ఆ ట్విస్ట్‌లు తెలుసుకోవడానికి వచ్చేస్తున్నారీ సైంటిస్ట్స్‌ | Some Stars are Pretending to be Scientists in Some Movies | Sakshi
Sakshi News home page

ఆ ట్విస్ట్‌లు తెలుసుకోవడానికి వచ్చేస్తున్నారీ సైంటిస్ట్స్‌

Published Tue, Mar 15 2022 12:08 AM | Last Updated on Tue, Mar 15 2022 12:10 AM

Some Stars are Pretending to be Scientists in Some Movies - Sakshi

నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌

అంతరిక్షంలో ఏం ఉందో తెలుసుకోవాలి.. కావాలి ఓ సైంటిస్ట్‌. అంతరిక్షానికి పంపడానికి రాకెట్‌ కావాలి.. ఆ రాకెట్‌ తయారీకి కావాలి ఓ సైంటిస్ట్‌. కళ్లు చెదిరే రంగు రాయి దొరికింది. ఆ రాయి విలువ తెలియాలంటే కావాలి ఓ సైంటిస్ట్‌. సైంటిస్ట్‌లు చేసే ట్విస్ట్‌లు భలే ఉంటాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై ఆ ట్విస్ట్‌లు చాలా మజానిస్తాయి. నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాల్లో సైంటిస్టులుగా కనిపించనున్న స్టార్స్‌ ఎవరో చూద్దాం.

మొన్నామధ్య బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హైదరాబాద్‌ చేరుకుని పరిశోధనలు చేశారు. ‘ప్రాజెక్ట్‌ కె’ సక్సెస్‌ కావడం కోసమే అమితాబ్‌ ఈ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారట. ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ అని, ఈ చిత్రానికి టైమ్‌ ట్రావెల్‌ టచ్‌ ఉందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ సైంటిస్ట్‌ పాత్రలో కనిపిస్తారన్నది తాజా వార్త. పరిశోధనల్లో భాగంగా అమితాబ్‌ చేసే ఓ ప్రయోగం వల్లే ‘ప్రాజెక్ట్‌ కె’ కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందట.

ఈ ‘ప్రాజెక్ట్‌ కె’లో సైంటిస్ట్‌గా అమితాబ్‌ ఇచ్చే ట్విస్టులు చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ  సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక హిందీలో రూపొందిన భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్‌ కపాడియా ప్రధాన తారాగణంగా నటించారు. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్ర దర్శకుడు. ఈ మూవీలో నాగార్జున పురాతత్త్వ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. నాగార్జున చేసే పరిశోధనల నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ కథ మొదలవుతుందట. అలాగే ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ ఓ కీలక పాత్ర చేశారు. షారుక్‌ సైంటిస్ట్‌ అనేది బాలీవుడ్‌ టాక్‌. శివలో (‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్‌ పాత్ర పేరు) అతీంద్రీయ శక్తులు ఉన్నాయని సైంటిస్ట్‌గా ఈ సినిమాలో షారుక్‌ ఇచ్చే ట్విస్ట్‌తోనే కథ అసలు మలుపు తిరుగుతుందట. నాగార్జున, షారుక్‌ సైంటిస్ట్‌లుగా ఆడియన్స్‌కు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారనేది ఈ ఏడాదిలోనే చూడొచ్చు.

షారుక్‌ ఖాన్‌, మాధవన్‌

‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ను ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల కానుంది. సేమ్‌ టు సేమ్‌ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున చేసిన పురాతత్త్వ శాస్త్రవేత్తగానే అక్షయ్‌ కుమార్‌ నటించారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో హిందీలో ‘రామ సేతు’ అనే చిత్రం రూపొందింది. ఇందులోనే పురాతత్త్వ శాస్త్రవేత్తగా అక్షయ్‌ కుమార్‌ నటించారు. రావణుడి బారి నుండి తన భార్య సీతను రక్షించడానికి భారతదేశం, శ్రీలంక మధ్య రాముడు నిర్మించినట్లుగా చెప్పుకుంటున్న రామసేతు అనే బ్రిడ్జ్‌ ఉన్న మాట నిజమా? కాదా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్‌. ఈ బ్రిడ్జ్‌ను పూర్తి చేయడానికి శాస్త్రవేత్తగా అక్షయ్‌ కుమార్‌ ఏం చేశారు? అనే అంశంతో కథ సాగుతుందట.

హీరోయిన్లుగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీ రోల్‌ చేశారు సత్యదేవ్‌. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్త, ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. కొన్ని అభియోగాల వల్ల నంబి నారాయణన్‌ ఇస్రో నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ పరిణామాలు, ఇస్రోలో ఆయన చేసిన పరిశోధనలు వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్‌గా మాధవన్‌ నటించడంతో పాటు దర్శకత్వం వహించి, నిర్మించారు. నటి సిమ్రాన్‌ కీలక పాత్ర చేశారు. ‘బ్రహ్మాస్త్ర’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేసినట్లుగానే ఈ చిత్రంలో కూడా షారుక్‌ అతిథిగా కనిపిస్తారని టాక్‌.

అక్షయ్‌ కుమార్‌, హన్సిక 

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ సినిమాను ఈ ఏడాది జూలై 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్‌ హన్సిక ఓ సైన్స్‌ ల్యాబ్‌లో సైంటిస్ట్‌గా జాయినయ్యారు. తన నెక్ట్స్‌ ఫిల్మ్‌ కోసమే హన్సిక సైంటిస్ట్‌గా మారారు. కణ్ణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేత్ర అనే యంగ్‌ సైంటిస్ట్‌గా కనిపిస్తారు హన్సిక. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ఆరంభమైంది. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో ఓ భారీ సైన్స్‌ ల్యాబ్‌ సెట్‌ వేశారు. షూటింగ్‌ను ఏప్రిల్‌ కల్లా పూర్తి చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్‌ పేర్కొంది. వీరితోపాటు మరికొందరు సినీ తారలు వెండితెర సైంటిస్టులుగా కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement