ఆ కథతో ప్రేమలో పడ్డా!
‘‘కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం చూడగానే, ఆ కథతో ప్రేమలో పడిపోయా. అందుకే తెలుగు పునర్నిర్మాణ హక్కులు పొందాను. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రూతోనే తెలుగు రీమేక్ రూపొందించాను. అసభ్యతకు తావు లేని చిత్రం ఇది. సుధీర్‌బాబు, నందితల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ 19న విడుదల చేసే ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని లగడపాటి శ్రీధర్ అన్నారు.
సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కన్నడంలో ఇప్పటివరకూ నేను రూపొందించిన ఎనిమిది సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో నాకిది తొలి చిత్రం. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసిన చిత్రం ఇది’’ అని తెలిపారు. యువతకు ఈ చిత్రం ఓ గైడ్‌లాంటిదని రచయిత సాయినాథ్ అన్నారు. తన కెరీర్‌లో ఇది మంచి సినిమాగా నిలిచిపోతుందని నందిత చెప్పారు.