Guna 369 Movie Review, in Telugu | ‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ | Karthikeya, Arjun Jandyala - Sakshi
Sakshi News home page

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

Published Fri, Aug 2 2019 1:02 PM | Last Updated on Fri, Aug 2 2019 6:23 PM

Guna 369 Telugu Movie Review - Sakshi

టైటిల్ : గుణ 369
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ
సంగీతం : చైతన్‌ భరద్వాజ
దర్శకత్వం : అర్జున్‌ జంధ్యాల
నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కార్తికేయ తరువాత హిప్పీ సినిమాతో అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన మాస్‌ యాక్షన్‌ ఫార్ములాను నమ్ముకొని గుణ 369గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమా కార్తికేయకు మరో సక్సెస్‌ అందించిందా..? తొలి  ప్రయత్నంలో అర్జున్‌ జంధ్యాల ఏమేరకు ఆకట్టుకున్నాడు.?

కథ :
గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్‌ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా తనని ఇష్టపడుతుంది. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు.? అసలు రాధను హత్య చేసింది ఎవరు? వాళ్లను గుణ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
యాంగ్రీ యంగ్‌మేన్‌గా కార్తికేయ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా లవర్‌ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్‌ హాఫ్‌లో మాస్‌ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్‌ చాలా బాగా చూపించాడు.

విశ్లేషణ :
యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్‌ జంధ్యాల ఆ కథను మాస్‌ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్‌, యాక్షన్‌ సీన్స్‌ను చాలా బాగా ప్రజెంట్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే లవ్‌ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. సెకండ్‌ హాఫ్‌ను ఎమోషనల్‌, యాక్షన్‌, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది.  చైతన్ భరద్వాజ్‌ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌ :
కథ
క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
లవ్‌ సీన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement