కిరాయి హంతకులు, ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం
భర్త గొంతుకు తాడు బిగించి దారుణంగా హత్య
ఒంగోలు పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
ఆ యువకుడికి అలా దగ్గరైంది..
ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్‌ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు.
ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment