
వేసవి బరిలో...కాటమరాయుడు
మార్చి 29న ‘ఉగాది’కి రిలీజ్
పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే తెరపై ఇప్పుడు జోరు పెంచినట్లే కనిపిస్తున్నారు. ఇతర పనుల మాట ఎలా ఉన్నా, సినిమా పనులకు నికరంగా సమయం కేటాయిస్తున్నారు. ఒకపక్క ఇప్పటికే సెట్స్ మీద ఉన్న తాజా సినిమా ‘కాటమరాయుడు’ షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోపక్క నిర్మాత ఏ.ఎం. రత్నం కొత్త సినిమాకు కూడా నవరాత్రుల్లో ఆయన కొబ్బరికాయ కొట్టారు. పట్టాలెక్కడానికి కాస్తంత జాప్యమైనా, ఒకసారి పట్టాలెక్కేశాక బండి ఊపందుకోవడం సహజమే. అందుకు తగ్గట్లే ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్ కూడా స్పీడుగా సాగుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది.
వీలైనంత చకచకా ఈ సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు నూతన సంవత్సరాది కానుకగా ‘కాటమరాయుడు’ రిలీజ్ కానుంది. అంటే వచ్చే వేసవి రిలీజుల్లో బరిలో ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ ముందుగానే కర్చీఫ్ వేసేశారన్న మాట!
లుంగీ గెటప్... నాన్‌స్టాప్ షూటింగ్...
ఇలా డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ మధ్య మధ్యలో ఒకటీ అరా రోజుల విశ్రాంతి మినహా, ఎక్కడా విరామం లేకుండా షూటింగ్ చేయాలని నిశ్చయించుకున్నట్లు భోగట్టా! ‘‘ఇప్పటికే హీరోయిన్ శ్రుతీహాసన్‌తో ఒక వారం పైగా షూటింగ్ కూడా చేశాం. ప్రస్తుతం టాకీ పార్ట్ తీస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. లుంగీ కట్టు, కోర మీసంతో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ గెటప్‌లో కెమేరా ముందు ఉత్సాహంగా ఉన్నారని షూటింగ్ చూసొచ్చిన కర్ణపిశాచి కథనం.
శివబాలాజీ, అజయ్, అలీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు. గతంలో ‘గోపాల... గోపాల’తో పవన్ కల్యాణ్ మనసు చూరగొన్న దర్శకుడు కిశోర్ పార్థసాని (అలియాస్ డాలీ) కూడా తనపై నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనువైన సొంత టీమ్‌తో చకచకా షూటింగ్ చేస్తున్నారు. హిట్ సినిమా కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, పూర్తిగా తెలుగు వాతావరణం, పాత్రలతో తయారవుతున్న ‘కాటమరాయుడు’ వార్తల్ని బట్టి చూస్తే, వచ్చే వేసవిలో సినీప్రియులకు ఈ సినిమాతో పాటు ‘బాహుబలి-2’ కనువిందు కన్‌ఫర్మ్ అన్నమాట!