్ అయ్యారని తెలిసిపోతుంది. ‘అమ్మ’ నుంచి ఇప్పుడు లెఫ్ట్ అవుతున్న మలయాళీ నటీమణులు కేవలం హర్ట్ మాత్రమే కాలేదు. కోపోద్రిక్తులు అయ్యారు. ఈ ఆగ్రహ జ్వాలలు చివరికి గ్రూపునే దహించి వేసినా ఆశ్చర్యం లేదు. ఈ లోపే గూడెం పెద్ద మోహనల్‌లాల్ నష్ట నివారణ చర్యలేమైనా తీసుకోవాలి.
రేష్మ.. పార్వతి రెడీ..!
మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ గత యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడా. ఓ ఇంటర్వ్యూలో రేష్మా ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది. అది మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్‌లకు కోపం తెప్పించింది. ‘‘మమ్ముట్టి, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్.
వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టి తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). ఆ సమయంలో రేష్మకు హీరోయిన్‌లు అంతా తోడుగా ఉన్నారు. ఇప్పుడు రేష్మ మద్దతు ఇవ్వబోతోంది. ‘అమ్మ’నుంచి బయటికి రాబోతోంది.
పార్వతి ఇంకో నటి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. గత ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ చిత్రాన్ని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. ఓ సీన్‌లో అతడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్‌ను కించపరిచే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. ‘ఎవరు చేస్తేనేం.. బ్యాడ్ క్యారెక్టర్’ అంది. ఫ్యాన్స్ పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పుడు ఆమెకు తక్కిన హీరోయిన్‌లంతా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ‘అమ్మ’నుంచి బయటికి వచ్చి తను సపోర్ట్ ఇవ్వబోతోంది పార్వతి.
Comments
Please login to add a commentAdd a comment