శశికుమార్ మొరటోడనుకున్నా!
తమిళనాడు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉందని ప్రముఖ హాస్యనటి కోవైసరళ పేర్కొన్నారు. కథానాయకుడు, నిర్మాత శశికుమార్ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించి నటించిన తాజా చిత్రం భలే వెళ్‌లైయదేవా. నటి తాన్యా కథానాయకిగా నటించిన ఇందులో కోవైసరళ, రోహిణి, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించారు. సోలై ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు సోలైప్రకాశ్ చెప్పిన కథ చాలా నచ్చిందన్నారు.
అయితే అందులో తనకు ముందుగా కళ్ల ముందు మెదిలింది బామ్మ పాత్ర అని చెప్పారు.ఈ పాత్ర పోషించే సత్తా ఇద్దరు నటీమణులకే ఉందనపించిందన్నారు.అందులో ఒకరు నటి మనోరమ, రెండోవారు కోవైసరళ అని పేర్కొన్నారు. మనోరమ ఇప్పుడు లేకపోవడంతో తమ చిత్రంలో బామ్మ పాత్రను కోవైసరళనే పోషించాలని భావించామన్నారు. ఆమె నటించడానికి అంగీకరించకుంటే ఈ భలే వెళ్‌లైయదేవా చిత్రం ఉండేది కాదన్నారు. ఇందులో హీరోను తాను కాదు కోవైసరళనే అని శశికుమార్ పేర్కొన్నారు.
కానీ చాలా సాఫ్ట్..
నటి కోవైసరళ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు శశికుమార్ చాలా మొరటోడు, తానేమో కామెడీ పీస్‌ను కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని కాస్త భయపడినట్లు పేర్కొన్నారు. అయితే చిత్రంలో నటిస్తున్నప్పుడు శశికుమార్ సినిమాల్లో చూడడానికే మొరటోడులా కనిపిస్తారని, నిజానికి చాలా సాఫ్ట్ అని తెలిసిందన్నారు. ఆయన ఎక్కువగా మాట్లాడరు కూడా అని అన్నారు. ఇక పేమెంట్ విషయంలో చెప్పనే అక్కర్లేదన్నారు. ఇంటికి వచ్చి మరీ ఇచ్చే వారని చెప్పారు. ఇప్పుడు తమిళనాడు చాలా టెన్షన్ లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భలే వెళ్‌లైయదేవా చిత్రం చూస్తే కాస్త ఓదార్పు కలుగుతుందని కోవైసరళ తెలిపారు. సమావేశంలో నటి తాన్యా, సంగిలిమురుగన్, దర్శకుడు సోలై ప్రకాశ్ పాల్గొన్నారు.