ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే యువకుడి కథ
సామాన్య ప్రజలను ఉగ్రవాదులు ఏ విధంగా భయపెడుతున్నారు? వారి జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నారు? వారికి బుద్ధి చెప్పడానికి ఓ యువకుడు ఏం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అరిదు అరిదు’. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోకి ‘కొత్త ప్రేమ’ పేరుతో శ్రీనివాస్. ఐ (రాహుల్) అనువదించారు.
హరీష్, ఉత్తర జంటగా కేయస్ మదివానన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సీడీని ఆవిష్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘తమిళంలో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో త్వరలో విడుదల చేయనున్నాం. శ్రీరామమూర్తి రాసిన సంభాషణలు, తమన్ ఇచ్చిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది’’ అని చెప్పారు.