ఇప్పుడు కోలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ కథానాయికల్లో నటి సాయేషా సైగల్ ఒకరు. తమిళనాట తొలి చిత్రం వనయుద్ధంతోనే మంచి పేరు తెచ్చుకున్న నటి ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ తరువాత ఆర్యతో గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన జుంగా, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను అందుకుంది. తాజాగా సూర్యతో రొమాన్స్ చేస్తోంది. మరిన్ని అవకాశాలు చర్చల్లో ఉన్నాయంటున్న ఈ బ్యూటీతో చిన్న భేటీ.
షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పడానికి ప్రాంటింగ్ వద్దంటున్నారట?
నిజానికి భాష తెలియని తారలు డైలాగులు చెప్పడానికి ప్రాంటింగ్ కోరుకుంటారు. అయితే నాకు ప్రాంటింగ్‌తో డైలాగ్స్ చెప్పడం ఇష్టం ఉండదు. కెమెరా ముందు నటిస్తున్నప్పుడు పక్క నుంచి వేరే వారు చెప్పె డైలాగ్స్‌ను అట్లాగే అప్పజెప్పడం ప్రేక్షకులను మోసం చేసే పనే అవుతుంది. సంభాషణలు బట్టి పట్టి చెప్పడంలోనే ఆ సన్నివేశానికి తగ్గ రియాక్షన్ వస్తుంది. అందుకే నేను ప్రాంటింగ్‌ను అంగీకరించను.
ప్రస్తుతం చిన్నపిల్లలపై అత్యాచారాలు అధికమవడం గురించి మీ స్పందన?
అలాంటి సంఘటనలు నిజంగా ఖండించదగ్గవి. నాకు రోజు ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చదవడం అలవాటు. ఇటీవల చెన్నైలో 11 ఏళ్ల చిన్నారికి జరిగిన దారుణం గురించి చదవగానే మనసుకు బాధనిపించింది. చిన్నారులపై ఇటువంటి ఆకృత్యాలను ఆపాలి. చట్టాలు మరింత కఠినం కావాలి. అంతే కాకుండా ప్రజల్లోనూ ఇలాంటి సంఘటనలపై అవేర్‌నెస్ రావాలి.
నటన పరంగా మీరు ఆశించేది.?
ప్రభుదేవా దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నా ను. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో విశాల్, కార్తీ హీ రోలుగా మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చాలా ఆనంద పడ్డాను. అయితే ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది.
ప్రభుదేవా దర్శకత్వంలోనే నటించాలని ఎందుకు ఆశ పడుతున్నారు?
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే డాన్స్ నేర్చుకున్నాను. నాకు 10 రకాల డాన్స్‌లు తెలుసు. అందుకే పూర్తి స్థాయి డాన్స్ ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను. అలాంటి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే సంతోషిస్తా.
మీకు తెలిసిన డాన్స్ గురించి?
ఏ విషయానైనా వెంటనే నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఎక్కువ. అందులోనూ నూరు శాతం విజయం సాధించాలనుకుంటాను. ఏదైనా కొత్తగా సాధించాలని తపిస్తుంటాను. అలా చిన్న వయసులోనే అన్ని రకాల నృత్యాలను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా సమయం దొరికితే డాన్స్ క్లాస్‌కు వెళతాను. కథక్ నృత్యం తెలుసు. సినిమాకు కావలసిన క్లాసిక్, వెస్ట్రన్ లాంటి డాన్స్ నేర్చుకున్నాను. లాఠిన్ అమెరికన్ స్టైల్‌లో సంబా, కల్సా డాన్స్ తెలుసు, అమెరికా వెళ్లి వారి బాడీలాంగ్వేజ్‌ను, ఎలా డాన్స్ చేస్తున్నారన్నది తెలుసుకున్నాను. ఇప్పుడు అదనంగా జిమ్నాస్టిక్‌ను నేర్చుకుంటున్నాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.
Comments
Please login to add a commentAdd a comment