Guna 369 Movie
-
ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు
‘‘గుణ 369’ సినిమా చూసి మా అమ్మ తొలిసారి ఏడవటం చూశాను. ఈ చిత్రం తర్వాత నన్ను చూసి అమ్మ గర్వపడుతోంది. కొందరు మహిళలు నన్ను పట్టుకొని ఏడుస్తుంటే సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది’’ అని హీరో కార్తికేయ అన్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మించిన ఈ సినిమా ఈనెల 2న విడుదలైంది. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో జీవితాంతం గుర్తు పెట్టుకొనే చిత్రం ‘గుణ 369’. నాకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో వంద బ్లాక్ బస్టర్లు ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఇకపై నేను ఎంపిక చేసుకునే సినిమా కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రంతో బాధ్యతగల నటుడిగా పేరొచ్చింది. ఆ పేరు ఎంత ఖర్చుపెట్టినా రాదు. ఇందుకు నిర్మాతలకు థ్యాంక్స్.. దర్శకునికి రుణపడి ఉంటాను’’ అన్నారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ–‘‘గుణ 369’ విడుదల తర్వాత కర్నూలు నుండి వైజాగ్ వరకు టూర్‌కి వెళ్లాం. మంచి సినిమా తీశారు.. హ్యాపీగా ఉన్నామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాను యూత్, మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ అభినందిస్తున్నారు. ఏ దర్శకునికైనా ఇంతకన్నా ఏం కావాలి’’ అన్నారు. ‘‘హన్మకొండలో 9నెలల పసికందు శ్రీహితపై అత్యాచారం, హత్య జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ఆ పాప తల్లిదండ్రులు జగన్, చరితలు ఫోన్ చేసి, ‘గుణ 369’ సినిమా చూసి, ఫోన్ చేశాం అని చెబుతుంటే మంచి సినిమా తీశాం అనే ఫీలింగ్‌తో హాయిగా ఉంది. మా చిత్రాన్ని శ్రీహితకు అంకితమిస్తున్నాం’’ అని ప్రవీణ కడియాల అన్నారు. -
సక్సెస్ సందడి
సాక్షి, ఒంగోలు మెట్రో: స్థానిక రవి ప్రియా మాల్లో ‘గుణ 369’ చిత్ర బృందం బుధవారం సాయంత్రం సందడి చేసింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ సినిమా విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, సినిమా షూటింగ్ దాదాపుగా ఒంగోలులోనే చేయటం శుభపరిణామమన్నారు. తర్వాత చిత్రం సొంత బ్యానర్లోనే తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సినిమా దర్శకుడు అర్జున్ జంధ్యాల, కమెడియన్ మహేష్, చిత్ర యూనిట్ పాల్గొనగా, మాల్ చైర్మన్ కంది రవి శంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సాయినాథ్, మాల్ డైరెక్టర్ కె. విష్ణువర్ధన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘గుణ 369’ సక్సెస్‌మీట్
-
గుణ అనే పిలుస్తారు
‘‘హిట్లు, సూపర్హిట్లు, బ్లాక్బస్టర్లు, ఫ్లాప్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే మనకు గౌరవం తెస్తాయి.. మనల్ని చూసే విధానం బాగుంటుంది. అలాంటి పాత్ర చేసే అవకాశం ‘గుణ 369’తో వచ్చింది. ఇక నన్ను ‘ఆర్ఎక్స్ 100’ హీరో అనరు. గుణ అనే పిలుస్తారు’’ అన్నారు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందంæ కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ క్షణం కోసం వేచి చూశా. ఇప్పటివరకూ నన్ను యూత్‌ఫుల్ హీరో, షర్ట్‌లెస్, లిప్‌లాక్స్... అనే కోణంలో చూసేవారు. ఈ సినిమాతో మహిళలు నన్ను ఓన్ చేసుకుంటున్నారు. మహిళల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సింది? అనిపించింది. ఇలాంటి మంచి పాత్ర నాతో చేయించిన అర్జున్‌కి రుణపడి ఉంటా. మా కాంబినేషన్లో మరో సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘గుణ 369’ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది. మంచి విషయాన్ని ఎప్పుడు చెప్పినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాతో మేం కచ్చితంగా హిట్ కొట్టాం’’ అన్నారు ప్రవీణ.. ‘‘మా అబ్బాయి హీరో ఎందుకు అయ్యాడా? అనిపించింది. కానీ ‘గుణ 369’ చూశాక చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు కార్తికేయ తల్లి రజనీ అన్నారు. -
‘గుణ 369’ మూవీ రివ్యూ
-
‘గుణ 369’ మూవీ రివ్యూ
టైటిల్ : గుణ 369 జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్, ఆదిత్య, నరేష్, హేమ సంగీతం : చైతన్ భరద్వాజ దర్శకత్వం : అర్జున్ జంధ్యాల నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కార్తికేయ తరువాత హిప్పీ సినిమాతో అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన మాస్ యాక్షన్ ఫార్ములాను నమ్ముకొని గుణ 369గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమా కార్తికేయకు మరో సక్సెస్ అందించిందా..? తొలి ప్రయత్నంలో అర్జున్ జంధ్యాల ఏమేరకు ఆకట్టుకున్నాడు.? కథ : గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా తనని ఇష్టపడుతుంది. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు.? అసలు రాధను హత్య చేసింది ఎవరు? వాళ్లను గుణ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : యాంగ్రీ యంగ్‌మేన్‌గా కార్తికేయ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా లవర్ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్ హాఫ్‌లో మాస్ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్ మార్క్స్ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. విశ్లేషణ : యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్ జంధ్యాల ఆ కథను మాస్ కమర్షియల్ స్టైల్లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్, యాక్షన్ సీన్స్‌ను చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. సెకండ్ హాఫ్‌ను ఎమోషనల్, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : లవ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
గ్లామర్ రోల్స్‌కి ఓకే
‘‘నాది కేరళ. మా తల్లిదండ్రులు టీచర్స్. నాకు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. నటన అంటే ఇష్టం. కానీ, అమ్మానాన్న చదువు పూర్తయ్యాక ప్రయత్నించమన్నారు. ఎంటెక్ చదివాక చిన్న చిన్న యాడ్స్‌లో మోడల్‌గా చేశా. కొచ్చిలో పీజీ ఇంటర్న్‌షిప్ చేస్తుండగా మలయాళంలో సెకండ్ లీడ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది’’ అని అనఘ అన్నారు. కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనఘ పంచుకున్న విశేషాలు. ► మలయాళంలో మూడు సినిమాల్లో నటించా. హీరోయిన్గా నా తొలి సినిమా ‘నట్పే తునై’ (తమిళ్). ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగులో నా మొదటి చిత్రం ‘గుణ 369’. అర్జున్ సార్ హైదరాబాద్‌కి పిలిపించి లుక్ టెస్ట్, ఫొటోషూట్ చేశారు. ఇందులో గీత పాత్రకి సరిపోతానని అదే రోజు ఓకే చెప్పారు. ► ‘గుణ 369’ కథ చాలా బాగుంది. పైగా నా పాత్ర కూడా నచ్చింది.. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి గీత పాత్ర చేశా. నా పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కార్తికేయ మంచి సహనటుడు. తన పాత్ర బాగా రావడానికి ఎంతో కష్టపడతాడు. ► రొమాన్స్, లవ్, యాక్షన్... ఇలా అన్నీ ఈ చిత్రంలో రియలిస్టిక్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకి బాగా నచ్చుతుంది. మలయాళ, తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో పనిచేశా. అయితే టాలీవుడ్లో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంది. మంచి గౌరవం ఇస్తారు.. ఓ రాణిలా చూస్తారు. ► మలయాళ హీరోయిన్లు ఎక్కువగా టాలీవుడ్లో ఉండటం గర్వంగా ఉంది. నాకు సమంత, నయనతారలంటే ఇష్టం.. వారి క్రమశిక్షణ అన్నా కూడా ఇష్టమే. ఈ పోటీ ఇండస్ట్రీలో 10–15 ఏళ్లుగా వారు కష్టపడి రాణిస్తున్నారు. ► అల్లు అర్జున్‌గారి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చూశా.. ఆయన గ్రేట్ డ్యాన్సర్. ► ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చే యడానికి రెడీ. -
అది నా ఇమేజ్ కాదు.. సినిమాది!
‘‘హిట్ సాధించిన సినిమాలో నటించిన హీరో చాలా లక్కీ. ఒక యాక్టర్‌గా సినిమాలో నా కృషి పది శాతమే. దర్శకులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒక సినిమా సక్సెస్‌లో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక హిట్ మూవీ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం హీరోలే’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.. ► ఇందులో ఒంగోలులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుణ అనే యువకుడి పాత్రలో నటించాను. చీమకుర్తి క్వారీ ఫ్యాక్టరీలో గుణ వర్క్ చేస్తుంటాడు. అతని వీధి చివర ఉండే సెల్‌ఫోన్ షాప్‌లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హఠాత్తుగా అతను ఖైదీగా మారాల్సి వస్తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటినుంచి గుణ ఎలా బయటప డ్డాడు? అన్నదే కథాంశం. దర్శకుడు అర్జున్, నా అభిరుచులు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. ► ‘ఆర్ఎక్స్ 100’లో నేను చేసిన పాత్రకు మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘హిప్పీ’ నాలోని మరో యాక్టింగ్ యాంగిల్‌ని బయటపెట్టింది. ‘గుణ 369’ కూడా నా నటనలోని మరో కోణాన్ని ఆడియన్స్‌కు తెలిసేలా చేస్తుందనుకుంటున్నాను. నేనేం స్టార్ హీరో అయిపోవాలనుకోవడం లేదు. సినిమా హిట్ సాధించినా, ఫెయిల్ అయినా క్యారెక్టర్ కోసం కార్తికేయ వందశాతం కష్టపడ్డాడు అని ఆడియన్స్ గుర్తిస్తే చాలు. మాలాంటి కొత్తవారికి చిరంజీవిగారే స్ఫూర్తి. మాస్ హీరో కావాలని ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మాస్ హీరో అన్నారు. అయినా అది నా ఇమేజ్ కాదు. మూవీ ఇమేజ్ అనుకుంటున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ ఇతర భాషల్లో రీమేక్ అవుతుందంటే గర్వంగా ఉంది. కానీ నాకు రీమేక్ సినిమాలు చేయడం ఆసక్తిగా లేదు. ► నాని ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్‌గా చేస్తున్నాను అంటే అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టే. ఆ పాత్ర స్పెషల్ కాకపోయి ఉంటే విక్రమ్‌గారు నన్ను అప్రోచ్ అయ్యేవారు కాదేమో. ప్రస్తుతం శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాను. శ్రీ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాను. -
నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి
‘‘ఆదిత్య 369’ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవ హరించాను. ‘గుణ 369’ ప్రారంభోత్సవం రోజున స్క్రిప్ట్‌ను నా చేతులతోనే ఇప్పించారు. లైట్ బాయ్ నుంచి నిర్మాత వరకు ఒళ్లు దాచుకోకుండా పనిచేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే’’ అని ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘యజమాని బావుంటే పనిచేసేవాళ్లు బావుంటారు. నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటాను. ట్రైలర్ చూస్తుంటే ‘గుణ 369’ క్వాలిటీ తెలుస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘అర్జున్‌ని నా బ్రదర్‌లా భావిస్తాను. తను డైరెక్టర్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్, ప్రవీణ, తిరుమల్ రెడ్డి నాకు ఎంతో కావాల్సిన వాళ్లు. సినిమా చూశాను. ఎంతో విలువలతో చేశారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘నేను ఎంత బావుండాలని మా నాన్నగారు కోరుకుంటారో మా గురువు బోయపాటిగారు కూడా అంతే కోరుకుంటారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బాలుగారికి ధన్యవాదాలు. మంచి సినిమా చేశాం.. సినిమా చూసిన ప్రేక్షకులు బాగా లేదని మాత్రం చెప్పరు’’ అన్నారు. ‘‘ఓ సాధారణ వ్యక్తి జీవితకథే ఈ చిత్రం. మిమ్మల్ని (ప్రేక్షకులు) మీరు తెరపై చూసుకుంటారు’’ అన్నారు ప్రవీణ కడియాల. ‘‘మంచి కథ, కథనంతో సాగే సినిమా ఇది. ఎక్కడా ఇది మా తొలి సినిమా అనే భావన రాలేదు’’ అన్నారు తిరుమల్ రెడ్డి. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ పూర్తి చేసిన తర్వాత సినిమా హిట్ అయిపోతుందని నేను ప్రిపేర్ కాలేదు. హిట్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకుంటాం. అర్జున్ చెప్పిన కథ వినగానే సినిమా చేస్తున్నామని చెప్పాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. స్టార్ డమ్ తెస్తుందనో కాదు... నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు స్పెషల్ మూవీగా భావించాను. అర్జున్‌తో పనిచేస్తుంటే ప్రతి సెకనుకి 100 కోట్ల లాటరీ తగులుతున్నట్లు అనిపించింది. అంత కిక్ ఇచ్చింది. ‘గుణ 369’ హిట్ కావాలని అర్జున్ కంటే బాగా కోరుకున్న బోయపాటిగారికి స్పెషల్ థ్యాంక్స్ గుణ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. అనఘ, నిర్మాతలు వల్లూరిపల్లి రమేశ్, కిరణ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, ‘మా’ అధ్యక్షుడు నరేశ్, విష్ణు ఇందూరి, నటి సంజనా తదితరులు మాట్లాడారు. -
గుణ అందరికీ కనెక్ట్ అవుతాడు
కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘టీవీ సీరియల్స్. ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది. మంచి కథ కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. అర్జున్ జంధ్యాల మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఏదో తీశాం అన్నట్టుగా కాకుండా స్క్రిప్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వర్క్ చేశాం. అర్జున్ ఎలా అయితే కథను చెప్పాడో అలానే తీశాడు. కార్తికేయ చేసిన గత రెండు సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఫుల్ ఎమోషన్స్‌తో నిండిన చిత్రమిది. ప్రొడక్షన్ విషయంలో సినిమా, సీరియల్ రెండూ ఒకటే. కాకపోతే స్కేల్ మారుతుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం దగ్గర వర్క్ చేసిన కిరణ్‌తో తదుపరి చిత్రం అనుకుంటున్నాం’’ అన్నారు తిరుమల్ రెడ్డి. ‘‘టైటిల్లో 369 చూసి ‘ఆదిత్య 369’లా ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా అనుకోకూడదని ట్రైలర్లో కార్తికేయ ఖైదీ అని చూపించేశాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచి లవ్‌స్టోరీ ఇది. సామాజిక అంశాలున్న కమర్షియల్ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. సినిమాలో ఓ కీ పాయింట్ ఉంది. రివ్యూ రాసేవాళ్లు దాన్ని రివీల్ చేయొద్దని కోరుకుంటున్నాం. సినిమాలో యాక్షన్ కూడా ఎమోషన్‌తో ఉంటుంది’’ అన్నారు అనిల్ కడియాల. ‘‘ఆడపిల్లల తల్లిదండ్రులకు, బుద్ధిమంతులైన అబ్బాయిలున్న తల్లిదండ్రులకు ఈ కథ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. టీవీలో వాడే ఫార్మట్‌నే ఇక్కడ కూడా వాడాం. పాత్రలకు మనం కనెక్ట్ అయితే సినిమాకి కనెక్ట్ అయిపోతాం. ‘గుణ’ అందరికీ కనెక్ట అవుతుంది. ఇద్దరు పార్టనర్స్ ఉంటే అభిప్రాయభేధాలు రావచ్చు. కానీ అవేమీ లేకుండా మా ప్రయాణం సాఫీగా సాగింది. ఇలానే కలసి పని చేస్తాం’’ అన్నారు ప్రవీణ కడియాల. -
నో కట్స్
ఒక్క కట్ కూడా లేకుండానే ‘గుణ’ సెన్సార్ పరీక్ష పాస్ అయి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల రూపొందించిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సెన్సార్ బోర్డ్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లందరూ గ్యారెంటీ హిట్ అంటున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు. ‘‘నాలుగు గోడల మధ్య రాసిన కథ కాదిది. యథార్థ గాథే మా చిత్రం ముడిసరుకు. సహజంగా ఉంటుంది. కథలో ఉన్న సహజత్వం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింద’న్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’ అన్నారు. -
చాలామందికి నా పేరు తెలియదు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘా జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ బోయపాటిగారి సినిమా ట్రైలర్‌లా అనిపించింది. ఈ సినిమా నిర్మాతలకు ఎంటర్టైన్మెంట్ కొత్త కాదు. సినిమా నిర్మాణం మాత్రమే కొత్త. మొదటి సినిమాతోనే తనలో ఉన్న నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు కార్తికేయ. మా బ్యానర్లో బోయపాటిగారి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అర్జున్ చురుకుగా పని చేశారు. అర్జున్ దర్శకత్వం వహించిన ఈ ‘గుణ 369’ మంచి విజయం సాధించాలి. అలాగే బోయపాటిగారితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అర్జున్ మంచి సినిమా తీశాడు. ట్రైలర్ బాగుంది. కథలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. ‘‘నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది. సినిమాలో హీరోలు హీరోలుగా హీరోయిన్లు హీరోయిన్లుగా ఉండరు. తెలుగులో మంచి ఎమోషనల్ సినిమాలు రావడం లేదనేవారికి ఈ సినిమా గట్టి సమాధానంగా ఉంటుంది. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు ‘ఆర్ఎక్స్ 100’ హీరో అంటారు. ఈ సినిమా తర్వాత గుణ అని పిలుస్తారనుకుంటున్నా. అర్జున్ బాగా తీశారు. గుణ, గీతల జర్నీని సినిమా లవర్స్ మిస్ కావొద్దు’’ అన్నారు కార్తికేయ. ‘‘మాకు చెప్పిన కథను చెప్పినట్లు తీశారు అర్జున్. కార్తికేయకు నటన పట్ల అద్భుతమైన తపన ఉంది’’ అన్నారు తిరుమల్ రెడ్డి. ‘‘టీవీ షోలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి వద్దామనుకున్నాం. ‘గుణ 369’ వంటి పెద్ద సినిమాతో వస్తున్నాం. కార్తికేయ బాగా చేశాడు. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్ ఉంది’’ అన్నారు అనిల్. ‘‘నన్ను, నా కథను నమ్మిన ప్రవీణగారికి థ్యాంక్స్. తిరుమల్‌రెడ్డి, అనిల్ బాగా సహకరించారు. కార్తికేయ మంచి నటను కనబరిచారు. గుణ పాత్రలో ప్రతి ఒక్కరు తమను తాము చూసుకుంటారు’’ అన్నారు అర్జున్. -
ఆర్ఎక్స్100లా పెద్ద హిట్ కావాలి
‘‘కమల్ హాసన్‌గారి ‘గుణ’, బాలకృష్ణగారి ‘ఆదిత్య 369’ సినిమాల టైటిల్స్‌లో సగం సగం కలిపి చక్కగా కథకు తగ్గట్టు ‘గుణ 369’ టైటిల్ కుదిరింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి పరిచయమా.. తొలి పరవశమా ఇది’ ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘తొలి పరిచయమా...’ ఫీల్ గుడ్ సాంగ్లా ఉంది. ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’లా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. నిజంగా జరిగిన కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇంతకు ముందు సిల్వర్‌స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘గోల్డెన్ హ్యాండ్ ‘దిల్’ రాజుగారితో బోణీ కొట్టినందుకు మా ఆల్బమ్‌కు తిరుగుండదని నమ్మకంగా ఉన్నాం. భరద్వాజ్ కంపోజిషన్, విశ్వనాథ్ సాహిత్యం, హరిహరన్‌గారి గాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
‘RX 100’ లాగే ‘గుణ 369’ కూడా!
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో ‘తొలి పరిచయమా ఇది... తొలి పరవశమా ఇది’ అనే తొలి పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. విశ్వనాథ్ రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తొలి సాంగ్ ‘తొలి పరిచయమా..’ను నేను విడుదల చేశాను. మంచి మెలోడీ సాంగ్. ఫీల్ గుడ్ సాంగ్, అందరికీ నచ్చుతుంది. కమల్‌హాసన్ గారి గుణ.. బాలకృష్ణగారి ఆదిత్య 369 సినిమాల రెండు టైటిల్స్ సగం సగం కలిసి చక్కగా కథకు తగ్గట్టు గుణ 369 అనే టైటిల్ కుదిరింది. టైటిల్లోని 369 ఏంటో ట్రైలర్‌ను చూడగానే అర్థమైంది. ట్రైలర్ బావుంది. కార్తికేయకు, టీమ్‌కు ఆర్ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. జరిగిన కథ. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది. తప్పక ప్రతి వారికీ కనెక్ట్ అవుతుంది. ఇదివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కథ ఇది. తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది... అనే తొలి పాటను గురువారం దిల్‌రాజుగారి చేతుల మీదుగా విడుదల చేశాం. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన బాణీ వినగానే ఆకట్టుకుంటోంది. గేయ రచయిత విశ్వనాథ్ తేలిక పదాలతో మంచి భావంతో ఈ పాట రాశారు. తప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజల్లోకి వెళ్తుంది’ అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘టాలీవుడడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారి చేతుల మీదుగా మా గుణ 369 చిత్రంలోని తొలి పాట విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండదని నమ్ముతున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు చైతన్ భరద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.విశ్వనాథ్ రాసిన పదాలు కూడా ప్రేమికుల మనసుకు ఇట్టే దగ్గరయ్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలో యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్లోనూ, మా కెరీర్లోనూ గుణ 369 చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం రామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ తమ్మిరాజు. సత్య కిశోర్, శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. -
ఆగస్టు 2న ‘గుణ 369’
‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ఆగస్టు 2న విడుదల కానుంది. అనఘ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా చిత్ర సమర్పకురాలు ప్రవీణ కడియాల మాట్లాడుతూ గుణ 369 టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘తెలుగులో మంచి కథలతో సినిమా రావట్లేదని చాలా మంది అంటుంటారు. మా గుణ 369 చూసిన తర్వాత ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి మాటలు అనరు. అంతగా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్రమత్తంగా చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం గుణ 369. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను, ట్రైలర్‌ను విడుదల చేసి, ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చాలా బావుంది. ప్రేక్షకులకు అన్నివిధాలా నచ్చుతుందని నమ్మకం కలిగింద’న్నారు. -
గుణతో మంచి కెమిస్ట్రీ
మాలీవుడ్ నుంచి మరో భామ టాలీవుడ్ తలుపు తట్టారు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన సినిమా ‘గుణ 369’. ఈ సినిమాలోకి అనఘను కథానాయికగా తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘తమిళ చిత్రం ‘నట్పే తునై’లో అనఘ నటించారు. ఆ సినిమాలోని కొన్ని సీన్లు చూసి ‘గుణ 369’ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నాం. అనుఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు అర్జున్. కార్తికేయ, అనఘ జోడీ బాగుంది. ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆమె స్టార్ మెటీరియల్ అని నా నమ్మకం. అనఘ స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో డ్యాన్సుల విషయంలోనూ బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. -
పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు
‘‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా పర్వాలేదు.. కానీ, పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అంటూ నటుడు సాయికుమార్ డైలాగ్‌తో ‘గుణ 369’ చిత్రం టీజర్ ప్రారంభమవుతుంది. ‘మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు.. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో’ అంటూ కార్తికేయ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. కార్తికేయ, అనగ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్ విడుదలైన కొన్ని క్షణాల నుంచే చాలా బావుందంటూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. డైలాగులు, లొకేషన్లు, నటన, కెమెరా, కాస్ట్యూమ్స్... ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజర్ ఎంత బావుందో, సినిమా అంతకు వెయ్యి రెట్లు బావుంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్ ఉందని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందనే ప్రశంసలు అందుతున్నాయి. మూడు రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చూశాం. ప్రేక్షకులను ఆకట్టుకునే హిట్ సినిమా తీశామనే నమ్మకం వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. కార్తికేయ, మా కెరీర్లో ‘గుణ 369’ చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య కిశోర్, శివ మల్లాల. -
ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ లాంటి బోల్డ్ కంటెంట్‌తో సూపర్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ.. తాజాగా హిప్పీ చిత్రంతో పలకరించాడు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా ఈ హీరో జోరు బాగానే కొనసాగిస్తూ.. తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో రాబోతోన్న గుణ 369 చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్, పోస్టర్‌తో పాజిటివ్ టాక్ రాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏమైనా పర్లేదు కానీ.. పక్కవారి జీవితానికి ఏం కాకుడదు’., ‘మేం మీలాంటి వారికి భయపడేది మాకు ఏమైనా జరుగుతుందనీ కాదు.. మా అనుకున్నవారికి ఏమైనా అవుతుందని’ అనే డైలాగ్‌లతో సినిమా థీమ్ ఏంటో మేకర్స్ హింట్ ఇచ్చేశారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
రేపే ‘గుణ 369’ ఫస్ట్ లుక్
‘ఆర్ఎక్స్ 100’తో మంచి హిట్ కొట్టిన యంగ్ హీరో కార్తికేయ.. తన తదుపరి ప్రాజెక్ట్‌లను చకచకా పట్టాలెక్కిస్తున్నాడు. హిప్పీ దాదాపు షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకోగా.. గుణ 369 అనే మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. గుణ 369 అంటూ టైటిల్ లోగోను రిలీజ్ చేస్తూ.. కార్తికేయ బాడీషో చేసిన పోస్టర్ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రేపు (మే 29th) 11.11గంటలకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. -
కండలవీరుడు గుణ
ఫొటోలో ఉన్న ఈ కండలవీరుడు ఎవరో తెలుసా? ఆర్ఎక్స్ 100 బైక్ పేరు చెబితే కార్తికేయ అని ఇట్టే చెప్పేస్తారు. ఫస్ట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో అంత పాపులర్ అయ్యారు కార్తికేయ. ఇప్పుడు అతను హీరోగా బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గుణ 369’ అనే పేరు ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘హీరో పేరు గుణ. ‘369’ అంటే ఏంటనేది స్క్రీన్ పైనే చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఒంగోలులో ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ చేశాం. ఈ నెల 29 నుంచి మే 15 వరకు చేయబోయే భారీ షెడ్యూల్‌తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో అర్జున్ ఈ కథను తయారు చేసుకున్నాడు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుంది’’ అన్నారు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి. ‘‘కొన్ని కథలు వినగానే నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. ఇప్పటిదాకా తీసిన రషెస్ చూసుకున్నాం.. ప్రతి ఫ్రేమ్ రియలిస్టిక్‌గా వచ్చింది’’ అన్నారు కార్తికేయ. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
కార్తికేయ కొత్త చిత్రం ‘గుణ 369’
‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి ‘గుణ 369’ అనే పేరును ఖరారు చేశారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌లోగోను చిత్రయూనిట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వరకు మరో భారీ షెడ్యూల్ చేయబోతున్నాం. దాంతో ఒక సాంగ్ మినహా సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ. ‘369’ అంటే ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది’ అని అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘రియల్ లవ్ ఇన్సిడెంట్స్ తో బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ కథను అద్భుతంగా తయారు చేసుకున్నాడు. వినగానే చాలా ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేశాం. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్లో ఉంటుంది. కచ్చితంగా యువతరాన్ని ఉర్రూతలూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ క్యారక్టరైజేషన్ ‘ఆర్ ఎక్స్ 100’, ‘హిప్పీ’ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంటాయి. నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన రషెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్‌గా వచ్చింది’ అన్నారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం రామ్ సినిమాటోగ్రాఫర్.