పండుగల సీజన్ అంటే సినిమా హీరోలకు భలే క్రేజ్. ఏవైనా పండుగలు ఉన్నాయంటే వాటికోసం తమ సినిమా విడుదలను అప్పటికి వాయిదా వేసుకుంటారు, లేదా సరిగ్గా పండుగల సమయంలోనే సినిమాలు వచ్చేలా చూస్తారు. తమిళ హీరో కార్తీ (సూర్య తమ్ముడు) ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి దీపావళికి, మరొకటి సంక్రాంతికి విడుదల అయ్యేలా చూసుకుంటున్నాడు.
'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చిత్రం దీపావళికి విడుదల అవుతుండగా, బిర్యానీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. కార్తీ పూర్తిస్థాయిలో కామెడీ పండించిన 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చిత్రం దీపావళికి విడుదల అవుతుందని ఆయన తరఫున విడుదలైన ఓ ప్రకటన తెలిపింది. ఈ చిత్ర దర్శకుడు ఎం. రాజేష్. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న 'బిర్యానీ' కామెడీ థ్రిల్లర్. వాస్తవానికి బిర్యానీ చిత్రం సెప్టెంబర్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఎందుకోగానీ, సంక్రాంతికి వెళ్లిపోయింది.
గతంలో విడుదలైన రెండు చిత్రాలు శకుని, అలెక్స్ పాండ్యన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ రెండు చిత్రాల మీద కార్తీ బాగా ఆశలు పెట్టుకున్నాడు. అయితే, మరోవైపు ఇతర హీరోల సినిమాలు కూడా దీపావళి, సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి. జీవా నటిస్తున్న ఎంద్రెంద్రుం పున్నగై, విజయ్ తీస్తున్న జిల్లా, అజిత్ చేస్తున్న ఆరంభం, శంకర్ తీస్తున్న 'ఐ' ఈ కోవలో ఉన్నాయి. దీపావళి, సంక్రాంతి రెండు సీజన్లూ కోలీవుడ్కు చాలా ముఖ్యం. సంక్రాంతి అయితే ఏకంగా నాలుగు రోజుల పాటు పండగ ఉంటుంది కాబట్టి, మరింత కీలకంగా భావిస్తారు. ఆ నాలుగు రోజుల్లో థియేటర్లు పూర్తిగా నిండుతాయని, కలెక్షన్లు తారస్థాయిలో ఉంటాయని ట్రేడ్ ఎనలిస్టు త్రినాథ్ తెలిపారు. గత సంవత్సరం దీపావళికి విడుదలైన విజయ్ చిత్రం తుపాకీ అతడి కెరీర్లోనే భారీ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద దాదాపు వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది.
దీపావళి, సంక్రాంతిలకు కార్తీ సినిమాలు రెడీ
Published Mon, Sep 2 2013 12:34 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement
Advertisement