
సాక్షి, సినిమా: ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించుకోవడానికి కృషి, పట్టుదల చాలా అవసరం. అలా కీర్తీసురేశ్ నటనే లక్ష్యంగా సినీ రంగప్రవేశం చేసింది. నటించడానికి ఇంట్లో అంగీకరించకపోయినా, వారిని ఒప్పించి ఇప్పుడు మెప్పు పొందుతోంది. తొలి చిత్రం నిరాశ పరిచినా దాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన ఈ యువ నటి రెండో చిత్రం నుంచే విజయ పరంపరను కొనసాగిస్తోంది. అయితే మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఆమె పాత్రను పోషించి అద్భుత అభినయంతో సావిత్రిని కళ్ల ముందించిందనే చెప్పాలి. విమర్శకులను సైతం మెప్పించిన కీర్తీసురేశ్‌కు మరోసారి సావిత్రి పాత్రలో నటించే అవకాశం తలుపు తట్టిందంటే ఆమె నటిగా ఎంత పరిణితి చెందిందో, ఎంత అంకిత భావంతో నటించిదో అర్థం చేసుకోవచ్చు.
అవును తెలుగులో ఎన్‌టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో సావిత్రి పాత్రకు ఆ చిత్ర దర్శకుడు క్రిష్ కీర్తీసురేశ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా కీర్తీసురేశ్‌కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ బ్యూటీ స్టార్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందట ఈ అమ్మడు. అర్థం కాలా? అదేనండీ కీర్తీ తన పారితోషికాన్ని పెంచేసిందట. సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. అయితే ఇదంతా వదంతులు మాత్రమేనని కీర్తీసురేశ్ కొట్టి పారేస్తోంది. మరి ఈ బ్యూటీ మాటేమిటో చూద్దామా! నేను డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ రంగంలోకి రాలేదు. మంచి కథా చిత్రాల్లో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నదే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం. దాని వైపే నా పయనం సాగుతోంది. శ్రమకు తగ్గ పారితోషికం, అది చిన్న మొత్తం అయినా సంతృప్తిగా లభిస్తే చాలు అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment