'సై.. రా' అని పెట్టినందుకు ధన్యవాదాలు..
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర సినిమాకు 'సై.. రా' టైటిల్‌ను ఖరారు చేసినందుకు కేతిరెడ్డి చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో ఈ సినిమాకు మహావీర అనే టైటిల్ను నిర్ణయించారు. ఆ ప్రకటన చూసిన తరువాత మేము చిరంజీవిని కలిశామన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు ఆయన పేరు ఉంటేనే బాగుంటుందని, ఇదీ ఉయ్యాలవాడ అభిమానులందరీ కోరిక అని చిరంజీవికి చెప్పినట్లు తెలిపారు.
మా కోరికను మన్నించి కొన్ని మార్పులతో చిత్రానికి ఆ పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సై.. సై.. రా నరసింహారెడ్డి సినిమాకు సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన స్వాతంత్ర్య సమరయోధుడి కథను దేశ ప్రజలకు చూపించేందుకు ఆయన ముందుకు రావడం హర్షానీయం అని కేతిరెడ్డి అన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడుగా గుర్తించాలని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రస్తుతం కేంద్ర సాంస్కృతి శాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. త్వరలో అది కూడా నేరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ త్వరలో ఉయ్యలవాడ పోస్టల్ స్టాంప్‌ను రీలిజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధునిగా గుర్తించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేతిరెడ్డి చెప్పారు.