విడాకుల కోసం సుప్రీంకోర్టుకు హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య వివాదం వ్యవహారం రోజురోజుకు ముదరుతున్నట్లు కనిపిస్తోంది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త సంజయ్‌కపూర్, అత్తపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈ దంపతులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై కరిష్మా కోర్టుకు హాజరుకాగా, సంజయ్ కపూర్ డుమ్మా కొట్టాడు. తన ప్రాణాలకు అపాయం ఉందని పేర్కొంటూ ఈ వివాదం కేసును ముంబై నుంచి ఢిల్లీ కోర్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు.
భర్త, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కరిష్మా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు సంజయ్‌కపూర్, అతని తల్లి రాణి సురీందర్ కపూర్పై సెక్షన్ 498ఏ, 34కింద కేసు నమోదు చేశారు. కరిష్మా, సంజయ్‌కపూర్ విడాకుల కేసు ముంబయి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది. కరిష్మ, సంజయ్ ల మధ్య మనస్పర్థలు రావడంతో వీరు గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. సంజయ్ తన సంతానం ఒక్కోక్కరికి గానూ నెలకు రూ.10 లక్షలు చెల్లించడంతో పాటు విడాకుల నేపథ్యంలో రూ.14 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు.