‘కాటమరాయుడు’పై దివ్యాంగుల ఆగ్రహం
- చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ బి.శైలజ
హైదరాబాద్: దివ్యాంగుల మనోభావాలను కించపరిచినా, ప్రయత్నించినా.. అటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ హెచ్చరించారు. సోమవారం జోగులాంబ జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కలిసి ‘కాటమరాయుడు’ సినిమాలో వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. స్పందించిన డైరెక్టర్ శైలజ ‘కాటమరాయుడు’ సినిమా డైరెక్టర్‌ను విచారించి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు.
కాటమరాయుడు సినిమా చూసి వివరాలు తనకు తెలియచేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటి మాట్లాడుతూ.. వెంటనే కాటమరాయుడు సినిమా నిలిపివేయాలని, దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల చిత్రీకరణను తొలగించాలని, సినిమా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో దివ్యాంగుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు కె.జయంతుడు, కార్యదర్శి నాగరాజు, పలువురు దివ్యాంగులు ఉన్నారు.