పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్ (కరాటే రాజా) కేసీఆర్ పాత్రలో నటిస్తున్నారు. సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిలీప్ బండారి సంగీతం అందిచారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది.
కరాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్కరించారు. నటుడు రవివర్మ టీజర్ రిలీజ్ చేసారు. అనంతరం కరాటే రాజా మాట్లాడుతూ, ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేసాను. కానీ ఉద్యమ సింహం వాటికి భిన్నంగా, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప పాత్ర’ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘కేసీఆర్ గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన కథను వీళ్లంతా ఓ టీమ్ గా ఏర్పాటై తెరకెక్కించటం చాలా సంతోషంగా ఉంది. నాలుగు పాటలు, ఫైట్లు, హీరోయిన్ పెట్టుకుని కమర్శియల్ సినిమా చేసి డబ్బులు వచ్చేలా సినిమా చేయోచ్చు. కానీ నిర్మాత కేసీఆర్ పై అభిమానంతో ఇష్టంతో సినిమా చేయడం గొప్ప విషయం. ఇలాంటి ఉద్యమనేత సినిమా యువతలో స్ఫూర్తిని నింపుతుంద’న్నారు.
చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘కేసీఆర్ కథని సినిమాగా చేయడం కష్టం. ఆయన గురించి ఎంతో కథ ఉంది. మూడు గంటల్లో చెప్పేది కాదు. అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలతో కథ తయారు చేసుకున్నాం. మంచి సందేశాత్మక సినిమా అవుతుంది.ఈ నెలాఖరున సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తాం’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ‘మంచి కథ ఇది. తెలుగు ప్రేక్షకులంతా కేసీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాత, నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మారు కాబట్టే సినిమా చేయగలిగాను. నా డైరెక్షన్ టీమ్ నాకన్నా ఎక్కువగా కష్టపడింది. అందుకే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment