కార్తికేయ
‘‘హిట్ సాధించిన సినిమాలో నటించిన హీరో చాలా లక్కీ. ఒక యాక్టర్‌గా సినిమాలో నా కృషి పది శాతమే. దర్శకులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒక సినిమా సక్సెస్‌లో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక హిట్ మూవీ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం హీరోలే’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు..
► ఇందులో ఒంగోలులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుణ అనే యువకుడి పాత్రలో నటించాను. చీమకుర్తి క్వారీ ఫ్యాక్టరీలో గుణ వర్క్ చేస్తుంటాడు. అతని వీధి చివర ఉండే సెల్‌ఫోన్ షాప్‌లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హఠాత్తుగా అతను ఖైదీగా మారాల్సి వస్తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటినుంచి గుణ ఎలా బయటప డ్డాడు? అన్నదే కథాంశం. దర్శకుడు అర్జున్, నా అభిరుచులు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి.
► ‘ఆర్‌ఎక్స్ 100’లో నేను చేసిన పాత్రకు మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘హిప్పీ’ నాలోని మరో యాక్టింగ్ యాంగిల్‌ని బయటపెట్టింది. ‘గుణ 369’ కూడా నా నటనలోని మరో కోణాన్ని ఆడియన్స్‌కు తెలిసేలా చేస్తుందనుకుంటున్నాను. నేనేం స్టార్ హీరో అయిపోవాలనుకోవడం లేదు. సినిమా హిట్ సాధించినా, ఫెయిల్ అయినా క్యారెక్టర్ కోసం కార్తికేయ వందశాతం కష్టపడ్డాడు అని ఆడియన్స్ గుర్తిస్తే చాలు. మాలాంటి కొత్తవారికి చిరంజీవిగారే స్ఫూర్తి. మాస్ హీరో కావాలని ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మాస్ హీరో అన్నారు. అయినా అది నా ఇమేజ్ కాదు. మూవీ ఇమేజ్ అనుకుంటున్నాను. ‘ఆర్‌ఎక్స్ 100’ ఇతర భాషల్లో రీమేక్ అవుతుందంటే గర్వంగా ఉంది. కానీ నాకు రీమేక్ సినిమాలు చేయడం ఆసక్తిగా లేదు.
► నాని ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్‌గా చేస్తున్నాను అంటే అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టే. ఆ పాత్ర స్పెషల్ కాకపోయి ఉంటే విక్రమ్‌గారు నన్ను అప్రోచ్ అయ్యేవారు కాదేమో. ప్రస్తుతం శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాను. శ్రీ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాను.
Comments
Please login to add a commentAdd a comment