సూర్య సినిమాకు తప్పు చేశా! | mistake , had not seen a release 'Sikander' movie -lagadapati sridhar | Sakshi
Sakshi News home page

సూర్య సినిమాకు తప్పు చేశా!

Published Sun, Jun 14 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

సూర్య సినిమాకు తప్పు చేశా!

సూర్య సినిమాకు తప్పు చేశా!

ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు...
 
 * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం?
 బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా.
 
* కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా?
 ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం.
 
 * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా?
 ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం.
 
 * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...?
 (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా.
 
 * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం?
 చాలా రీమేక్స్‌లో ఒరిజినల్‌లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా.
 
* మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు?
 స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు.
 
 * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...?
 (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను.
 
* నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో?
 నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా.
 
* మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు!
 మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్‌లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు).
 
* మీ రాబోయే సినిమాలు?
 తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం.
 
* ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా?
 మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా.
 
* మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది?
 స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా.     
  - రెంటాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement