2020లో 10 పూర్తి | sakshi special story on tollywood heroines | Sakshi
Sakshi News home page

2020లో 10 పూర్తి

Published Sun, Jul 26 2020 4:46 AM | Last Updated on Sun, Jul 26 2020 4:52 AM

sakshi special story on tollywood heroines - Sakshi

ఇండస్ట్రీకి ప్రతి ఏడాది కొత్త ముఖాలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకునేలోపే చాలా వరకు మాయమవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు.. హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్‌ స్పాన్‌ తక్కువ. ఎంత మంది వచ్చినా కొందరికి మాత్రమే టాప్‌లీగ్‌ లో చోటు దక్కుతుంది. అలాంటి హీరోయిన్లను ఎన్ని ఏళ్లు చూసినా బోర్‌ కొట్టదంటారు ప్రేక్షకులు. ఆ నాయికలు పరిచయం అయి పదేళ్లయినా అదే ఫాలోయింగ్‌ని ఎంజాయ్‌ చేస్తారు. సమంత, శ్రుతీ హాసన్, తాప్సీ,  ప్రణీత... ఈ నలుగురూ ఇండస్ట్రీకి వచ్చి 2020తో పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీళ్ల కెరీర్‌పై స్పెషల్‌ రౌండప్‌.

జోరుగా.. హుషారుగా
‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా సౌత్‌ ఇండస్ట్రీకి పరిచయమయింది తాప్సీ. ‘మిస్టర్‌ పర్ఫెక్ట్, సాహసం, కాంచన’ వంటి హిట్‌ సినిమాల్లో నటించి, తెలుగు లో స్టార్‌ హీరోయిన్ల జాబితా లో చేరిందీ బ్యూటీ. కానీ వరుస సినిమాలు చేస్తున్నా వరుస హిట్స్‌ అందుకోలేకపోయింది. అయితే  తాప్సీ సౌత్‌ కంటే నార్త్‌ లో ఎక్కువ సక్సెస్‌లు చూస్తోంది. హిందీలో  చేసిన ‘పింక్‌’ సినిమా తాప్సీ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది.

పెర్ఫార్మన్స్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలను వరుసగా ఎంపిక చేసుకుంటూ హిందీలో స్టార్‌ అయింది. బాలీవుడ్‌లో తాప్సీ చేసిన ‘సూర్మ, ముల్క్, బద్లా, సాంద్‌ కీ ఆంఖ్, మిషన్‌ మంగళ్, థప్పడ్‌’ వంటి సిని మాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే సౌత్‌లోనూ ఈ మధ్య ఆ జోష్‌ని కొనసాగించింది. తమిళంలో ‘గేమ్‌ ఓవర్‌’, తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ వంటి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు సైన్‌ చేసి జోరుగా హుషారుగా ఉంది తాప్సీ.
 
శ్రుతి నచ్చింది
కమల్‌ హాసన్‌ కుమార్తె అంటే అడగకుండానే పాపులారిటీ వస్తుంది. దాని వెనకే ప్రెషర్‌ కూడా ఉంటుంది. అడుగు తీసి అడుగేస్తే కమల్‌తోనే పోలుస్తారు. శ్రుతికి ఎంట్రీ సులువుగా లభించినా హిట్‌ అంత త్వరగా రాలేదు. ఐరన్‌ లెగ్‌ అని బ్రాండ్‌ పడింది. ఆ తర్వాత ‘గబ్బర్‌ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్‌’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో కనిపించింది శ్రుతి. దాంతో ఐరన్‌ లెగ్‌ ముద్ర పోయింది. ప్రేక్షకులకు శ్రుతి నచ్చింది. కేవలం నటిగానే భేష్‌ అనిపించుకోవడమే కాదు.. గాయనిగా పలు హిట్‌ సాంగ్స్‌ పాడి శభాష్‌ అనిపించుకుంది.

  ‘శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజ్‌ (ఓ మై ఫ్రెండ్‌), కన్నులదా (3), డౌన్‌ డౌన్‌ డౌన్‌ (రేసుగుర్రం)’ వంటి పాటలు పాడింది. మ్యూజిక్‌ మీద దృష్టిపెడుతూ ఆ మధ్య యాక్టింగ్‌ కెరీర్‌కి చిన్న గ్యాప్‌ ఇచ్చింది. మూడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ‘క్రాక్‌’ సినిమా చేస్తోంది శ్రుతీహాసన్‌. ‘యాక్టర్‌గా 11ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. మీ అందరి అభిమానానికి, ప్రేమకి ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది శ్రుతి.

మాయ చేసింది
‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్‌గా పరిచయమయింది సమంత. అందులో స్యామ్‌ చేసిన జెస్సీ పాత్ర యూత్‌ అందర్నీ మాయలో పడేసింది. ఆ తర్వాత సమంత ఏ సినిమా చేసినా థియేటర్స్‌కి వెళ్లేలా చేసింది. టాప్‌ హీరోలతో యాక్ట్‌ చేస్తూనే, పెర్ఫార్మన్స్‌కి స్కోప్‌ ఉన్న సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌ అయింది. ‘బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మహానటి, యూ టర్న్, మజిలీ, ఓ బేబి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు స్యామ్‌ కెరీర్‌లో ఉన్నాయి. హిట్‌ సినిమాలో భాగమవ్వడమే కాదు, తను భాగమవ్వడం వల్ల హిట్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.

పెళ్లి అయితే పెద్దగా సినిమాల్లో కనిపించదు అనే అపోహను కూడా బ్రేక్‌ చేసింది ఈ అక్కినేని కోడలు. పై లిస్ట్‌లో చివరి ఐదు సినిమాలు పెళ్లి తర్వాత చేసినవే. తెలుగులోనే కాదు తమిళంలోనూ ‘కత్తి, తేరీ, ఇరుంబు దురై’ వంటి హిట్‌ సినిమాలు చేసింది సమంత. ‘‘ఇదో బెస్ట్‌ జర్నీ. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలున్నాయి. సంతోషాలు, బాధలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో నిలబడిన అందరికీ థ్యాంక్స్‌’’ అంటోంది సమంత. అన్నట్లు.. నటిగా పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమంత తన ఇన్‌ స్ట్రాగామ్‌లో 11 మిలియన్‌ (కోటీ 10 లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించిన విషయాన్ని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది.

 హిందీ జర్నీ
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయింది బెంగళూర్‌ బ్యూటీ ప్రణీతా సుబాష్‌. పవన్‌ కల్యాణ్‌ తో  ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌తో ‘రభస’,  మహేష్‌ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించింది ప్రణీత. ఈ మధ్యే రామ్‌ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించింది. సౌత్‌లో నాయికగా పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రణీత ఇప్పుడు హిందీలో కూడా జర్నీ మొదలుపెట్టింది. అజయ్‌ దేవగన్‌ ‘భూజ్‌’లో కీలక పాత్రలో కనిపించనుందామె. అలాగే ‘హంగామా’ అనే సినిమాలోనూ నటిస్తోంది ప్రణీత.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement