
ఎవరికైనా కెరీర్‌లో కొన్ని చిత్రాలు మైలురాయిగా నిలిచిపోతాయి. అలా కీర్తీసురేశ్ ఎన్ని కమర్శియల్ చిత్రాల్లో నటించినా మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) ఆమె సినీ జీవితంలో మరపురాని మధురమైన చిత్రంగా నిలిచిపోతుంది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా మహానటి చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ చిత్రం తరువాత కొన్ని కమర్శియల్ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే నడుస్తోంది.
మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తోంది. ఇక తమిళంలో సర్కార్ చిత్రం తరువాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.
షూటింగ్ సెట్‌లో 100 మందిని మనం గురువులుగా చూడవచ్చునని అంది. వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్‌మెన్ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పింది. ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది.
నడిగైయార్ (మహానటి) చిత్రం తరువాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం ఇదేనని కీర్తీసురేశ్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment