తమిళసినిమా: సావిత్రి పాత్రలో నటించాలా వద్దా అని ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తాయని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్ దర్శకుడు. తమిళంలో నడిగైయార్ తిలగం, తెలుగులో మహానటి పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటించగా జెమినీగణేశన్‌గా మలయాళ నటుడు దుల్కర్‌సల్మాన్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ క్రేజీ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో పాల్గొన్న నటి కీర్తీసురేశ్ మాట్లాడుతూ సావిత్రి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చాలా మంచి చిత్రాలు చేస్తున్నా, అలాంటి సమయంలో మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఎలా నటించేది? ఆమె జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం. అలాంటి పాత్రలో నటించడం సాధ్యమా లాంటి పలు సందేహాల మధ్య దర్శకుడు నాగ్‌అశ్విన్, నిర్మాతల నమ్మకమే ఈ చిత్రంలో తనను నటించేలా చేసింది.
తొడరి తెచ్చిన అవకాశం
తాను నటించిన తొడరి చిత్రం ఏదో ఒక రకంగా తనకు మంచి చేస్తుందని భావించాను. తొడరి చిత్రం చూసే దర్శకుడు నాగ్‌అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రలో నటింపజేయాలని భావించినట్లు చెప్పడంతో తొడరి చిత్రంపై తన నమ్మకం నిజమైందన్నారు.
యూనిట్ సమష్టి కృషితోనే..
నగిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్ర యూనిట్ సమష్టి కృషి, శ్రమకు చిహ్నం అన్నారు. సావిత్రి లాంటి గొప్ప నటిగా నటించడానికి తాను ఆమె నటించిన పలు చిత్రాలు చూశానని, నిజజీవితంలో సావిత్రి గురించి ఆమె కూతురు చాముండేశ్వరిని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న గీతరచయిత మదన్‌కార్గీ మాట్లాడుతూ కీర్తీసురేశ్, సావిత్రిగా నటించనున్నారన్న వార్త వెలువడగానే సావిత్రి పాత్రకు పట్టిన గతి అని పలువురు విమర్శించారన్నారు. తానీ చిత్రంలోని పలు సన్నివేశాలను చూశానని కీర్తీసురేశ్, సావిత్రిగా మారిపోయారని అన్నారు.
ప్రతి సన్నివేశంలోనూ కీర్తీసురేశ్ సావిత్రిలా పరకాయప్రవేశం చేశారని తెలిపారు. నటి సావిత్రి గురించి తెలియని ఈ తరం ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. సావిత్రి బాల్యం నుంచి, చివరి జీవితం వరకూ ఆవిష్కరించే చిత్రంగా నడిగైయార్ తిలగం ఉంటుందన్నారు. చిత్ర సమర్పకుడు సీ.అశ్వినీదత్ మాట్లాడుతూ తాను ఎన్‌టీ.రామారావు, చిరంజీవి వంటి ప్రముఖ నటులతో 43 చిత్రాలు నిర్మించానని అయితే ఈ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో నిర్మించిన చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment