Krishnamma Kalipindi Iddarini
-
మహేశ్‌కు ‘పోకిరి’లా?
‘‘మహేశ్‌కు ‘పోకిరి’ ఎలాగో, నా కెరీర్లో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అలా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని మహేశ్ వీక్షించి చాలా ఎంజాయ్ చేశారు’’ అని సుధీర్‌బాబు చెప్పారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో లగ డపాటి శిరీష, శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘లక్ష్యం ముఖ్యమా, లవ్ ముఖ్యమా అనుకునే యూత్‌కు ఇదొక గైడ్. ‘ఐ లవ్ యూ’ అనే పదం చాలా పవిత్రమైనది. దాని విలువేంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఏ తరం వారికైనా నచ్చే లవ్‌స్టోరీ ఇది. ఈ సినిమాకు మంచి విజయం అందించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డెరైక్టర్ హరిగౌర, మాటల రచయిత ఖదీర్‌బాబు, నటుడు లోహిత్ పాల్గొన్నారు. -
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని టీమ్‌తో చిట్ చాట్
-
సూర్య సినిమాకు తప్పు చేశా!
ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు... * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం? బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా. * కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా? ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం. * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా? ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం. * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...? (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా. * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం? చాలా రీమేక్స్‌లో ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా. * మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు? స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు. * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...? (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను. * నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో? నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా. * మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు! మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు). * మీ రాబోయే సినిమాలు? తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం. * ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా? మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా. * మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది? స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా. - రెంటాల -
ఆ కథతో ప్రేమలో పడ్డా!
‘‘కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం చూడగానే, ఆ కథతో ప్రేమలో పడిపోయా. అందుకే తెలుగు పునర్నిర్మాణ హక్కులు పొందాను. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రూతోనే తెలుగు రీమేక్ రూపొందించాను. అసభ్యతకు తావు లేని చిత్రం ఇది. సుధీర్‌బాబు, నందితల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ 19న విడుదల చేసే ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని లగడపాటి శ్రీధర్ అన్నారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కన్నడంలో ఇప్పటివరకూ నేను రూపొందించిన ఎనిమిది సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో నాకిది తొలి చిత్రం. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసిన చిత్రం ఇది’’ అని తెలిపారు. యువతకు ఈ చిత్రం ఓ గైడ్లాంటిదని రచయిత సాయినాథ్ అన్నారు. తన కెరీర్లో ఇది మంచి సినిమాగా నిలిచిపోతుందని నందిత చెప్పారు. -
'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' న్యూ స్టిల్స్
-
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ అందరికీ నచ్చుతుంది
విశాఖపట్నం : ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాకు మంచిపేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు కథానాయిక నందితా రాజ్‌గురు. గాజువాకలో కళానికేతన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కొత్త సినిమాలున్నాయి.. కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ సినిమా పూర్తవుతుండగానే మరో రెండు సినిమాలకు సంతకం చేశాను. ఆ వివరాలు నేను చెప్పడం బాగుండదు. త్వరలోనే మీకు తెలుస్తాయి. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలు ఇష్టం.. గ్లామర్ పాత్రలే కాదు.. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలను ఇష్టపడతాను. వైవిధ్య భరితంగా ఉన్న పాత్రలన్నీ చేస్తాను. హర్రర్ పాత్రలు కూడా.. ఉద్దేశపూర్వకంగా హర్రర్ సినిమాల్లో చేయాలని కాదు, కథలో భాగంగా ఆ పాత్రలో నటిస్తాను. అది కూడా పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉంటుంది. ప్రతీ సారి సెలవులకు ఇక్కడే... విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా అమ్మమ్మగారి ఊరు. అమ్మ కూడా ఇక్కడే పెరిగింది. అందుకే నేను ప్రతీ సారి సెలవులకు ఇక్కడికే వచ్చేదాన్ని. ఇప్పుడు కూడా షూటింగ్లో బాగా అలసిపోయాననిపిస్తే సేదదీరటానికి ఇక్కడికే వస్తాను. విశాఖ ప్రజలు మంచోళ్లు.. విశాఖపట్నంలోని ప్రజలు చాలా మంచోళ్లు. ఇక్కడ ప్రశాంతత నాకు నచ్చుతుంది. నేను సెలవులకు ఇక్కడికే వస్తాను కాబట్టి ఇది నాకు కొత్తగా అనిపించదు. -
స్వచ్ఛమైన ప్రేమికులను కృష్ణమ్మ కలిపింది..
నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే... దానిని గెలిచేలా చేయడానికి ప్రకృతంతా ఏకమవుతుంది అనేది నానుడి. వాళ్లిద్దరి ప్రేమ స్వచ్ఛమైనదే. అందుకే సాక్షాత్తు కృష్ణా నదే పూనుకొని తన ప్రవాహాన్ని మార్చుకుంది. ప్రేమ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసింది. అది ప్రకృతి గెలుపు. ప్రేమ గెలుపు. రాధా కృష్ణులు ఎప్పటికీ కలవరంటారు. వాళ్లిద్దరి పేర్లు అవే. రాధ, కృష్ణ. ఇద్దరూ చిన్నప్పుడే ఒకరికొకరు స్నేహితులయ్యారు. క్లాస్‌లో తెలివిగల రాధ, చదువురాని కృష్ణకు స్ఫూర్తిగా మారింది. ఆమె నవ్వునే చూస్తూ ఆమె కళ్లను కళ్లల్లో పెట్టుకుంటూ అతడు కెరీర్లో ఒక్కొక్క మెట్టే ఎక్కాడు. కృష్ణమ్మ సాక్షిగా ఆమెను గెలుచుకుందాం అనుకున్నాడు. కాని అడ్డంకి. తను ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా మూడు సందర్భాల్లో తప్పిపోతుంది. ఇక ఆఖరి సందర్భంలో ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలి. కాని అప్పుడు కూడా అతడు ఊహించింది ఒకటి. జరిగింది ఒకటి. కాని కృష్ణమ్మ ఆశీస్సులు ఉన్న ప్రేమ వారిది. ఆ నదే వారిని కలిపింది. ఎలా? తెలియాలంటే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చూడాల్సిందే. కన్నడంలో పెద్ద విజయం సాధించిన ‘చార్మినార్’ రీమేక్‌కు మరిన్ని హంగులు, నేటివిటీ, కథాబలం జత చేసి దర్శకుడు ఆర్.చంద్రు తీసిన ఈ సినిమా ప్రతి మనసునూ తాకే సన్నివేశాలతో విడుదలకు సిద్ధమవుతుంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ తన సంస్థ రామలక్ష్మి క్రియేషన్స్ దశాబ్ద వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అందిస్తున్న క్యూట్ లవ్‌స్టోరీ ఇది. సుధీర్, నందిత ఇది వరకే హిట్ పెయిర్‌గా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో వారిరువురి మధ్య కెమిస్ట్రీ మరింత పే చేయొచ్చు. -
పదేళ్లు ఫుల్ హ్యాపీ!
‘‘ఇదొక అందమైన ప్రేమ కథ. అందరి హృదయాలనూ తాకుతుంది. ఈ నెల 25న విజయవాడలో పాటల వేడుక చేయబోతున్నాం. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి రెడీ చేస్తున్నాం’’ అని లగడపాటి శ్రీధర్ తెలిపారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమ సంస్థ ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా లగడపాటి శ్రీధర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. ‘ఎవడి గోల వాడిదే’ లాంటి సిల్వర్ జూబ్లీ సినిమాతో మా ప్రస్థానం మొదలైంది. స్టైల్, వియ్యాలవారి కయ్యాలు, పోటుగాడు చిత్రాలతో మా సంస్థ ప్రతిష్ట పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం’’ అని శ్రీధర్ చెప్పారు. -
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ప్రోమోస్ విడుదల
-
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీ స్టిల్స్
-
బావ కోసం అతిధి పాత్రలో మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు అతిధి పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం ఆగడు షూటింగ్ లో బిజీగా ఉన్న మహేశ్ బాబు తన బావ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇప్పటికి వరకు ఇతర హీరోలు నటించిన 'జల్సా', 'బాద్ షా' చిత్రాల్లో వాయిస్ ఓవర్ కే పరిమితయ్యారు. ఈ చిత్రంలో మహేశ్ కోసం ఓ ప్రత్యేక పాత్ర రూపొందించాం. మహేశ్ కు పాత్ర గురించి చెప్పగానే చేయడానికి ముందుకొచ్చారు. మా చిత్రంలో మహేశ్ కనిపించడానికి సుధీర్ ఎంతో కృషి చేశారని దర్శకుడు చంద్రు అన్నారు. ఆగడు షూటింగ్ పూర్తయిన వెంటనే మహేశ్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారన్నారు. కన్నడంలో విజయం సాధించిన చార్మినార్ అనే చిత్రం రీమేక్ గా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుధీర్ బాబు సరసన నందిత నటిస్తుండగా, గిరిబాబు, ఎంఎస్ నారాయణ, కిషోర్ దాస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Follow @sakshinews -
లగడపాటి శ్రీధర్ జన్మదిన వేడుక
-
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీ ఓపెనింగ్