మిగతా ఇండస్ట్రీలకు పోటీగా పోరాడుతున్నాం | Kolar Gold Fields trailer release | Sakshi
Sakshi News home page

మిగతా ఇండస్ట్రీలకు పోటీగా పోరాడుతున్నాం

Published Sat, Nov 10 2018 2:39 AM | Last Updated on Sat, Nov 10 2018 2:39 AM

Kolar Gold Fields trailer release - Sakshi

శ్రీనిధి శెట్టి, ప్రశాంత్‌ నీల్, విజయ్, విశాల్, యష్, సాయి కొర్రపాటి

‘‘ఈ చిత్రం ట్రైలర్‌ గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్‌ సినిమా స్థాయికి పెంచేలా ఉంది. డైరెక్టర్‌ ప్రశాంత్, ప్రొడ్యూసర్‌ విజయ్‌కు అభినందనలు’’ అన్నారు కన్నడ నటుడు అంబరీష్‌. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మాతగా రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘కేజీఎఫ్‌’ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు.

డిసెంబర్‌ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ని బెంగళూరులో విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ విడుదల చేసిన సీనియర్‌ నటుడు అంబరీష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నా. తమిళంలో 5 కోట్ల బడ్జెట్‌తో ఒక్కపాట తీస్తుంటారు. మేం (కన్నడ) 5 సినిమాలు తీస్తాం. మిగతా ఇండస్ట్రీలకు పోటీగా  కన్నడ ఇండస్ట్రీ ప్రాముఖ్యత కోసం పోరాడుతున్నాం. ఆ పోరాట పటిమ నాకు ఇష్టం. చరిత్రను రాసిన రాజ్‌కుమార్‌గారి పోస్టర్‌ ఒక్కటి కూడా కర్ణాటక సెంటర్‌లో చూడలేం. అది మా దురదృష్టం.  ఈ సినిమా ప్యాన్‌ ఇండియా సినిమా అవుతుందనుకుంటున్నాను ’’ అన్నారు.


 ‘‘ రాబోయే రోజుల్లో ఇండియన్‌ సినిమాలో ప్రశాంత్‌ పేరు గుర్తుండి పోతుంది. నిర్మాత ఈ సినిమాకి అసలు హీరో.  ఆయన లేకుంటే  ఇంత భారీగా తెరకెక్కేది కాదు.  కొన్ని క్లిప్పింగ్స్‌ చూసి ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన విశాల్, సాయికొర్రపాటి, అనిల్‌ తాండన్‌కు థ్యాంక్స్‌. అలాగే బాలీవుడ్‌ స్టార్స్‌ రితేష్‌ సిధ్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌లకు కూడా థ్యాంక్స్‌. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్‌ సినిమా స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు యష్‌.


 ‘‘నేను బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళ్లి నిర్మాతగా మారాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో మా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాయి కొర్రపాటి. విశాల్‌ మాట్లాడుతూ.. ‘యష్‌ నాకు సోదరుడితో సమానం. ‘కేజీఎఫ్‌’తో కన్నడ సినిమా.. ప్యాన్‌ ఇండియా మూవీగా నిలుస్తుంది. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. ‘బాహుబలి’తో ఇది వరకే ఈ విషయం నిరూపితమైంది. ఇప్పుడు ‘కేజీఎఫ్‌’తో మారోసారి రుజువుకాబోతోంది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వాలి’’ అన్నారు. అనిల్‌ తాండన్‌ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, రోబో’ లాంటి భారీ సినిమాల తర్వాత విడుదల చేస్తున్న సౌతిండియన్‌ మూవీ ఇది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు.


‘‘నా తొలి సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు హిట్‌ అవుతుందో లేదో అనుకున్నాను. చాలా పెద్ద హిట్‌ అయింది. దాంతో నాకు నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో నిర్మాత విజయ్‌ గారు ‘కేజీఎఫ్‌’ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నా 4ఏళ్ల కల సాకారమైంది’’ అన్నారు  డైరెక్టర్‌ ప్రశాంత్‌.


‘‘అందరూ ఈ సినిమా బడ్జెట్‌ ఎంత అని అడుగుతున్నారు.. నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం. కొత్త టాలెంట్‌ బయటకు రావాలనే ఆలోచనతో చేసిన చిత్రమిది. ప్రశాంత్‌ అద్భుతమైన డైరెక్టర్‌.  యష్‌ నా తమ్ముడి లాంటి వాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నిర్మాతగా ఇది నాకో గొప్ప చిత్రం అవుతుంది’’ అన్నారు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు కన్నడ సూపర్‌స్టార్‌ పునిత్‌ రాజ్‌ కుమార్, బాలీవుడ్‌ స్టార్స్‌ రితేష్‌ సిధ్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌లు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement