క్రిష్, వెంకీల సినిమా లేనట్టేనా..?
గౌతమిపుత్ర శాతకర్ణితో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్, తన తదుపరి చిత్రాన్ని కూడా సీనియర్ హీరోతోనే చేసేందుకు ప్లాన్ చేశాడు. గురు సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ హీరోగా ఓ సక్సెస్ ఫుల్ నవల ఆధారంగా సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు. డాక్టర్ కేశవ రెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' నవల ఆధారంగా 'వీరయ్య' పేరుతో సినిమాను తెరకెక్కించాలని భావించాడు. ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కూడా కావటంతో మరో ట్యాండ్ మార్క్ సినిమా చేసిన క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు.
అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. సరైన కారణాలు వెల్లడించకపోయినా.. 'అతడు అడవిని జయించాడు' నవల విషయంలో కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసిన క్రిష్, మరో స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. అదే సమయంలో 'అతడు అడవిని జయించాడు' నవల కాపీరైట్స్ ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే క్రిష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.